సాక్షి.హైదరాబాద్: సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ పూర్తిగా అవాస్తవమని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. బొగ్గు గనుల వేలంపై ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కల్వకుంట్ల కుటుంబం అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణ వద్దంటున్న రాష్ట్ర సర్కారు.. జెన్‌కోకు కేటాయించిన తాడిచర్ల గనిని ఏఎంఆర్‌కు ఎందుకు కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, కాసం వెంకటేశ్వర్లు, డా.ఎస్.ప్రకాష్‌రెడ్డిలతో కలిసి కిషన్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. సింగరేణిని కల్వకుంట్ల అధికారిక ప్రైవేట్ కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ ఏర్పాటు, కార్మి కుల బిడ్డలకు ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ వంటి హామీల అమలును గాలికి వదిలేసిందన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి అభద్రతా భావంతో కేంద్రాన్ని, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్ది ధ్వజమెత్తారు. ‘గుజరాత్‌కు ఒక నీతి.. మాకో నీతా’అని టీఆర్‌ఎస్ నేతలు అంటున్నారని, ‘మీ సిద్దిపేటకు ఒక నీతి, దుబ్బాకకు ఒక నీతా? సిరిసిల్లకు ఒకనీతి, కల్వకుర్తికి ఒక నీతా? గజ్వేల్‌కు ఒక నీతి, హుజూరాబాద్‌కు ఒక నీతా?’అని ప్రశ్నించారు. బొగ్గు కొరతతో పాటు విద్యుత్ కోతలను అధిగమించేందుకు బొగ్గుగనులను ప్రైవేటు లేదా పబ్లిక్ సెక్టార్‌కు బహిరంగ వేలంలోనే కేంద్రం కేటాయిస్తోందని తెలిపారు.
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... ‘2015లో తెలంగాణకు మూడు కోల్ బ్లాకులను కేటాయిస్తే.. అందులో పెలగడప్ప, న్యూ పట్రపార కోల్‌బ్లాకును సింగరేణి సంస్థనే వెనక్కి ఇచ్చేసింది. నైని గనిలో తవ్వకాల అనుమతులకు కేంద్రం సాయం చేసింది. తాడిచర్ల బ్లాక్ 1ను సింగరేణి, జెన్‌కోలకు ఇస్తే.. సింగరేణితో తప్పుడు రిపోర్టులిచ్చి, ఆ బ్లాక్‌ను ఏఎంఆర్ ప్రైవేటు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వమే కట్టబెట్టింది. అందులోని ఒక కంపెనీలో కల్వకుంట్ల కుటుంబానికి షేర్ ఉంది. దీనిపై విచారణ జరగాలి’అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment