ఇక పారదర్శక ప్రక్రియ
బొగ్గు క్షేత్రాలున్న రాష్ట్రాలకు ఊహించని ఆదాయం
న్యూఢిల్లీ: సెప్టెంబర్ నెలలో సుప్రీంకోర్టు రద్దు చేసిన 204 బొగ్గు క్షేత్రాల పునః కేటాయింపునకు అవకాశం కల్పించే ‘బొగ్గు గనుల(ప్రత్యేక విధి, విధానాల)బిల్లు’కు శుక్రవారం లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అక్టోబర్ నెలలో జారీ అయిన సంబంధిత ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును రెండు రోజుల క్రితం బొగ్గు శాఖమంత్రి పీయూష్ గోయల్ సభలో ప్రవేశపెట్టారు. బిల్లులో పలు లోపాలున్నాయని, కార్మికుల సంక్షేమం, భూసేకరణ తదితర అంశాల్లో తమకు కొన్ని ఆందోళనలున్నాయన్న విపక్షం.. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే బొగ్గు రంగం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని విమర్శించింది. బిల్లును పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపించాలని డిమాండ్ చేసింది.
విపక్ష డిమాండ్‌ను తోసిపుచ్చిన గోయల్.. బొగ్గు క్షేత్రాల కేటాయింపు, బొగ్గు వెలికితీత, అమ్మకం తదితరాల్లో మరింత పారదర్శకత లక్ష్యంగా బిల్లును రూపొందించామని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ వేలంపాట(ఈ ఆక్షన్) పద్ధతిలో కేటాయింపులు జరుపుతామని, గనులు పొందిన సంస్థలకు అక్కడి భూమి, మైనింగ్ వసతులపై పూర్తి హక్కులు ఉంటాయని వివరించారు. బొగ్గుక్షేత్రాలున్న బిహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు ఈ బిల్లుతో లక్షల కోట్ల రూపాయాలు ఆర్జిస్తాయన్నాయని, నిధులే నేరుగా వాటికే అందుతాయని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభిస్తూ.. బొగ్గురంగ పునర్వ్యవస్థీకరణకు వచ్చిన అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోతోందన్నారు. త్వరలో 74 బొగ్గు క్షేత్రాలకు వేలం వేయనున్నారు. కాగా, బిల్లు ఆమోదం నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి బొగ్గు కార్మిక సంఘాలు ఈ నెల 15న సమావేశం కానున్నాయి.
బొగ్గు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Published Sat, Dec 13 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement
Advertisement