విదేశీ గనులతో ‘బొగ్గే’! | is it possible Singareni mines to operated in abroad? | Sakshi
Sakshi News home page

విదేశీ గనులతో ‘బొగ్గే’!

Published Wed, Nov 26 2014 12:38 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

విదేశీ గనులతో ‘బొగ్గే’! - Sakshi

విదేశీ గనులతో ‘బొగ్గే’!

విదేశాల్లో బొగ్గు గనుల నిర్వహణపై సింగరేణి బృందం అభిప్రాయం
ఖర్చు తడిసి మోపెడు..  లాభం మాట దేవుడెరుగు
ప్రైవేటుసంస్థలకే తప్పని ఇబ్బందులు.. సింగరేణికైతే మరిన్ని తిప్పలు!
 ఇప్పటికే ‘కోల్ విదేశ్’తో  కోల్ ఇండియా ప్రయోగం విఫలం

 
 సాక్షి, హైదరాబాద్: ‘సింగరేణి ద్వారా విదేశాల్లో ఉన్న బొగ్గు గనులను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నాం...’.. ఇటీవల ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశమిది. రాష్ట్రంలో విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణం అవసరం.. వాటి కోసం బొగ్గు కూడా అవసరం.. కానీ, సింగరేణి సంస్థతో విదేశాల్లో బొగ్గు గనుల నిర్వహణ చేపట్టడం సాధ్యమేనా? అసలు అలా విదేశాల్లో గనుల నిర్వహణ లాభమేనా? అనే ప్రశ్నలకు మాత్రం ‘కాదు..’ అనే సమాధానమే వినిపిస్తోంది. విదేశాల్లో బొగ్గు బ్లాక్‌లను తీసుకునే అవకాశాలను పరిశీలించాలని.. వీలైతే అక్కడి బొగ్గు గనుల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లోనే సీఎం కేసీఆర్ సింగరేణి అధికారులను పురమాయించారు. అందులో భాగంగా సింగరేణి నుంచి 11 మంది సభ్యుల బృందం ఇటీవల దక్షిణాఫ్రికా, పోలాం డ్, మొజాంబిక్ తదితర దేశాలలో పర్యటించి వచ్చింది.
 
 ఖర్చులు తడిసిమోపెడు..
 ఆయా దేశాల్లో సంక్లిష్టమైన నిబంధనలు, నిర్వహణ భారం, అధిక పెట్టుబడి వ్యయంతో పాటు గనుల నుంచి ప్లాంట్లకు, పోర్టులకు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయని సింగరేణి బృందం ప్రాథమికంగా అంచనా వేసింది. అసలు విదేశీ గనుల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది. ప్రస్తుతం విదేశాల్లో బొగ్గు గనులు నిర్వహిస్తున్న ప్రైవేటు కంపెనీలు ప్రతిబంధకాలను ఇప్పటికీ అధిగమించలేకపోతున్నాయని.. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో సింగరేణికి మరిన్ని ఇబ్బందులు ఉంటాయని కూడా ఆ బృందం పేర్కొంటోంది. ఈ మేరకు తమ పర్యటనలో తేలిన వివరాలు.. అక్కడ బొగ్గు గనుల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.
 
 ఎక్కడైనా తిప్పలు తప్పవు!
 విదేశాల పర్యటనలో సింగరేణి బృందం పలు అంశాలను గమనించింది. దాని ప్రకారం.. పోలాండ్‌లో 14 భూగర్భగనులు, 4 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులుండగా.. అవన్నీ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. భూగర్భ గనుల్లో కంటిన్యూయస్ మైనర్, లాంగ్ వాల్ విధానాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలోనూ సాంకేతికంగా ఆధునిక యంత్రాలను ఉపయోగించి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా చేయడానికి సింగరేణికి ఆర్థికపరంగా భారం ఎక్కువ అవుతుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదు. ఇక ఆటవిక దేశంగా పేరొందిన మొజాంబిక్‌లో బొగ్గు నిల్వలున్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చిన్న దేశమైనప్పటికీ మొత్తం ఉత్పత్తి ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. అక్కడ విద్యుత్ ప్లాంట్లు అసలే లేవు.
 
 మన దేశానికి చెందిన జిందాల్ కంపెనీ అక్కడ ఒక ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. కానీ, వారికి రవాణా భారం తడిసి మోపెడవుతోంది. ఆ కంపెనీ వారే 400 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ట్రక్కులలో బొగ్గును రవాణా చేసి, అక్కడి నుంచి మరో 300 కిలోమీటర్ల దూరం వరకు ట్రాక్ లైన్ నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది. అక్కడి ఓపెన్ కాస్ట్‌ల్లో ఒక్క భారతీయుడిని ఉద్యోగంలోకి తీసుకుంటే.. మొజాంబిక్ దేశస్తులు 10 మందిని ఉద్యోగాల్లో నియమించుకోవాలనే నిబంధన ఉంది.
 
  దీంతో బొగ్గు ఉత్పత్తి వ్యయం అంచనాలను దాటిపోతుందని పర్యటనలో  అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇండోనేిసియా దేశాల్లో జీవీకే, అదానీ, ఎన్‌ఆర్‌ఐ ఇండియా సంస్థలు, అమెరికాలో జిందాల్ సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంకా ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి ప్రారంభం కాలేదు. ఇండోనేిసియా నుంచి కోకింగ్ కోల్‌ను కాకినాడ పోర్టు ద్వారా దిగుమతి చేసుకున్నా లాభం లేని పనే. ఉత్పత్తి వ్యయం, దిగుమతి భారం కలిపితే.. అక్కడి బొగ్గు రేటు కన్నా భారత్‌లో లభించే బొగ్గు రేటు తక్కువగా ఉంటున్నది.
 
 ‘కోల్ విదేశ్’కు దెబ్బ
 విదేశాల్లో బొగ్గు గనుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్‌కు ఇప్పటికే అనుభవం ఉంది. మన దేశంలో బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియాదే మొదటి స్థానం. ఈ సంస్థ ఇప్పటికే ‘కోల్ విదేశ్’ పేరుతో మొజాంబిక్ దేశంలో రెండు బొగ్గు బ్లాక్‌లను సొంతం చేసుకుంది. ఒక ఓపెన్ కాస్ట్ తవ్వకాన్ని ప్రారంభించింది. అక్కడ ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభించలేకపోయింది. మరోదానిలో పరిస్థితి కూడా ఏమంత ప్రయోజనకరంగా లేదు. భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది.. ఉత్పత్తి మొదలుపెట్టే స్థాయిలోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో నికర లాభాల్లేని సింగరేణి సంస్థ విదేశాల్లో గనుల నిర్వహణకు దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
 పెరుగుతున్న కొరత..
 మన దేశంలో ప్రస్తుతం 200 మిలియన్ టన్నుల బొగ్గు కొరత ఉంది. ఏటా విదేశాల నుంచి 140 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు కూడా. కానీ మరో ఐదేళ్ల వ్యవధిలో బొగ్గు కొరత 260 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని కేంద్ర ఇంధన శాఖ అంచనా. ఈ కొరతను అధిగమించే కసరత్తులో భాగంగా విదేశాల్లో బొగ్గు గనులు దక్కించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement