భూసార పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయం
ప్రభుత్వ చొరవతో పెరిగిన వైనం
రైతులను చైతన్య పరుస్తున్న అధికారులు
పిఠాపురం: అధునాతన వ్యవసాయంలో మితిమీరిన రసాయనాలు వాడడం వల్ల పసిడి పంటలు పండే భూములు సహజ శక్తిని కోల్పోయాయి. అలాంటి పరిస్థితుల్లో నేలలను పునరుజ్జీవింప చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూములను సారవంతం చేసే దిశగా అడుగులు వేయాలని, ఎరువులు.. పురుగు మందులకు చెక్ పెట్టి ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
దీంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూసారం సాధించే దిశగా నవ ధాన్యాల సాగుకు ప్రభుత్వం తోడ్పాటు ఇచ్చే చర్యలు తీసుకుంది. పచ్చి రొట్ట సాగుతో పచ్చని పంటలు పండే విధంగా ప్రకృతి వ్యవసాయంపై అధికారులు రైతుల్లో చైతన్యం తీసుకువస్తున్నారు.
నవ ధాన్యాల సాగుతో భూసారం పెంపు
వివిధ కారణాలతో క్రమంగా భూములు తమ బలాన్ని కోల్పోతున్నాయి. దీంతో సూక్ష్మ పోషక లోపాలు బయటపడుతున్నాయి. ఫలితంగా భారీ పెట్టుబడులు పెట్టినా ఆశించిన దిగుబడులు రాని పరిస్థితి నెలకొంది. పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు కాక రైతులు నష్టపోతున్నారు. రానున్న రోజుల్లో భూసారం లేక ఏ పంటలు వేసినా పండని పరిస్థితులు నెలకొననున్నాయి. వాటిని అధిగమించడానికి నవ ధాన్యాల సాగు చేపట్టారు. వీటిని సాగు చేసి భూమిలో కలియ దున్నడం వల్ల భూమిలో సూక్ష్మ పోషక విలువలు వృద్ధి చెంది, భూసారం పెరిగి ఏది సాగు చేసినా బాగా పండుతుంది.
భూమి సారవంతంగా ఉండేందుకు దోహద పడే సూక్ష్మ జీవులు వృద్ధి చెంది నత్రజని స్థిరీకరణ జరిగి మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరిగి భూసారాన్ని మరింత పెంచుతాయి. చౌడు సమస్యను నివారించడంతో పాటు నేల నుంచి వచ్చే తెగుళ్లను సైతం ఈ పైర్లు అరికడతాయి. నవ ధాన్యాలు సాగు చేసి దున్నిన భూమిలో పండించిన ధాన్యంలో పోషకాల విలువలు పెరిగినట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో నిర్ధారించారు.
నవ ధాన్యాల సాగు
నవ ధాన్యాలు అంటే నవగ్రహాల పూజలకు వాడే ధాన్యాలుగానే చాలామందికి తెలుసు. కేవలం దైవ పూజలకు మాత్రమే వాడే నవ ధాన్యాలు ఇప్పుడు రైతుకు వరంగా మారాయి. గోధుమలు, వరి, కందులు, పెసలు, మినుములు, శనగలు, బొబ్బర్లు, నువ్వులు, ఉలవలు వంటి తొమ్మిది రకాల నవ ధాన్యాలు ఇప్పుడు భూసార పెంపులో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. వీటితో పాటు మరో 22 రకాల ధాన్యం రకాల విత్తనాలను ప్రభుత్వం రైతులకు పంపిణీ చేస్తోంది.
పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు తదితర సహజంగా లభించే ఎరువులు సామాన్య రైతుకు లభ్యం కావడం భారంగా మారింది. వాటి స్థానంలో ప్రతీ రైతుకు అందుబాటులో ఉండే సహజ సిద్ధ ఎరువుల తయారీకి నవ ధాన్యాల సాగు ఒక వరంగా మారింది. జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట సాగుతో పాటు నవ ధాన్యాల సాగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తొమ్మిది రకాల ధాన్యాలను రబీకి చివరిలో జల్లుకుని కోతలు పూర్తయ్యాక వాటిని కలియదున్నడం ద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చు. ఈ విషయంలో అధికారుల సూచనలు, సలహాలతో రైతులు నవ ధాన్యాల సాగు చేపట్టారు.
కాకినాడ జిల్లాలో నవ ధాన్యాల సాగు లక్ష్యం– 53,253 ఎకరాలు
సాగు చేయడానికి నిర్ణయించిన రైతుల సంఖ్య– 49,895
ఇప్పటి వరకు సాగయిన భూములు – 26,846 ఎకరాలు
విత్తనాలు తీసుకున్న రైతులు – 26,680 మంది
పంపిణీ చేసిన విత్తనాలు – 26 టన్నులు
సాగు చేసిన రైతులు – 26,564 మంది
పంపిణీ చేస్తున్న విత్తనాలు – 31 రకాలు
మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి
గత ఏడాది అధికారులు ఇచ్చిన విత్తనాలు చల్లి కలియ దున్నడం వల్ల చాలా వరకు ఎరువుల వాడకం తగ్గింది. పూర్వం పశువుల పెంటతో పాటు పచ్చిరొట్ట ఎరువులు వాడే వారు. రానురాను వాటిని మానేసి రసాయనిక ఎరువులు వాడడం ప్రారంభించాక పెట్టుబడులు పెరిగిపోయాయి. మళ్లీ ఇప్పుడు నవధాన్యాలు నాటి దున్నడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో ప్రభుత్వం రైతులకు మంచి అవకాశాలు కల్పిస్తోంది.
నవ ధాన్యాల సాగు రైతులకు చాలా మంచిది. వీటి వల్ల పెట్టుబడులు తగ్గడంతో పాటు రసాయనిక ఎరువులు లేని పంటలు అందుబాటులోకి వస్తాయి. నేను రెండు ఎకరాల్లో నవ ధాన్యాల సాగు చేశాను. ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు ఇవ్వడంతో పాటు ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇవి సాగు చేయడం వల్ల భూమి సారవంతం కావడంతో ఎరువులు పెద్దగా వేయాల్సిన అవసరం లేకుండా తక్కువ పెట్టుబడితో నాణ్యత గల పంటలు వస్తున్నాయి. – వారణాశి కామేశ్వరశర్మ, నర్శింగపురం, పిఠాపురం మండలం
జిల్లాలో 53 వేల ఎకరాల్లో నవ ధాన్యాల సాగు లక్ష్యం
జిల్లాలో ఈ ఏడాది సుమారు 53 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా నవ ధాన్యాల సాగుకు లక్ష్యంగా నిర్ణయించాం. ఇప్పటికే 26 టన్నుల విత్తనాలు పంపిణీ చేయగా 26 వేల మంది రైతులు తమ పొలాల్లో 25 వేల ఎకరాల్లో విత్తనాలు వేసుకుని నవ ధాన్యాల సాగు చేపట్టారు. రబీ పంట చివరిలో నవ ధాన్యాలను చల్లి మొక్కలు ఏపుగా పెరిగిన తరువాత ఖరీఫ్‌కు ముందు కలియ దున్నడం వల్ల భూముల్లో పోషక విలువలు వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. తద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గడంతో పాటు తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంటలు పండించగలుగుతారు.
ఇలా నాలుగు సంవత్సరాలు నవ ధాన్యాలు సాగు చేసి దున్నడం వల్ల భూసారం సహజ సిద్ధంగా పెరిగి రసాయనిక ఎరువుల అవసరం లేకుండా పంటలు పండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని గ్రామాల్లోను రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా చైతన్యం తీసుకువచ్చాం. ప్రభుత్వం విత్తనాల పంపిణీ చేస్తుండడంతో రైతుల ముందుకు వస్తున్నారు. త్వరలోనే లక్ష్యం పూర్తి చేస్తాం. ఎకరానికి 10 కేజీల చొప్పున విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తున్నాం. – ఎలియాజరు, జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment