బొగ్గు గనుల వేలంలో బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతు
గనులు సింగరేణికే కేటాయించాలి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణకు తలమానికంగా ఉన్న సింగరేణిని పదేళ్లలో బీఆర్‌ఎస్ సర్వనాశనం చేసి బొంద పెట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేంద్రం గనులు, ఖనిజాల చట్టం–1957 ను సవరించి దేశంలో బొగ్గుగనులకు వేలం నిర్వహించేలా చట్టం చేస్తే 2015లో ఈ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు పలికిందని, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆలోచించి ఉంటే బిల్లును వ్యతిరేకించి ఉండేవారన్నారు.
అయితే, ఇప్పుడు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు చెబుతున్న మాటలు తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించేలా ఉండగా.. దొంగే దొంగ అన్న చందంగా బీఆర్‌ఎస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. భట్టి గురువారం ఖమ్మం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. సింగరేణిలో 42 వేల మంది ఉద్యోగులు, 26 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా, రాష్ట్రంలోని 40 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు. అయితే, త్వరలో 22 బొగ్గు గనులు మూసివేతకు గురికానుండగా, 2031 వరకు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే కొత్తగా గనులు సాధించాల్సి ఉందని తెలిపారు.
అనుచరులకు దక్కేలా...
2021లో గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంటే... వారం రోజుల్లోనే సంస్థ గనులు తీసుకోవద్దని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారని భట్టి చెప్పారు. ఆయన అనుచర పారిశ్రామిక వేత్తలకు గనులు దక్కేలా కుట్ర చేశారని, అందులోభాగంగానే లిక్కర్ స్కామ్‌లో ఉన్న అరబిందో గ్రూపునకు చెందిన అరో మైనింగ్ కంపెనీకి కోయగూడెం బ్లాక్, ప్రతిమ గ్రూప్ కంపెనీకి చెందిన అవంతిక కాంట్రాక్టర్‌కు సత్తుపల్లి బ్లాక్ దక్కిందని చెప్పారు. తెలంగాణలో వదిలేసి ఒడిశాలో జరిగిన గనుల వేలంలో మాత్రం సింగరేణి పాల్గొనడం వెనుక బీఆర్‌ఎస్ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.
తాము అధికారంలోకి రాగానే కేంద్ర మంత్రిని కలిసి వేలం వేయకుండా బొగ్గు గనులు సింగరేణికి ఇవ్వాలని కోరామని, అదీగాక ఇప్పుడు ఆ శాఖ కిషన్‌రెడ్డికి దక్కినందున రాష్ట్ర ప్రయోజనాల కోసం చొరవ తీసుకోవాలని కోరారు. వేలం లేకుండానే రాష్ట్రంలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలని, దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియ శుక్రవారం హైదరాబాద్‌లో జరగనున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిరసిస్తోందని తెలిపారు. సింగరేణిపై కేటీఆర్, హరీశ్‌రావు చర్చకు వస్తే అన్ని ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని భట్టి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్షంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో త్వరలో ప్రధానమంత్రి మోదీని కలుస్తామని పేర్కొన్నారు.
సింగరేణికే కేటాయించాలి: తుమ్మల
వేలం లేకుండా సింగరేణి సంస్థకే గనులు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, బొగ్గు వెలికితీతలో ఈ సంస్థకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. 2016లో ఒడిశాలోని నైనీలో ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించినందున ఇక్కడ కూడా అలాగే చేయాలన్నారు. తద్వారా తెలంగాణ ప్రజల ఆస్తి సింగరేణిని కాపాడేలా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, రాందాస్‌నాయక్, కలెక్టర్ ముజ మ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment