న్యూఢిల్లీ: అనుమతుల్లో జాప్యం కారణంగా వాణిజ్య, క్యాప్టివ్ బొగ్గు గనులను కొన్ని సంస్థలు వాపసు చేస్తున్నాయన్న వార్తలను కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా ఖండించారు. బొగ్గు బ్లాకులను పొందిన సంస్థలేవీ తిరిగి ఇచ్చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఆయా బ్లాకుల్లో పనులు ప్రణాళికకు అనుగుణంగానే సాగుతున్నాయని, తదనుగుణంగా ఉత్పత్తి కూడా ఉంటుందని పేర్కొన్నారు.
పలు పనులు చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి సాధారణంగా బొగ్గు గని అందుబాటులోకి రావడానికి సుమారు 51 నెలలు పడుతుందని మీనా చెప్పారు. వేలంలో గనులు దక్కించుకున్న సంస్థలకు సత్వరం క్లియరెన్సులను ఇచ్చేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పర్యావరణ శాఖతో బొగ్గు శాఖ కలిసి పని చేస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో.. కమర్షియల్, క్యాప్టివ్ (సంస్థలు తమ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు తీసుకునే గనులు) గనుల వాటా 14 శాతంగా ఉంటోందని చెప్పారు.
152 వాణిజ్య, క్యాప్టివ్ గనులు ఉండగా.. ప్రస్తుతం 51 గనుల్లో ఉత్పత్తి జరుగుతోందన్నారు. తదుపరి విడత కింద నవంబర్ 15కి కాస్త అటూ ఇటూగా మరో 40 కొత్త బ్లాకులను వేలం వేయనున్నట్లు మీనా పేర్కొన్నారు. అటు కోల్ ఇండియా రెండు అనుబంధ సంస్థల (బీసీసీఎల్, సీఎంపీడీఐ) లిస్టింగ్‌పై ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని మీనా చెప్పారు. కోల్ ఇండియా పనితీరు బాగుందని, గత ఏడాది వ్యవధిలో కంపెనీ మార్కెట్ క్యాప్ 26 శాతం పెరిగిందని వివరించారు. బీసీసీఎల్, సీఎంపీడీఐలను ఒకదాని తర్వాత ఒకటిగా లిస్టింగ్ చేయనున్నట్లు ఆగస్టులో షేర్‌హోల్డర్ల వార్షిక సమావేశంలో కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment