
బొగ్గుపైనా అమెరికా పెత్తనమే..!
గోదావరిఖని : ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలోని బొగ్గు గనుల్లో 220 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఆయా దేశాల్లోని బొగ్గురంగంపై కూడా అమెరికా పెత్తనం చేస్తోందని జర్మనీకి చెందిన బొగ్గుగని కార్మికుడు, ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ గ్రూపు ఆఫ్ మైనింగ్ ఆర్గనైజేషన్స్ కమిటీ చైర్మన్ అండ్రియాస్ పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రెండవ మహాసభలు గోదావరిఖనిలో నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఆండ్రియాస్‌తోపాటు ఇతరదేశాల ప్రతినిధులు గోదావరిఖనికి వచ్చారు. ఈ సందర్భంగా కమిటీ కోఆర్డినేటర్, మన దేశానికి చెందిన ప్రదీప్ సహకారంతో ఆండ్రియాస్ ప్రపంచవ్యాప్తంగా బొగ్గురంగంలో నెలకొన్న విషయాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... సహజసంపదను గుప్పిట్లో పెట్టుకునేందుకు యత్నం
భూగర్భంలో ఉన్న ఖనిజ సంపదను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నాలు చేసింది.. ఇంకా చేస్తోంది. ఏ పరిశ్రమకు బొగ్గు పంపాలన్నా అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీలు ఆమోదం తెలుపాల్సిందే. లేకపోతే దాని ప్రభావం కనిపించేలా ఆ దేశం అవసరమైన చర్యలకు దిగుతుంది. పెరూ, కొలంబియా, ఇండోనేషియా దేశాల్లో కూడా బొగ్గు సంస్థలలో అమెరికా పెత్తనమే ఎక్కువగా కనిపిస్తుంది.
పెరుగుతున్న కాంట్రాక్టీకరణ...
వివిధ దేశాల్లోని బొగ్గు సంస్థలు పర్మినెంట్ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను పెంచుతూ పోతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం కార్మికుల్లో 25 శాతం మేర కాంట్రాక్టీకరణ చేశారు. భారతదేశంలో మినహా బొగ్గుగనులు ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉన్నాయి. జర్మనీ విషయానికి వస్తే భూగర్భంలో పనిచేసే పర్మినెంట్ కార్మికుడికి నెలకు 1500 యూరోలు, భూ ఉపరితలంలో పనిచేసే పర్మినెంట్ కార్మికుడికి నెలకు 1200 యూరోలు, కాంట్రాక్టు కార్మికుడికి 900 యూరోలు చెల్లిస్తారు. శాశ్వత పనిస్థలాల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికుడికి కూడా ఇక్కడ వేతనాల చెల్లింపులో వ్యత్యాసం ఉంది.
కార్మికసంఘాలపై కర్రపెత్తనం...
ఆయా దేశాలలో కార్మిక సంఘాలు తమ కార్యకలాపాలను కూడా సాఫీగా సాగించలేని పరిస్థితి ఏర్పడింది. లాటిన్ అమెరికాలో సాధారణ కార్యక్రమాలు కూడా కొనసాగించలేకుండా మారింది. ఫిలిప్పైన్‌లో చట్టపరంగా కార్యక్రమాలు కొనసాగించినందుకు అక్కడి మిలిటరీ కార్మిక నాయకులను చంపివేసి కనిపించకుండా చేస్తోంది. మొత్తంగా ఆయా దేశాలలో ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో ఖనిజ సంపద ఉండడంతో కార్మిక సంఘాల కార్యకలాపాలు సాగించకుండా యజమానుల కర్రపెత్తనం చేస్తున్నారు. సింగరేణిలో కూడా కోడ్‌ఆఫ్ డిసిప్లీన్ పేరుతో గెలిచిన సంఘాలను మినహా మరే ఇతర కార్మిక సంఘాలను గనులపై రానివ్వకుండా ఆంక్షలు విధించారు. ఇది సరైందికాదు.
బొగ్గుగనుల మూసివేతకు కుట్ర
జర్మనీ దేశంలో 1960 ప్రాంతంలో మొత్తం 36 బొగ్గుగనులు ఉండేవి. దాదాపు మూడు లక్షల మంది వరకు పనిచేసేవారు. ప్రస్తుతం మూడు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య పది వేలే. 2018 నాటికి ఈ మూడు గనులను కూడా వేసివేయాలనే కుట్ర చేస్తున్నారు. ఈ చర్యకు నిరసనగా తాము జర్మనీలో పోరాటాలు నిర్వహిస్తున్నాం. ప్రపంచ వ్యాప్త మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇక యూరప్ దేశంలోని బొగ్గు గనులను మూసివేసి భూఉపరితలం నుంచే భూగర్భంలోకి పైపులను పంపించి లోపల బొగ్గును మండించి గ్యాస్‌ను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల అక్కడి పంటపొలాలు నాశనమై పర్యావరణం దెబ్బతినే పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. సింగరేణి సంస్థలో కూడా భూగర్భ గనులను మూసివేసి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ చర్య కూడా పర్యావరణానికి హాని చేస్తుంది.
గోదావరిఖనిలో మహాసభలకు నిర్ణయం...
2013లో పెరూ దేశంలో కమిటీ ఆధ్వర్యంలో మొదటి మహాసభలను నిర్వహించాం. ఆనాడే రెండో మహాసభలను 2017లో భారతదేశంలో నిర్వహించాలని నిర్ణయించాం. బొగ్గుగనుల ప్రాంతంలో కార్మిక పోరాట స్వభావం కలిగిన సింగరేణి ప్రాంతాన్ని మహాసభల నిర్వహణకు ఎంచుకున్నాము. 2017 ఫిబ్రవరి 2,3,4,5 తేదీలలో ఈ అంతర్జాతీయ మహాసభలు గోదావరిఖనిలో నిర్వహిస్తాం. 50 దేశాల నుంచి ఆయా బొగ్గు సంస్థలలో పనిచేస్తున్న వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరవుతారు.