
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ నెరవేరబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. హామీల అమలుపై సమీక్షలు జరిపి వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు గుల్ల చేసిందని, అందుకే హామీల అమలులో కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు.
ఇక, కరెంటు బిల్లులు కోమటిరెడ్డి ఇంటికి పంపాలన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో జగదీశ్‌రెడ్డి పాత్ర కూడా ఉందని, ఆయన జైలుకెళ్లడం ఖాయమని, ఆయన తోపాటు కేటీఆర్, కవితలకూ జైలు తప్పదన్నారు. 200 యూ నిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే కరెంటు బిల్లులు తమకు పంపాలని బీఆర్‌ఎస్ ప్రజలను రెచ్చగొడుతోందని, రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీ ఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, తాము నిరుద్యోగులను ఇలాగే రెచ్చగొట్టి ఉంటే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చేవారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వం అక్రమాల నిగ్గు తేల్చే పనిలో ఉన్నామని, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ చీలికలు, పీలికలు అవుతుందని, ఒక్క పార్లమెంట్ స్థానంలో కూడా బీఆర్‌ఎస్ గెలవదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment