హైదరాబాద్: సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనుల వద్ద ఎండ తీవ్రత కార్మికులకు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గత మూడు రోజులుగా ఓపెన్ కాస్ట్ గనుల వద్ద 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాస్తవానికి అంతకంటే ఎక్కువగానే 50 డిగ్రీల దాకా ఉంటుందని కార్మికులు చెబుతున్నారు. సాధారణంగా 50 డిగ్రీలు దాటితే లేఆఫ్ ప్రకటించాల్సి ఉంటుంది. అయితే, ఉత్పత్తి ఆగిపోతుందనే భయంతోనే సింగరేణి యాజమాన్యం 50 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చూపుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ఎండ తీవ్రతలను దృష్టిలో ఉంచుకుని కనీసం పని వేళలైనా మార్చాలనే డిమాండ్‌తో ఆందోళనలకు దిగుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలు సాగిస్తున్న విషయం విదితమే.