ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకంతో రైతుల ఇంట నిజమైన సంక్రాంతి వెలుగులు నింపుతోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలంగా విశ్వసిస్తారని తెలిపారు. దీనిలో భాగంగా ప్రవేశపెట్టిన వ్యవసాయానికి వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, ముఖ్యంగా వ్యవసాయానికి విద్యుత్‌పై ఇంధన శాఖ అధికారులతో మంత్రి గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ‘రాష్ట్రంలో 18.37 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఏటా 12 వేల మిలియన్ యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.8,400 కోట్లు ఖర్చు చేస్తోంది. పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన 3–ఫేజ్ విద్యుత్ సరఫరాకు 6,663 వ్యవసాయ ఫీడర్లను మెరుగుపరచడానికి రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది.
ప్రస్తుతం యూనిట్ రూ.4.39కు కొంటున్నాం. రానున్న 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ను కొనసాగించడానికి వ్యయాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) సౌర విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే ఇస్తోంది. దీనివల్ల ఏటా దాదాపు రూ.3,230 కోట్లు ఆదా అవుతుంది’ అని మంత్రి చెప్పారు. ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment