
చికిత్స పొందుతున్న నర్సింగ్ విద్యార్థినులు
ప్రకాశం, కాకినాడ జిల్లాల్లో ఘటనలు
ఒంగోలులో 10మంది విద్యార్థినులు,ఏలేశ్వరంలో 26 మంది కార్మికులకు చికిత్స
ఒంగోలు టౌన్/ఏలేశ్వరం: ఆహారం వికటించడంతో ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వగా, కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని అవంతి ఫ్రోజన్ ఫుడ్ కంపెనీలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రాంనగర్ 8వ లైనులో ఒక ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో ఏపీతోపాటు కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 360మందికి పైగా విద్యార్థినులు బీఎస్సీ నర్సింగ్ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నారు.
రెండురోజుల క్రితం ఆహారం వికటించి 10మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం బయటకు పొక్కకుండా కాలేజీ యాజమాన్యం గుట్టుగా ఉంచింది. వాంతులు, విరేచనాలు అవడంతో నెల్లూరు బస్టాండ్‌వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటికి నలుగురు విద్యార్థినులు డిశ్చార్జ్ కాగా, సోమవారం మరో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి విద్యార్థినులు, డాక్టర్లు, కళాశాల కరస్పాండెంట్ పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో ఈ వ్యవహారం అనుమానాస్పదంగా మారింది. మీడియాను సైతం కాలేజీ మెస్‌ను పరిశీలించేందుకు అనుమతివ్వకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కాకినాడ అవంతి కంపెనీలో...
కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం యర్రవరంలోని అవంతి ఫ్రోజన్ ఫుడ్ కంపెనీలో ఆహారం వికటించి 26 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ కంపెనీలో రొయ్యలను శుద్ధి చేసి, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. సుమారు వెయ్యి మంది పని చేస్తున్నారు. వీరితో పాటు సమీప ప్రాంతాల నుంచి సుమారు 1,500 మంది వరకూ పని చేస్తుంటారు. వీరందరికీ కంపెనీ క్యాంటీన్‌లోనే భోజన వసతి ఉంటుంది. రోజూ మాదిరిగానే పలువురు కార్మికులు క్యాంటీన్‌లో భోజనం చేయగా 26 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని జగ్గంపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు.
వీరిలో 21 మంది డిశ్చార్జి కాగా, ఐదుగురు చికిత్స పొందుతున్నారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి రావడంతో అధికారులు స్పందించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) నరసింహ నాయక్, జిల్లా ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ జగ్గంపేట ఆస్పత్రిని సందర్శించారు. అనంతరం అవంతి కంపెనీలో తనిఖీలు చేశారు. కార్మికుల అస్వస్థతకు తాగునీరు కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. నీటి శాంపిల్స్ సేకరించినట్టు చెప్పారు. ఈఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు.