సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భంలో పనిచేసే గని కార్మికులకు ప్రాణదీపంగా వందల ఏళ్ల నుంచి సేప్టీల్యాంప్ రక్షణ వెలుగులను పంచుతోంది. బొగ్గు గనుల్లో కాలక్రమేణా అనేక ఆధునిక యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చినా ఈ బత్తిదీపం ప్రాధాన్యత నేటికీ తగ్గడం లేదు. ఈ దీపం ఆవిష్కరణకు ముందు పలువురు భూగర్భంలోనే విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు. ఈ దీపం రాకతో గనుల్లో రక్షణ ప్రమాణాలు మెరుగయ్యాయని సింగరేణి అధికారులు చెబుతున్నారు.
బొగ్గు గాలితో నిత్యం ఆక్సిడేషన్ జరిపి స్వయంగా నిప్పు రాజేస్తుంది. అలా బొగ్గు మండినప్పుడు మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర విషవాయువులు వెలువడుతాయి. ఆ సమయంలో కార్మి కులు పనిచేస్తే శ్వాస సమస్య ఏర్పడి నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ప్రమాద పరిస్థితులను ముందే గుర్తించేందుకు పూర్వం కెనరీ పక్షులను పంజరాల్లో భూగర్భంలోకి తీసుకెళ్లేవారు.
పక్షిరెక్కలు కొట్టుకోవడం, కదలికల ఆధారంగా వాయువులను గుర్తించేవారు. ప్రతిసారీ పక్షులను బంధించి గనిలోకి తీసుకెళ్లడం, రావడంతో అవి అస్వస్థతకు గురై అనారోగ్యంతో చనిపోయేవి. బ్రిటన్ కు చెందిన హంప్రి డేవీ 1815లో బొగ్గు గనుల్లో రక్షణ కోసం సేఫ్టీ ల్యాంప్‌ను కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు గనుల్లో విషవాయువులను గుర్తించడంలో సమర్థంగా పనిచేయడంతో ఈ ల్యాంప్ ప్రామాణికంగా మారింది.
ఎలా పని చేస్తుందంటే..
‘వైర్ గాజేస్’సూత్రంతో పనిచేసే ఈ సేప్టీ ల్యాంప్ 2.5 కిలోల బరువు, 10 సెం.మీ. పొడవు ఉంటుంది. మంట వెలిగేందుకు కిరోసిన్/పెట్రోల్‌ను వాడతారు. ఇది బానేట్, ఇనుప జాలీలు, వాషర్, గ్లాసు, చెక్‌నట్, నూనె బుడ్డితో నిర్మితమై ఉంటుంది. ఈ ల్యాంప్‌ను గనిలోకి ఓవర్‌మెన్, మైనింగ్ సర్దార్లు తీసుకెళ్లి బొగ్గు తీసే ముందు అక్కడి వాయువుల శాతాన్ని పరీక్షిస్తారు. మీ«థేన్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్ తదితర వాయువుల శాతాన్ని తెలుసుకుంటారు. పనిచేసేందుకు అనువుగా ఉంటే ఉత్పత్తి మొదలుపెడతారు.
మొదట గనుల్లోకి సాధారణ స్థాయిలో మంట వెలుగుతూ ఉంటుంది. వెలుగుతున్న దీపాన్ని వాయువులు తాకగానే మంటలో మార్పు మొదలవుతుంది. ఉదాహరణకు మీథేన్ ఒక శాతం ఉంటే 0.10 అంగుళాల ఎత్తుతో మంట పక్కవైపులకు వెలుగుతూ కనిపిస్తుంది. 1.5 శాతం ఉంటే 0.15 ఇంచు ఎత్తులో మంట టోపీ ఆకారంలో కనిపిస్తుంది. ఇలా ఎరుపు, నీలిరంగు మంటల కదలికలు, కనిపించే ఆకారాలను బట్టి అక్కడ మీథేన్ గ్యాస్ ఏ మోతాదులో ఉందో గుర్తిస్తారు.
ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే మంట ఆరిపోతుంది. ఇలా ఆ వాతావరణంలో పైన, కింద, వివిధ ఎత్తుల్లో దీపంతో పరిశీలిస్తారు. ప్రస్తుతం గనుల్లో 1.25 శాతం మీథేన్ ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కార్మి కులను అలర్ట్ చేసి బయటకు పంపుతున్నారు. సింగరేణివ్యాప్తంగా జీఎల్–50, జీఎల్–60 రకం ల్యాంప్‌లను వాడుతున్నారు. జీఎల్–60లో ఒకవేళ మంట ఆరిపోతే తనంతట తానే వెలుగించుకొనే సాంకేతికత ఉంది.
వాయువులను గుర్తించేందుకు డిజిటల్ పరికరాలైన మీౖథెనోమీటర్, ఆక్సీమీటర్, మల్టీడిటెక్టర్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒక్కోసారి ఈ పరికరాలు భూగర్భంలో సాంకేతిక సమస్యలతో పని చేయకపోవచ్చు. కానీ సేఫ్టీ ల్యాంప్ మాత్రం 100 శాతం కచ్చితత్వంతో పనిచేస్తోంది. దీంతో నేటికీ ఈ దీపం వాడకాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం అధికారులు, కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ల్యాంప్ నిర్వహణ, మరమ్మతులకు ఓ ఇన్‌చార్జి ఉంటారు.
రక్షణలో ఇప్పటికీ ఇదే కీలకం..
బొగ్గుగనుల్లో రక్షణ విషయంలో సేఫ్టీల్యాంప్ కీలకంగా పనిచేస్తోంది. ప్రాణనష్టం జరగకుండా విషవాయువులను గుర్తించేందుకు బాగా ఉపయోగపడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా పలు డిజిటల్ పరికాలు వచ్చినా, సేఫ్టీల్యాంప్ వాడకం మాత్రం కొనసాగుతోంది. –సీహెచ్.సమ్మయ్య, హెడ్ ఓవర్‌మెన్, వీటీసీ, శిక్షకుడు
ఇలా మంటలో మార్పుని బట్టి గ్యాస్ మోతాదును గుర్తిస్తారు. సింగరేణిలో ఒక్కో భూగర్భ గనిలో సగటున 12 నుంచి 14 వరకు దీపాలు అవసరమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment