బొగ్గు బిల్లుకు మార్గం సుగమం..!
ఎలాంటి మార్పులూ అవసరం లేదన్న స్థాయీసంఘం
గిరిజన హక్కులను పట్టించుకోలేదని దిగ్విజయ్ సింగ్ ఆక్షేపణ
గనులు, ఖనిజాల బిల్లుకు ఒక సవరణ ప్రతిపాదించిన కమిటీ
న్యూఢిల్లీ: బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయించే విధానానికి ఉద్దేశించిన కీలక బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడానికి మార్గం సుగమమైంది. పార్లమెంటరీ కమిటీకి నివేదించిన బొగ్గు గనుల(ప్రత్యేక నిబంధనల) బిల్లును అధ్యయనం చేసిన స్థాయీ సంఘం అందులో ఎలాంటి మార్పు, చేర్పులు అవసరం లేదంటూ నివేదికను బుధవారం రాజ్యసభ ముందుంచింది. అయితే, ఈ సంఘ సభ్యులైన దిగ్విజయ్ సింగ్ సహా ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే, సీపీఎంలకు చెందిన మరో ఇద్దరు ఎంపీలు బిల్లుపై తమ అభ్యంతరాలను నివేదికలో పొందుపర్చారు. సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లిన మరో బిల్లు.. ‘గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు’లో ఒక సవరణను కమిటీ సూచించింది. దాంతో ఆ సవరణను బిల్లులో చేర్చాలని ప్రభుత్వం భావిస్తే.. ఆ బిల్లు మరోసారి లోక్‌సభ ఆమోదం కోరాల్సి ఉంటుంది. ఈ బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందడం తెలిసిందే. ఆర్డినెన్స్‌ల స్థానంలో వచ్చిన ఇవి ఏప్రిల్ 5లోగా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది.
బొగ్గు బిల్లు.. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు అనిల్ మాధవ్ దవే నేతృత్వంలోని 19 మంది సభ్యుల స్థాయీ సంఘం బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లుపై అధ్యయనం చేసి నివేదికను అందజేసింది. అయితే, సెలెక్ట్ కమిటీలోని కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్, పీ భట్టాచార్య, రాజీవ్ శుక్లా(కాంగ్రెస్), కేఎన్ బాలగోపాల్(సీపీఎం), తిరుచి శివ(డీఎంకే) నివేదికలో తమ అభ్యంతరాలను వ్యక్తపరిచారు. బిల్లులో గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని దిగ్విజయ్ పేర్కొన్నారు. దీనిపై తమ సవరణలకు కమిటీ ఆమోదం తెలపలేదన్నారు. ‘బిల్లును అధ్యయనం చేసేందుకు కమిటీకి ఇచ్చిన వారం రోజుల సమయం ఏమాత్రం సరిపోలేదు’ అని వివరించారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన మిగతా సభ్యులు కూడా దాదాపు ఇవే అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నిరసన.. ఈ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టగానే రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ పార్టీ తరఫున తన నిరసనను వెల్లడించారు. ఏ ఉద్దేశంతో ఈ బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదించారో ఆ ఉద్దేశం నెరవేరలేదని ఆక్షేంపించారు. కాగా, బొగ్గు, ఖనిజాల బిల్లును ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఎగువ సభలో వాటి ఆమోదం తరువాతే భూ సేకరణ బిల్లుపై ముందుకు వెళ్లాలని భావిస్తోంది. గనులు, ఖనిజాల బిల్లులో రెండు సవరణలను ప్రభుత్వం చేర్చనుందని సమాచారం.
గనులు, ఖనిజాల బిల్లు
ఈ బిల్లులో సెలక్ట్ కమిటీ ఒక సవరణను సూచించింది. మైనింగ్ హక్కులు పొందిన సంస్థ రాయల్టీలో కొంత శాతాన్ని స్థానికుల సంక్షేమం కోసం వినియోగించేలా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్‌కు చెల్లించడం తప్పనిసరి చేస్తూ ఒక నిబంధనను పునర్లిఖించాలని బీజేపీ సభ్యుడు భూపేంద్ర యాదవ్ నేతృత్వంలోని ఈ కమిటీ సూచించింది. వాతావరణంపై గనుల తవ్వకం ప్రభావం, లాభాల్లో స్థానికులు, గిరిజనులకు వాటా.. తదితర అంశాలను భవిష్యత్తులో సరైన సమయం వచ్చినప్పుడు చట్టంలో చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరింది. సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లుపై సీపీఎంకు చెందిన టీకే రంగరాజన్ మాత్రమే భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.