సాక్షి, అమరావతి, ఒంగోలు, కాకినాడ: రైతన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం నాంది పలికింది. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే వైఎస్ జగన్ తన హామీపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించారు. అంతిమంగా సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల వ్యవసాయ విద్యుత్ ఫీడర్లలో 9 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ప్రయోగాత్మకంగా సన్నాహాలు చేస్తున్నారు.
ఏకబిగిన వ్యవసాయ క్షేత్రాలకు విద్యుత్ ఇవ్వడం వల్ల గ్రిడ్‌పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది? ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు, విద్యుత్ లభ్యతపై ప్రభావం వంటి అంశాలను ముందుగా పరిశీలిస్తారు. ఇందులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎక్కడెక్కడ ట్రాన్స్‌ఫార్మర్ల కెపాసిటీ పెంచాలి? వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను విభజించాలి? లోడ్ పడకుండా సాఫీగా సరఫరా చేసేందుకు ఏం చేయాలి? తదితర విషయాలపై నివేదిక రూపొందిస్తారు. దీనిపై అధ్యయనం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 9 గంటల నిరంతర విద్యుత్ పథకం అమలులోకి వస్తుంది.
18 లక్షల మంది రైతులకు ఆనందం
రాష్ట్రంలో 18 లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటికి పగలు, రాత్రి నిర్ణీత సమయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో కూలీలు ఉన్నప్పుడు విద్యుత్ లేకపోవడంతో పనులు జరగడం లేదు. అర్ధరాత్రి విద్యుత్ ఉన్నా కూలీలు లేకపోవడంతో ఉపయోగం ఉండటం లేదు. చీకట్లో బోర్లు ఆన్ చేసేందుకు వెళ్తూ రైతన్నలు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ పరిస్థితిని పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పగటి పూట 9 గంటల విద్యుత్ అందిస్తానని భరోసా ఇచ్చారు. వాస్తవానికి వేసవి మినహా ఇతర కాలాల్లో పగటిపూట విద్యుత్ డిమాండ్ సాధారణంగానే ఉంటుంది. వ్యవసాయానికి విద్యుత్ ఇచ్చినా గ్రిడ్‌పై పెద్దగా లోడ్ పడదు. కానీ రాత్రిపూట ఇవ్వడం వల్ల, అదే సమయంలో గృహ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండి అధిక లోడ్‌తో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీంతో వారాల తరబడి విద్యుత్ సరఫరా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక నుంచి ఈ బాధలు ఉండవని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తోంది.
రెండు షిఫ్టుల్లో సరఫరా!
తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ పథకంపై రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదివారం ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. వాస్తవ పరిస్థితిని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ మంత్రి బాలినేనికి వివరించారు. రాష్ట్రంలో 11కేవీ వ్యవసాయ ఫీడర్లు 6,663 ఉన్నాయని, ఇందులో కేవలం 1,712 (26 శాతం) ఫీడర్లకు మాత్రమే అదనంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. అదనపు అత్యధిక సామర్థ్యం గల 16 సబ్ స్టేషన్లు (ఈహెచ్‌టీ), 32 కెపాసిటర్ బ్యాంకులు, 52 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 112 కిలోమీటర్ల అదనపు హై ఓల్టేజీ లైన్లు వేయాల్సి ఉందన్నారు. దీనికి రూ.1,700 కోట్ల నిధులు అవసరమని వివరించారు. ప్రస్తుతం 26 శాతం వ్యవసాయ ఫీడర్లు పగలు 5 గంటలు, రాత్రి 4 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొంతమందికి, ఉదయం 9 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరో దఫా విద్యుత్ ఇచ్చే ప్రతిపాదనలను మంత్రి వద్ద ఉంచారు. కాగా, మంత్రి బాలినేని ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు గృహ వినియోగానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారు.
ఆక్వా రైతులకు సబ్సిడీ ధరలపై కరెంటు ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ముఖ్యమంత్రి జగన్ పీపీఏల విషయాన్ని ఇటీవల తిరుపతిలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. దీంతో పీపీఏలపై సమీక్షించి కొనుగోలు ధరలు అడ్డగోలుగా ఉంటే వాటిని సవరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ సరఫరాకు కొత్తగా మౌలిక సదుపాయాలు అవసరం లేని ప్రాంతాల్లో ముందుగా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కన్నబాబు అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment