సాక్షి, న్యూఢిల్లీ : అగ్ర వర్ణాల పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై బుధవారం రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ బిల్లును లోతుగా పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేశాయి. బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ కేంద్రం కోటా రాజకీయాలకు పాల్పడుతోందని, రిజర్వేషన్ల మూల సిద్ధాంతాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న అచ్ఛేదిన్ కోసం దేశం వేచిచూస్తోందని చెప్పారు. అగ్రవర్ణాలపై బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదని, కేవలం కోటా అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు.
విపక్షాల అభ్యంతరం
అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును తొలుత సెలెక్ట్ కమిటీకి పంపాలని డీఎంకే ఎంపీ కనిమొళి తీర్మానం ప్రవేశపెట్టగా పలు విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. రాజ్యసభలో సంఖ్యా బలం కలిగిన కాంగ్రెస్, ఆర్జేడీ సహా పలు ప్రాంతాయ పార్టీలు కోటా బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉద్దేశించిన రిజర్వేషన్ల వ్యవస్థకు ఈ బిల్లుతో విఘాతం కలుగుతుందని ఆర్జేడీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్ధానంలో బిల్లు నిలబడదని విపక్షాలు సందేహం వ్యక్తం చేశాయి. మరోవైపు లోక్‌సభలో బిల్లును ఆమోదించిన విపక్షాలు రాజ్యసభలో మోకాలడ్డుతూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని బీజేపీ మండిపడింది.
95 శాతం మందికి ప్రయోజనం : బీజేపీ
ప్రతి రాజకీయ పార్టీ జనరల్ కేటగిరిలోకి పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోల్లో చెబుతుంటే కేవలం నరేంద్ర మోదీ సర్కార్ మాత్రమే దీన్ని నెరవేర్చిందని బీజేపీ సభ్యుడు ప్రభాత్ ఝా పేర్కొన్నారు. మండల్ కమిషన్ నివేదికతో పాటు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సైతం జనరల్ కేటగిరిలోని పేదలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని కోరుకున్నారన్నారు. ఈ బిల్లు ద్వారా 95 శాతం మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment