
టీబీజీకేఎస్ వర్సెస్ ఏఐటీయూసీ
► ఆత్మగౌరవ సభల పేరుతో గుర్తింపు సంఘం
► కార్మిక విముక్తి దినం పాటించాలని ఏఐటీయూసీ
► నేడు బొగ్గుగనులపై పోటాపోటీ కార్యక్రమాలు
గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్మికులను ప్రసన్నం చేసుకునే పనిలో ప్రధాన కార్మిక సంఘాలు నిమగ్నమయ్యాయి. కొన్ని యూనియన్లు ఆయా గనులు, ఓసీపీలపై పర్యటిస్తూ కార్మికులను కలుసుకుని సమస్యల పరిష్కారం కోసం ముందుంటామని హామీలు గుప్పిస్తున్నాయి. అయితే గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘం ఏఐటీయూసీ మాత్రం మరో అడుగు ముందుకు వేసి పరస్పర విమర్శల దాడికి దిగుతున్నాయి.
ప్రస్తుత గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న టీబీజీకేఎస్ నాలుగేళ్ల కాలపరిమితి నేటి(జూన్ 28)తో ముగియనున్నందున ఆ సంఘం గుర్తింపు హోదాను రద్దు చేయాలని, కార్మికుల జీతాల నుంచి కోత విధిస్తున్న సభ్యత్వ రుసుమును వెంటనే నిలిపివేయాలని, వారసత్వ ఉద్యోగాలతోపాటు గత ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్న 72 హామీల్లో చాలా వరకు నెరవేర్చలేదని ఏఐటీయూసీ విమర్శలు గుప్పిస్తోంది. అలాగే ఈనెల 28న(మంగళవారం) అన్ని గనులు డిపార్ట్‌మెం ట్లలో కార్మిక విముక్తి దినం పాటించాలని నాయకత్వం కార్మికులకు పిలుపునిచ్చింది.
అయితే గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కూడా ఏఐటీయూసీని గట్టిగా ఎదుర్కొనే పనిలో నిమగ్నమైంది. సింగరేణిలో 1998 నుంచి 2012 వరకు 14 సంవత్సరాల కాలంలో ఏఐటీయూసీ గుర్తిం పు సంఘంగా పనిచేసింది ఎనిమిదేళ్లే అరుునా పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిందని, సభ్యత్వం డబ్బు 19 నెలలు అదనంగా వసూలు చేసుకొని కార్మిక హక్కులను తాకట్టుపెట్టిందని టీబీజీకేఎస్ పేర్కొంటోంది. నాడు అధికారంతోపాటు కార్మికుల సొమ్మును అదనంగా పొంది నేడు ఎన్నికల్లో లబ్ధిపొందడానికి లేనిపోని ఆరోపణలు చేస్తోందని, వాటిని నమ్మవద్దని కార్మికులను కోరుతోంది. 2012 ఎన్నికల్లో బుద్ధిచెప్పినప్పటికీ మళ్లీ కుట్రలు పన్నుతున్న ఏఐటీయూసీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నారు. ఈ క్రమంలో నేడు అన్ని గనులు, ఓసీపీలు, డిపార్ట్‌మెంట్లపై ఆత్మగౌరవ సభలు నిర్వహించడానికి టీబీజీకేఎస్ సమాయత్తమైంది. దీంతో గనులపై రెండు సంఘాల మధ్య పోటాపోటీ కార్యక్రమాలు వేడిపుట్టించనున్నారుు.