
అనాథ మృతదేహాలకు స్వయంగా అంత్యక్రియలు
ఇప్పటి వరకూ 1,153 దేహాలకు అంతిమ సంస్కారాలు
కాకినాడ క్రైం: జీవన గమనంలో మరణం చివరి మజిలీ. తమ వారంటూ లేని జీవితం ఎంత దుర్భరమో.. చరమాంకంలో దిక్కు లేని మరణం పొందడం అంతకు మించిన దయనీయమైనది. తమను పోషిస్తూ, తమ బాగోగులు అడిగే వారంటూ ఎవరూ లేని అనాథలు, ఒంటరివాళ్లమనే వేదనతో బతుకీడ్చి ప్రాణాలొదిలితే.. జీవాన్ని విడిచేసిన దేహాన్ని సొంత కుటుంబీకులే వివిధ కారణాలతో ఆమడ దూరాన వదిలేస్తే.. ఏ బంధమూ లేని ఆ వ్యక్తి మాత్రం తానున్నానంటూ ముందుకొస్తాడు. ఆఖరి మజిలీలో ఆతీ్మయుడిగా, కాటికి చేర్చి కన్నబిడ్డకు మించి బాధ్యతను మోస్తాడు. ఆ దేహాన్ని తుది మజిలీకి సిద్ధం చేస్తాడు. పూడ్చడమైనా.. దహనమైనా తన చేతులతోనే చేస్తాడు. రెక్కాడితేనే కానీ డొక్కాడని ఆర్థిక దుస్థితిలోనూ మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచే ఆ వ్యక్తి పేరు కూపర్ భాను అంబేద్కర్.
ఎవరీ అంబేద్కర్..
కాకినాడ ప్రతాప్ నగర్‌కు చెందిన 49 ఏళ్ల అంబేద్కర్ నిరుపేద డ్రైవర్. భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు లోకేష్ ఆకాష్ ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఓ రాజకీయ నాయకుడి బంధువు వద్ద కారు డ్రైవర్‌గా అంబేద్కర్ పని చేశాడు. ఓ రోజు ఇంటి సమీపంలో ఓ బిచ్చగాడు చనిపోతే మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టరులో ఎక్కించడం చూసి అతడి మనసు వికలమైంది. అటువంటి చావు ఎవ్వరికీ రాకూడదలని తల్లడిల్లిపోయాడు. అటువంటి వారి కోసం ఏదో ఒకటి చేయాలని సంకల్పించాడు, ఉద్యోగం మానేసి అనాథ మృతదేహాల తుది మజిలీని తన చేతులతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై ఆలోచన సాగిస్తూనే కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేస్తూ బతుకు బండి నడిపేవాడు.
కాకినాడలోని ఓ సంస్థలో అనాథ మృతదేహాల తరలింపునకు 2007లో ‘ఆత్మబంధు’ పేరిట ఓ వాహనం సిద్ధమైందని తెలుసుకున్న అంబేద్కర్.. అందులో పని చేస్తానంటూ అక్కడి అధికారులను సంప్రదించాడు. తాము తగిన జీతం ఇవ్వలేమని వారు చెప్పగా.. భార్యాబిడ్డలకు అన్నం పెట్టే అంత మొత్తం చాలని, తనకు సేవాభాగ్యం కలిపంచాలి కోరాడు. అంబేద్కర్ సంకల్పం ముందు తల వంచిన ఆ సంస్థ ప్రతినిధులు అనాథ దేహాల తరలింపు వాహనానికి అంబేద్కర్‌ను డ్రైవర్‌గా నియమించారు. ఆ తరువాత 2017లో అతడు కాకినాడకు చెందిన కండిబోయిన ధర్మరాజు నిర్వహిస్తున్న కండిబోయిన వారి శ్రీ స్వచ్ఛంద సేవా సంస్థలో చేరాడు.
అక్కడ వాహనం నడపడంతో పాటు పూర్తి స్థాయిలో అనాథ మృతదేహాలను మోసుకెళ్లడం, తరలించడం వంటి పనులు కూడా అతడికి అప్పగించారు. అది మొదలు సంస్థ ఆదర్శాలను మించి సేవా మార్గంలో అంబేద్కర్ పయనించాడు. కుళ్లి, శరీర భాగాలు తెగిపోయిన దేహాల నుంచి, గుర్తు తెలియని మృతదేహాల వరకూ.. అందరూ ఉండి అనాథలుగా మిగిలిన దేహాల నుంచి.. ఎవరూ లేని అనాథల వరకూ స్వయంగా అతడే అంత్యక్రియలు నిర్వహించేవాడు. గతంలో అంబేద్కర్ పని చేసిన సంస్థ అతడు లేక తమ సేవలనే నిలిపివేసిందంటే అతడి నిబద్ధత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 2007 నుంచి ఇప్పటి వరకూ అంబేద్కర్ మొత్తం 1,153 అనాథ మృతదేహాలను కాటికి తరలించాడు. వీరిలో తలకొరివి పెట్టినవీ ఉన్నాయి.
కోవిడ్ వేళ అసమాన సేవలు
కోవిడ్ వేళ అంబేద్కర్ అసమాన సేవలు అందించాడు. వైరస్ సోకి, మృతి చెందిన వారి దేహాలు తాకడం ప్రాణాంతకమని తెలిసినా స్వయంగా భుజాలపై మోసుకుని వెళ్లి మరీ దహన సంస్కారాలు నిర్వహించాడు. అలాగే కోవిడ్ సోకి, నడిరోడ్డు పైనే చనిపోయిన
వృద్ధులు, అనాథలు, బిచ్చగాళ్లకు అంత్యక్రియలు నిర్వహించాడు.
పోలీసులకు తోడ్పాటు
అనాథ దేహాలు లేదా కుళ్లిన మృతదేహాలు లభ్యమైతే వాటిని పోస్ట్‌మార్టానికి తరలించేందుకు, అనంతరం శ్మశానానికి తీసుకుని వెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు పోలీసులు అంబేద్కర్‌ను సంప్రదిస్తారు. పైసా ప్రయోజనం ఆశించకుండా వారికి తోడ్పాటునందిస్తాడు. తన సేవల ద్వారా అంబేద్కర్ గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది, పూర్వపు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరుల మన్ననలు పొందాడు. ఆయా అధికారులు అతడికి మెమెంటోలు ఇచ్చి సత్కరించారు.
కళ్లు చెమ్మగిల్లుతాయి
అనాథలు చనిపోయిన తీరు చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి. ఇటువంటి చావు ఎందుకొచ్చిందా అని వేదన పడుతూంటాను. నా చివరి శ్వాస వరకు అనాథ మృతదేహాల సేవలోనే తరిస్తాను. అనాథ దేహం కదా అని అంతిమ సంస్కారాల్లో ఏ మాత్రం వెనకడుగు వేయను. నలుగురి సహకారంతో పూర్తి స్థాయిలో నిర్వహిస్తాను. ఎవరైనా అనాథ మృతదేహాలను గుర్తిస్తే 93478 78713, 84988 74684 నంబర్లకు ఫోన్ చేస్తే దేహాన్ని ఉచితంగా శ్మశానానికి తరలించి, అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాను.
– కూపర్ భాను అంబేద్కర్, కాకినాడ