సాక్షి, పెద్దపల్లి: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కోల్ట్‌బెల్ట్ ప్రాంతంలో మహాధర్నాకు బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. సింగరేణి బొగ్గుగనుల వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్‌బెల్టు ప్రాంతాల్లో ‘మహా ధర్నాలతో’ జంగ్ సైరన్ మోగించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బొగ్గు గనులకు నిలయమైన గోదావరిఖనిలో సింగరేణి కార్మికులు, కార్మికసంఘాల నేతలు, మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, పార్టీ శ్రేణులతో మహాధర్నా నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్మన్ పుట్టమధు భూపాలపల్లి జిల్లాలో నిర్వహించే మహాధర్నాలో పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రజాక్షేత్రంలో బీజేపీకి గుణపాఠం చెప్పేలా మహాధర్నా విజయవంతం చేసేందుకు శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి.
కోల్‌బెల్టు నేతలకు సీఎం ఫోన్..!
సింగరేణి సమస్య కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, తెలంగాణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే బొగ్గు గనుల వేలంకు కేంద్రం యత్నిస్తుందని ఇప్పటికే బీఆర్‌ఎస్ అధిష్టానం పోరుబాటను ఎంచుకుంది. దీనిలో భాగంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాధర్నాకు సంబంధించి కేటీఆర్ సింగరేణి పరిధిలోని పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో మాట్లాడగా, పార్టీ నిరసన కార్యక్రమాలపై సీఎంవో కార్యాలయం నుంచి సీఎం కేసీఆర్ ఫోన్‌లో దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్ బీఆర్‌ఎస్ శ్రేణులతో సమావేశమై మార్గనిర్దేశం చేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించే మహాధర్నాకు కార్మికులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment