సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని: నల్లబంగారు నేల సింగరేణి షూటింగ్ స్పాట్‌గా మారుతోంది. ఎప్పుడూ ఎక్స్‌ప్లోజివ్‌ల మోతలు.. డంపర్ల హారన్లు.. అప్రమత్తత సైరన్లు వినిపించే గనులపై యాక్షన్.. కట్.. ప్యాకప్ మాటలు వినిపిస్తున్నాయి. సింగరేణి కార్మికులు, అధికారులతో బిజీగా ఉండే గనులు.. సినీ ప్రముఖులతో సందడిగా మారుతున్నాయి. మసి, బొగ్గు, దుమ్ముతో నిండిపోయిన మైనింగ్ ప్రాంతాలు మాస్ సినిమాలకు అందమైన లోకేషన్లుగా మారాయి. ఉద్యమ సినిమాల నుంచి కామెడీ.. ప్రేమకథ.. మాస్ సినిమాలు సైతం ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ‘సలార్’ యూనిట్ సందడి చేయగా.. ఇటీవల ‘దసరా’ టీం షూటింగ్ పూర్తిచేసుకుని వెళ్లింది. సింగరేణి గనులపై సినిమా షూటింగ్‌లపై సండే స్పెషల్.
లొకేషన్స్‌కు ప్రత్యేకం కోల్‌బెల్ట్..
సినిమా షూటింగ్‌ల లొకేషన్‌కు కోల్‌బెల్ట్ ప్రాంతం పెట్టింది పేరు. సింగరేణి కార్మికుల ఇతి వృత్తాలతో పాటు పలు సినిమా షూటింగ్‌లో ఈప్రాంతంలో ఎక్కువగా జరిగాయి. భారీ బడ్జెట్ మొదలు కొన్ని చిన్న సినిమాల వరకు ఈప్రాంతం ఆదరిస్తూనే ఉంది. కళాకారులను అక్కున చేర్చుకుంటోంది. గోదావరిఖని పట్టణాన్ని ఆనుకుని ఉన్న జనగామ, సుందిళ్ల గ్రామాల్లో ఆర్.నారాయణమూర్తి అనేక సినిమా షూటింగ్‌లు చేశారు. ప్రధానంగా పదేళ్ల క్రితం సుందిళ్లలో పోరు తెలంగాణా చిత్ర సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు జరిగింది. అలాగే కోవిడ్‌కు ముందు బిత్తిరి సత్తి నటించిన తుపాకీ రాముడు సినిమా షూటింగ్ జనగామలో చాలా రోజుల పాటు జరిగింది. ఆర్.నారాయణమూర్తి నటించి నిర్మించిన నిర్భయభారతం, దండకారణ్యం సినిమా షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి. పిట్టగోడ సినిమా షూటింగ్ కూడా ఖని పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. స్థానికులే కళాకారులుగా నిర్మించిన అగ్లీఫేసెస్ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. గోదావరిఖని ప్రాంతంలోనే చిత్ర షూటింగ్ జరిగింది.
ఓసీపీ–2 బేస్‌వర్క్ షాప్‌లో ‘సలార్’ షూటింగ్ (ఫైల్)
సలార్.. దసరా సందడి
సింగరేణి ప్రాంతంలో గత పదిహేనేళ్లుగా చాలా సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లు చిత్రీకరిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసకు ప్రాముఖ్యం, దర్శకుల సంఖ్య పెరిగింది. ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న “సలార్’ మొదటి షెడ్యూల్‌ను రామగిరిలోని ఆండ్రియాలా ప్రాజెక్టులో చిత్రీకరించారు. రామగిరి వాస్తవ్యుడు దర్శకుడిగా, నాని హీరోగా దసరా సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం కొంత షూటింగ్ పూర్తికాగా.. తదుపరి సినిమా షూటింగ్ కూడా ఇక్కడే తీసేందుకు షెడ్యూల్ రూపొందించారు. విజయ్‌దేవరకొండ తన తదుపరి చిత్రం షూటింగ్ గోదావరిఖని ప్రాంతంలోనే తీసేందుకు లోకేషన్స్ వెతుకుతున్నారు. చిత్ర బృందం ఇటీవల సింగరేణి ప్రాంతంలో పర్యటించి వెళ్లారు. ఎన్టీపీసీ, సింగరేణి గెస్టు హౌస్‌లో ఆధునిక సౌకర్యాలతో వసతి సౌకర్యాలు ఉండటంతో చిత్రీకరణ కోసం వచ్చిన నటినటులు సైతం ఆసక్తి చూపుతున్నారు.
సలార్ సినిమా షూటింగ్ కోసం డమ్మీ ఆయుధాలను తయారు చేస్తున్న సిబ్బంది (ఫైల్)
ప్రీవెడ్డింగ్ షూట్స్
మాస్ సినిమాల్లో వచ్చే ఫైట్స్, పాటలకు సింగరేణి గొగ్గు గనులు దర్శకులకు మొదటి చాయిస్‌గా కనిపిస్తున్నాయి. జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల, పార్వతీ బ్యారేజీ, శ్రీపాద ఎల్లంపల్లిలో జలకళ సంతరించుకుంది. ఈ ప్రాంతాల్లో పెళ్లిళ్లకు సంబంధించిన ప్రీవెడ్డింగ్ షూట్స్, సాంగ్స్, పుట్టినరోజు వేడుకలకు చెందిన పాటలను చిత్రీకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment