కర్ణాటక: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఐదు ప్రధాన వాగ్దానాల్లో గృహ జ్యోతి కూడా ఒకటి. ఈ పథకం కింద లబ్దిదారులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సబ్సీడీ అందించనుంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు పథకానికి అర్హులైనవారిని ఆన్లైన్లోనూ, ఆఫ్ లైన్లోనూ దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
ఆహారం, విద్య, ఆరోగ్యం తోపాటు ఇతర నిత్యావసరాల ధరలు మిన్నంటుతున్న నేపథ్యంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచిత విద్యుత్ సబ్సీడీని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మిగతా నాలుగు వాగ్దానాలతో పాటు ఉచిత విద్యుత్ సబ్సీడీ పాచిక కూడా పారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సొంతం చేసుకుంది.
ఎన్నికల్లో చెప్పినట్లుగానే కర్ణాటక ప్రభుత్వం గృహ జ్యోతి పథకానికి శ్రీకారం చుట్టింది. లబ్దిదారులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించనుంది. జూన్ 18 న మొదలైన దరఖాస్తు ప్రక్రియలో ఇప్పటికే 51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
సగటు నెలవారీ వినియోగం కంటే విద్యుత్తు వినియోగం తక్కువగా ఉన్న వినియోగదారులు అందరూ ఈ పథకానికి అర్హులేనని.. 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగించుకునే వారికందరికీ ఈ సబ్సీడీ లభిస్తుందని.. 200 యూనిట్ల కంటే ఎక్కువగా వినియోగించుకునేవారు మాత్రం పూర్తి బిల్లును చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం.
దరఖాస్తు చేసుకోవడమెలా?
కర్ణాటక సేవాసంధు పోర్టల్ లోకి వెళ్లి కరెంటు బిల్లులో ఉన్నట్లుగా ఆధార్ కార్డు, కస్టమర్ ఐడి స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చెయ్యాలి. ఆఫ్లైన్లో కూడా గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. "బెంగుళూరు వన్", "గ్రామ వన్", "కర్ణాటక వన్" సెంటర్లకు వెళ్లి అక్కడ కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది కర్ణాటక ప్రభుత్వం.
ఇది కూడా చదవండి: డ్యూటీ టైమైపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలెట్లు
Comments
Please login to add a commentAdd a comment