సాక్షి, హైదరాబాద్: సింగరేణి మళ్లీ సిరుల రాణిగా మారింది. బొగ్గు గనుల్లో లాభాల పంట పండింది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా గతేడాది ఏర్పడిన నష్టాల ఊబి నుంచి గట్టెక్కింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2021–22లో గత ఏడు నెలల్లో రూ.868 కోట్ల లాభాలను ఆర్జించింది. 2020–21 తొలి ఏడు నెలల్లో రూ.8,537 కోట్ల అమ్మకాలు జరపగా, ఈ ఏడాది అదే కాలానికి 65 శాతం వృద్ధితో రూ.14,067 కోట్ల విక్రయాలు జరిపింది.
గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలవ్యవధిలో కరోనా విపత్కర పరిస్థితుల వల్ల బొగ్గు అమ్మకాలు, రవాణా తగ్గి రూ.1,129 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా తగ్గుముఖం పట్టాక ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణాతోపాటు విద్యుత్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 177 శాతం వృద్ధితో రూ.868 కోట్ల లాభాలను సింగరేణి సమకూర్చుకుంది. గతేడాది తొలి ఏడునెలల్లో రూ.6,678 కోట్ల బొగ్గు అమ్మకాలు జరపగా, ఈ ఏడాది 78 శాతం వృద్ధితో రూ.11,855 కోట్ల అమ్మకాలు నిర్వహించింది.
గతేడాది తొలి ఏడునెలల్లో రూ.1,860 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరగగా, ఈ ఏడాది 18 శాతం వృద్ధితో రూ.2,182 కోట్ల మేర విద్యుత్ విక్రయించింది. బొగ్గు, విద్యుత్ అమ్మకాలు కలిపి గతేడాదితో పోల్చితే గడిచిన ఏడునెలల్లో 65 శాతం అభివృద్ధిని కనబరిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో టర్నోవర్, లాభాలు ఆర్జిస్తామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ పురోగతిపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించి గత ఏడు నెలల్లో సాధించిన ఫలితాలను వెల్లడించారు.
పెరిగిన బొగ్గు, విద్యుదుత్పత్తి...
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తొలి 7నెలల్లో బొగ్గు ఉత్పత్తి 220 లక్షల టన్నుల నుంచి 60% వృద్ధితో 352 లక్షల టన్నులకు పెరిగింది. బొగ్గు రవాణా 218 లక్షలటన్నుల నుంచి 68% వృద్ధితో 367 లక్షల టన్నులకు పెరిగింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గతేడాది అక్టోబర్ వరకు 3,819 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి 39 శాతం వృద్ధితో 5,291 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఫలితంగా టర్నోవర్, లాభాలు గణనీయంగా పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment