కొత్తగూడెం, న్యూస్‌లైన్: దక్షిణ భారత దేశానికి తలమానికంగా నిలుస్తూ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించడంలో కీలకంగా మారిన సింగరేణి ప్రస్థానం జిల్లా నుంచి మొదలైంది. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో జిల్లాలోని మూడు ఏరియాలే అత్యంత కీలకంగా మారాయి. సింగరేణి సంస్థ పది ఏరియాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా దానిలో 45 శాతం జిల్లాలోనే మూడు ఏరియాల నుంచే ఉత్పత్తి అవుతోంది. సిరులొలికే సింగరేణిని ఆటుపోట్ల నుంచి గట్టెక్కించడంలోనూ జిల్లాలోని మూడు ఏరియాలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.
పుట్టుపూర్వోత్తరాలు..
1860 ప్రాంతంలో జిల్లాలోని భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు ఓ భక్తబృందం కాలినడకన వెళ్తోంది. వంట చేసుకునేందుకు నల్లరాళ్లను సేకరించింది. పోయ్యి మంట చేస్తుండగా కర్రలతోపాటు రాళ్లు కూడా కాలడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ విషయం తెలిసి నాటి బ్రిటిష్ ప్రభుత్వం జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సర్వే చేయించింది. డాక్టర్ విలియం కింగ్ ఆధ్వర్యంలో 1871లో ఇల్లెందు ప్రాంతంలో నిక్షేపాల కోసం వెతికారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో ఈ ప్రాంతం నైజాం నవాబు ఏలుబడిలో ఉండటంతో 1886లో దక్కన్ హైదరాబాద్ కంపెనీ పేరుతో బొగ్గు వెలికితీత ప్రక్రియను ప్రారంభించారు. మొదటిసారిగా జిల్లాలోని ఇల్లెందు భూగర్భగనిని ప్రారంభించారు. పాలనా సౌలభ్యం కోసం 1937లో కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాలను ఏర్పాటు చేశారు.
నాణ్యమైన బొగ్గుకు నిలయం...
సింగరేణి వ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో నాణ్యమైన ‘సి’ గ్రేడ్ ప్రస్తుతం జిల్లాలోని మూడు ఏరియాల నుంచే ఉత్పత్తి అవుతుంది. జిల్లాలోని మూడు ఏరియాల్లో ఏడు ఓపెన్‌కాస్టులు, నాలుగు భూగర్భ గనులున్నాయి. వీటి ద్వారా ప్రతి రోజు 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. కొత్తగూడెం ఏరియాలో గౌతంఖని ఓపెన్‌కాస్టు, సత్తుపల్లి జలగం వెంగళరావు ఓపెన్‌కాస్టు, భూగర్భగనులైన 7 ఇంక్లైన్, 5 షాప్టు గనులు ఉన్నాయి. ఇల్లెందులో జేకే -5, జేకే -2 ఓపెన్‌కాస్టులు, టేకులపల్లి కోయగూడెం ఓపెన్‌కాస్టు, 21 ఇంక్లైన్ భూగర్భ గని, మణుగూరు ఏరియాలో ప్రకాశం ఖని ఓపెన్‌కాస్టు -2, పీకే ఓపెన్‌కాస్టు -4, ప్రకాశం ఖని ఇంక్లైన్ భూగర్భగనులు ఉన్నాయి. మిగిలిన ఏరియాలో తక్కువ గ్రేడ్‌ల బొగ్గు సరఫరా అవుతుండగా కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల నుంచి ప్రతి రోజు సరాసరి 70 వేల టన్నుల నాణ్యమైన ‘సి’ గ్రేడ్ బొగ్గును సరఫరా చేస్తున్నారు. జెన్కోతోపాటు ఇతర విద్యుత్‌రంగ సంస్థలు జిల్లాలో ఉత్పత్తి అయ్యే బొగ్గుపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉత్పత్తి అవుతున్న ‘సి’ గ్రేడ్ బొగ్గుకు మార్కెట్‌లో టన్నుకు రూ.2,300ల వరకు ధర పలుకుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బొగ్గుకు మండే శక్తి (జీసీవీ) ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఆపదలో ఆసరాగా..
ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్య సాధనలో తీవ్ర వెనుకంజలో ఉన్న సింగరేణి సంస్థకు ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా జిల్లాలోని మూడు ఏరియాలు తయారయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా 32.25 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. జిల్లాలోని మూడు ఏరియాల్లోనే 13.54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశారు. తెలంగాణలోని మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ఏడు ఏరియాల నుంచి 18.71 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగగా.. కేవలం మూడు ఏరియాల నుంచి 13.54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. అంటే సరాసరి 45 శాతం సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి జిల్లా నుంచే ఉత్పత్తి అవుతుండటం గమనార్హం.
మరో 491.15 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు...
జిల్లాలోని గుండాల, పునుకుడుచెలక, రాంపురం, అనిశెట్టిపల్లి, చర్ల ప్రాంతాల్లో మరో 491.15 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు సింగరేణి అన్వేషణ విభాగం అధికారులు గుర్తించారు. ఇందులో రాంపురంలో 122 మిలియన్ టన్నులు, పునుకుడుచెలకలో 38 మిలియన్ టన్నులు, అనిశెట్టిపల్లిలో 27 మిలియన్ టన్నులు, చర్లలో 28.12 మిలియన్ టన్నులుండగా, అత్యధికంగా గుండాల మండలంలో 276 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. గుండాలలో మొత్తం నాలుగు బ్లాక్‌లు ఉండగా ఫస్ట్ బ్లాక్‌లో 96.3 మిలియన్ టన్నులు, సెకండ్ బ్లాక్‌లో 75 మిలియన్ టన్నులు, థర్డ్ బ్లాక్‌లో 59 మిలియన్ టన్నులు, ఫోర్త్ బ్లాక్‌లో 46 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. ఇక్కడ మిగిలిన అన్ని ప్రాంతాల్లో కన్నా నాణ్యమైన బొగ్గు నిక్షేపాలున్నట్లు సింగరేణి అన్వేషణ విభాగం అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో భూగర్భ గనులు ఏర్పాటు చేస్తే సుమారు మూడు దశాబ్దాలకు పైగా బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, సత్తుపల్లి ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి అవుతోంది. గుండాల, అనిశెట్టిపల్లి, చర్ల, పునుకుడుచెలక, రాంపురం ప్రాంతాల్లో కూడా బొగ్గు గనులు ఏర్పాటు చేస్తే మళ్లీ జిల్లా అత్యధిక బొగ్గు గనులున్న ప్రాంతంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది.
తర‘గని’ సిరి
Published Mon, Dec 23 2013 3:00 AM | Last Updated on Sun, Sep 2 2018 4:18 PM
Advertisement
Advertisement