captive
-
బొగ్గు బ్లాకులను ఎవరూ వాపసు చేయలేదు..
న్యూఢిల్లీ: అనుమతుల్లో జాప్యం కారణంగా వాణిజ్య, క్యాప్టివ్ బొగ్గు గనులను కొన్ని సంస్థలు వాపసు చేస్తున్నాయన్న వార్తలను కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా ఖండించారు. బొగ్గు బ్లాకులను పొందిన సంస్థలేవీ తిరిగి ఇచ్చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఆయా బ్లాకుల్లో పనులు ప్రణాళికకు అనుగుణంగానే సాగుతున్నాయని, తదనుగుణంగా ఉత్పత్తి కూడా ఉంటుందని పేర్కొన్నారు. పలు పనులు చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి సాధారణంగా బొగ్గు గని అందుబాటులోకి రావడానికి సుమారు 51 నెలలు పడుతుందని మీనా చెప్పారు. వేలంలో గనులు దక్కించుకున్న సంస్థలకు సత్వరం క్లియరెన్సులను ఇచ్చేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పర్యావరణ శాఖతో బొగ్గు శాఖ కలిసి పని చేస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో.. కమర్షియల్, క్యాప్టివ్ (సంస్థలు తమ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు తీసుకునే గనులు) గనుల వాటా 14 శాతంగా ఉంటోందని చెప్పారు. 152 వాణిజ్య, క్యాప్టివ్ గనులు ఉండగా.. ప్రస్తుతం 51 గనుల్లో ఉత్పత్తి జరుగుతోందన్నారు. తదుపరి విడత కింద నవంబర్ 15కి కాస్త అటూ ఇటూగా మరో 40 కొత్త బ్లాకులను వేలం వేయనున్నట్లు మీనా పేర్కొన్నారు. అటు కోల్ ఇండియా రెండు అనుబంధ సంస్థల (బీసీసీఎల్, సీఎంపీడీఐ) లిస్టింగ్‌పై ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని మీనా చెప్పారు. కోల్ ఇండియా పనితీరు బాగుందని, గత ఏడాది వ్యవధిలో కంపెనీ మార్కెట్ క్యాప్ 26 శాతం పెరిగిందని వివరించారు. బీసీసీఎల్, సీఎంపీడీఐలను ఒకదాని తర్వాత ఒకటిగా లిస్టింగ్ చేయనున్నట్లు ఆగస్టులో షేర్‌హోల్డర్ల వార్షిక సమావేశంలో కంపెనీ ప్రకటించింది. -
'నేను బందీగా ఉంటా.. నా భార్యాబిడ్డలను వదలండి' ఓ తండ్రి ఆవేదన
జెరూసలేం: ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఎన్నో కన్నీటిగాథలు వెలుగులోకి వస్తున్నాయి. హమాస్ దళాల అదుపులో వందలాది మహిళలు, పిల్లలు బందీలుగా ఉన్నారు. ఇందులో ఇజ్రాయెల్‌కు చెందిన ఇద్దరు పిల్లలతో ఓ తల్లి కూడా బందీగా చిక్కింది. వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న ఆ పిల్లల తండ్రి ఆవేదన కంటతడి పెట్టిస్తోంది. డోరోన్ అషెర్ తన ఇద్దరు పిల్లలతో గాజా సరిహద్దులో ఉన్న అత్తగారి ఇంటికి వెళ్లింది. ఆమె భర్త యూనీ అషెర్ సెంట్రల్ ఇజ్రాయెల్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో హమాస్ ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడ్డారనే విషయాన్ని డోరోనే తన భర్తకు ఫోన్లో తెలుపుతుండగానే కాల్ కట్ అయిపోయింది. గూగుల్ అకౌంట్ ద్వారా వారి ఆచూకీని గమనించిన యూనీ అషెర్.. తనవారు గాజాలో ఉన్నట్లు గమనించాడు. తన భార్యా పిల్లలను హమాస్ ఉగ్రవాదులు ఎత్తుకుపోయిన తర్వాత సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఓ వీడియోలో వారిని యూనీ అషెర్ గుర్తించారు. ఆ వీడియోలో కనిపిస్తున్నది తన భార్యా బిడ్డలేనని అధికారులకు తెలిపారు. వ్యాన్‌లో హమాస్ ఉగ్రవాదులు బందించి తీసుకువెళ్తున్నట్లు కనిపించిన ఆ వీడియోను చూసి యూనీ అషెర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలు ఏం తిన్నారో..? ఎలా ఉన్నారో..? అంటూ బోరున విలపిస్తున్నాడు. మహిళలను, పిల్లలను కొట్టకండంటూ హమాస్ ఉగ్రవాదులను కోరుకుంటున్నాడు. 'కావాలంటే నేను వస్తా.. కానీ నా భార్యా బిడ్డలను వదిలేయండి' అని వేడుకుంటున్నాడు. ఇజ్రాయెల్-హమాస్ దళాల మధ్య భీకర పోరు నడుస్తోంది. మూడు రోజులుగా నడుస్తున్న యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్‌లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
మీలో ఈ స్కిల్స్ ఉన్నాయా?, 3.64 లక్షల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ క్యాప్టివ్ సెంటర్లు (జీసీసీ) వచ్చే 12 నెలల్లో సుమారు 3.64 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకోనున్నాయని ఎన్ఎల్బీ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లలో సేవలకు డిమాండ్ నేపథ్యంలో ఈ నియామకాలు ఉంటాయని వెల్లడించింది. సర్వేలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హెల్త్‌కేర్, ఫార్మా, ఇంటర్నెట్, టెలికం, ఐటీ సాఫ్ట్వేర్, కన్సల్టింగ్, తయారీ, చమురు, సహజ వాయువు, రిటైల్ రంగంలో ఉన్న 211 జీసీసీ కంపెనీలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌సహా ఎనమిది నగరాల్లో ఇవి విస్తరించాయి. ‘గ్లోబల్ క్యాప్టివ్ సెంటర్ల పరిశ్రమ ప్రస్తుత రూ.2.95 లక్షల కోట్ల నుంచి 2026 నాటికి రూ.4.94–7 లక్షల కోట్లకు చేరుతుంది. సర్వేలో పాలుపంచుకున్న ఐటీ, సాఫ్ట్వేర్, కన్సల్టింగ్ రంగ కంపెనీల్లో సిబ్బంది సంఖ్యను పెంచుకోనున్నట్టు 33 శాతం తెలిపాయి. నియామకాలకు బీఎఫ్ఎస్ఐలో 21 శాతం, ఇంటర్నెట్, టెలికంలో 16 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించాయి. ప్రస్తుతం కార్యకలాపాలలో ఉన్న ప్రపంచ జీసీసీల్లో భారత్ దాదాపు 45 శాతం వాటా కలిగి ఉంది. ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఉపాధిలో ఈ రంగం 2023లో 10.8 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేస్తుంది. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, స్టాటిస్టికల్ అనాలిసిస్, యూఐ/యూఎక్స్ డిజైన్ వంటి డిజిటల్, మెషీన్ లెర్నింగ్ స్కిల్స్‌కు ప్రస్తుతం డిమాండ్ ఉంది’ అని నివేదిక వివరించింది. క్లయింట్లు సొంతంగా నిర్వహిస్తున్న డెలివరీ సెంటర్లే జీసీసీలు. -
‘క్యాప్టివ్’ స్పెక్ట్రం కేటాయింపు విధానాలేవీ?
న్యూఢిల్లీ: వివిధ విభాగాల సొంత అవసరాలకు (క్యాప్టివ్) కేటాయించే స్పెక్ట్రం విషయంలో ఇప్పటివరకూ నిర్దిష్ట విధానమేదీ ఖరారు చేయకపోవడంపై టెలికం శాఖ (డాట్) తీరును కాగ్ ఆక్షేపించింది. అలాగే, క్యాప్టివ్ యూజర్లకు కేటాయించే స్పెక్ట్రం ధరలను సమీక్షించే యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పు పట్టింది. క్యాప్టివ్ స్పెక్ట్రం నిర్వహణ విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించే శాఖలు, విభాగాలు, ఏజెన్సీలను ప్రోత్సహించేలా ధరల విధానాన్ని సత్వరం సమీక్షించాలని సూచించింది. అందరికీ ఒకే ధర పెట్టకుండా వినియోగం, ప్రత్యేకతలను బట్టి వివిధ రేట్లు నిర్ణయించే అవకాశాలను డాట్ పరిశీలించాలని పేర్కొంది. పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఈ అంశాలు ప్రస్తావించింది. స్పెక్ట్రం లభ్యత, కేటాయింపులు, ప్రణాళికలు, ధర తదితర అంశాలను తరచుగా సమీక్షించేందుకు సంబంధిత వర్గాలందరితోనూ డాట్ శాశ్వత ప్రాతిపదికన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. స్పెక్ట్రంను సమర్ధవంతంగా వినియోగించుకునేలా వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని కాగ్ తెలిపింది. మరిన్ని సూచనలు.. ► ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు వాస్తవంగా వినియోగించుకుంటున్న స్పెక్ట్రం వివరాలన్నీ ఒకే దగ్గర లభించేలా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) ఉండాలి. ► కేటాయింపుల విషయంలో వర్కింగ్ గ్రూప్‌ల సిఫార్సుల ఖరారు, ► సెక్రటరీల కమిటీ నిర్ణయాల అమలు కోసం అన్ని విభాగాలతో కలిసి డాట్ క్రియాశీలకంగా పనిచేయాలి. ► 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఎల్టీఈ (లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) ఆధారిత నెట్వర్క్ ప్రాజెక్టు సత్వరం పూర్తయ్యేలా డాట్, రైల్వేస్ ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తుండాలి. ఇది పూర్తయితే ప్రస్తుతం రైల్వేస్ వినియోగిస్తున్న 900 మెగాహెట్జ్ బ్యాండ్‌ను ఇతరత్రా వాణిజ్యపరమైన అవసరాల కోసం కేటాయించవచ్చు. ► తమ దగ్గర నిరుపయోగంగా ఉన్న ఇంటర్నేషనల్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (ఐఎంటీ) స్పెక్ట్రంను వేలం వేసేందుకు/వినియోగంలోకి తెచ్చేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో సంప్రదింపులు జరపడం ద్వారా డాట్ సత్వరం నిర్ణయం తీసుకోవాలి. ► ఓఎన్జీసీ, గెయిల్ వంటి సంస్థలకు కేటాయించిన స్పెక్ట్రంను అవి పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా, నిరుపయోగంగా ఉన్న ఫ్రీక్వెన్సీలను వాపసు చేసేలా చర్యలు తీసుకోవాలి. -
టెక్ కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించవద్దు
న్యూఢిల్లీ: బడా టెక్ కంపెనీలు ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రంను కేటాయించవద్దని కేంద్రానికి టెల్కోల సమాఖ్య సీవోఏఐ విజ్ఞప్తి చేసింది. అలా చేస్తే అవి దొడ్డిదారిన టెలికం రంగంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘టెల్కోలకు వర్తించే నిబంధనలు, పెనాల్టీలు వంటి బాదరబందీలేవీ బడా టెక్ కంపెనీలకు ఉండవు. క్యాప్టివ్ (సొంత అవసరాలకు) 5జీ నెట్‌వర్క్‌ల కోసం ప్రభుత్వం స్పెక్ట్రం కేటాయిస్తే.. భారత్‌లోని కంపెనీలకు 5జీ సర్వీసులు, సొల్యూషన్స్ అందించడానికి బడా టెక్నాలజీ సంస్థలకు దొడ్డిదారిన ఎంట్రీ ఇచ్చినట్లే అవుతుంది. వేలంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండా స్పెక్ట్రం కేటాయిస్తే, అన్ని సంస్థలకూ సమానంగా అవకాశాలు కల్పించాలన్న సూత్రానికి విఘాతం కలుగుతుంది‘ అని సీవోఏఐ వివరించింది. ఆదాయాలకు దెబ్బ.. ఇతరత్రా కంపెనీలు ప్రైవేట్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేస్తే టెల్కోల ఆదాయం గణనీయంగా పడిపోతుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇక తాము ప్రత్యేకంగా 5జీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడం అర్ధరహితంగా మారుతుందని తెలిపారు. టెక్ కంపెనీలు తమ ప్రైవేట్ నెట్వర్క్ కోసం టెల్కోల నుంచి స్పెక్ట్రంను లీజుకు తీసుకోవచ్చని, డిమాండ్‌ను బట్టి వాటికి నేరుగా కూడా కేటాయించే అవకాశాలను పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సీవోఏఐ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 5జీ స్పెక్ట్రం కావాలనుకుంటున్న కంపెనీలు వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడం సంతోషించతగ్గ విషయమని సీవోఏఐ పేర్కొంది. జులై నెలాఖరులో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో అదానీ గ్రూప్ కూడా పాల్గొంటోంది. ఈ వేలంలో రూ. 4.3 లక్షల కోట్లు విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను విక్రయించనున్నారు. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా దరఖాస్తు చేసుకున్నాయి. -
సైనికుల చేతిలో బుర్కినా ప్రెసిడెంట్ బందీ!
ఉగడుగు: బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరెను బంధించామని ఆ దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు ప్రకటించారు. అధ్యక్షుడిని ఎక్కడ దాచింది వెల్లడించలేదు. ఆదివారం సైనిక శిబిరాల వద్ద మొదలైన కాల్పుల కలకలం సోమవారం కూడా కొనసాగింది. అధ్యక్ష భవనం వద్ద చిన్నపాటి యుద్దం జరిగింది. రాజధానిలో తిరుగబాటు సైనికులు గస్తీ కాస్తున్నారు. తొలుత ఇది తిరుగుబాటు కాదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ చివరకు సైనికుల చేతికి ప్రెసిడెంటే బందీగా చిక్కారు. 2015 నుంచి బుర్కినాకు కబోరె అధిపతిగా ఉన్నారు. దేశంలో జరుగుతున్న ఉగ్రచర్యలతో మిలటరీ తీవ్రంగా నష్టపోతోంది. తమకు సరైన సదుపాయాలు లేవని సైనికులు అసంతృప్తిగా ఉన్నారు. ఇది చివరకు తిరుగుబాటకు దారితీసింది. తిరుగుబాటుకు ప్రజల్లో కూడా మద్దతు ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు తెలిపారు. -
కామ పిశాచి.. సవతి కూతురిని దాచేసి
న్యూఢిల్లీ : మానవ మృగాల్లో కూడా అనిర్వచనీయ కరడుగట్టిన మృగాలు ఉంటాయని అమెరికాకు చెందిన హెన్రీ మిచెల్లీ పియెట్ నిరూపించాడు. 63 ఏళ్ల ఆ కామ పిశాచి తన సవతి కూతురిని 11 ఏళ్ల వయస్సులో కిడ్నాప్ చేసి అక్రమంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మెక్సికోకు తీసుకెళ్లి అక్కడ ఆమెపై ప్రతిరోజు భౌతికంగానే కాకుండా లైంగిక దాడి చేసి ఏకంగా తొమ్మిది మంది పిల్లలను కన్నాడు. తాను మాత్రం బీరు సీసాలతో, హోటల్ భోజనంతో కులాసాగానే బతుకుతూ భార్యా, పిల్లలను అర్ధాకలికి వదిలేసి భూలోక నరకం చూపించాడు. (బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి తాళం..) 1997 నుంచి 19 ఏళ్ల పాటు తన సవతి తండ్రి పియెట్ నిర్బంధంలో ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన రొసాలిన్ మ్యాక్గిన్నిస్, స్థానికుల సహాయంతో 2016 జూన్‌లో ఎనిమిది మంది పిల్లలతో తప్పించుకొని అమెరికాలోని ఓక్లహామ చేరుకున్నారు. పెద్ద కుమారుడు అంతకుముందే ఆ చెర నుంచి తప్పించుకొని ఎక్కడికో పారిపోయారు. రొసాలిన్ తన భర్తగానీ భర్త పియెట్‌పై కేసు పెట్టగా, ఆయన్ని ఓక్లహామ పోలీసులు 2017లో అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ఓక్లహామ ఫెడరల్ కోర్టు పియెట్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గత బుధవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పు రొసాలిన్‌కు జరిగిన నష్టాన్ని పూడ్చ లేదని, ఆమె పట్ల సానుభూతి చూపడం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని అమెరికా అటార్నీ బ్రియాన్ జే. కుస్టర్ వ్యాఖ్యానించారు. రొసాలిన్‌కు ప్రస్తుతం 34 ఏళ్లు. ఆమె ‘పీపుల్ టీవీ’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ప్రకారం ఆమె తొమ్మిదవ ఏట, ఆమె తల్లి, పియెట్‌తో డేటింగ్ చేస్తూ కలిసి ఉన్నారు. అప్పుడే పియట్, రొసాలిన్‌ను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. పియట్ భౌతికంగా కొడుతుండడంతో రొసాలిన్ తల్లి కూడా ఆయనతో విడిపోయింది. అప్పటికే తనకు ముగ్గురు పిల్లలున్న పియెట్ ఓ రోజు వారితో కలిసి రొసాలిన్ చదువుతున్న స్కూల్‌కు వ్యాన్‌లో వెళ్లి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అప్పటికి 11 ఏళ్లున్న రొసాలిన్‌ను పియెట్ తన పిల్లలకు తల్లిగా పరిచయం చేసి, వారి సాయంతో ఆమెను అక్రమంగా పెళ్లి చేసుకున్నాడు. మెక్సికో వెళ్లిన తర్వాత పియెట్ ఓ షెడ్డులో రొసాలిన్తో వేరు కాపురం పెట్టాడు. బయటకు వెళ్లేటప్పుడు పియెట్ షెడ్డుకు తాళం పెట్టి వెళ్లేవాడు. రొసాలిన్‌కు 15వ ఏట మొదటి సంతానం కలిగింది. అప్పటి వరకు పారిపోయేందుకు పలు సార్లు ప్రయత్నించి విఫలమైన రొసాలిన్ ఆ తర్వాత తెలియని మానసిక స్థితిలో నిస్తేజంగా ఉండిపోయి తొమ్మిది మంది పిల్లలకు తల్లయింది. పిల్లలు కూడా సరిగ్గా తిండిలేక ఇబ్బంది పడుతుండడంతో వారిని తీసుకొని ఎక్కడికన్నా పారిపోవాలనుకుంది. చేతిలో చిల్లి గవ్వా లేకపోవడం, ఇరుగు, పొరుగు వారితో కనీసం ముఖ పరిచయం కూడా లేకపోవడంతో పారిపోయేందుకు అంతగా సాహసం చేయలేక పోయింది. 2016లో కొద్దిగా పరిచయమైన పొరుగింటి మహిళ సహకారంతో రొసాలిన్, మెక్సికోలోని అమెరికా అంబసీని సందర్శించి అమెరికాలోని ఓక్లహామ చేరుకున్నారు. ‘నేను ఎలా బతికానో, ఎందుకు బతికానో తెలియదు. నా 19 ఏళ్ల జీవితం జీవచ్ఛవంలా, అగమ్య గోచరంగా, ఒకరకమైన అపస్మారక స్థితిలో సాగింది’ అంటూ ఆమె ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది. పియెట్ పైసాచిక ఉదంతం ఆస్ట్రియా రేపిస్ట్ జోసఫ్ ఫ్రిజిల్ ఉదంతాన్ని గుర్తు చేస్తోంది. ఆ రాక్షసుడు సొంత కూతురిని నేల మాలిగలో 24 ఏళ్ల పాటు నిర్బంధించి ఏడుగురు సంతానాన్ని కన్నాడు. (చదవండి: చచ్చిపోతా.. చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు!) -
ఆధిపత్యపోరులో భారతీయులు బందీలు
న్యూఢిల్లీ/లండన్: బ్రిటన్–ఇరాన్‌ల మధ్య సాగుతున్న ఆధిపత్యపోరులో భారతీయులు చిక్కుకున్నారు. తమ చమురునౌకను బ్రిటన్ స్వాధీనం చేసుకోవడంతో ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిగుండా వెళుతున్న బ్రిటిష్ చమురు నౌక ‘స్టెనా ఇంపెరో’ను ఇరాన్ శుక్రవారం స్వాధీనం చేసుకుంది. ఈ నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా, వీరిలో కెప్టెన్ సహా 18 మంది భారతీయులే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన భారత విదేశాంగ శాఖ ఈ 18 మందిని విడిపించేందుకు ఇరాన్‌తో చర్చిస్తోంది. చెరలోని భారతీయ సిబ్బందిని త్వరలో స్వదేశానికి తీసుకొస్తామని విదేశాంగ కార్యదర్శి రవీశ్ తెలిపారు. ఈ విషయమై హోర్ముజ్‌గన్ ప్రావిన్సు నౌకాశ్రయాలు, మారిటైమ్ డైరెక్టర్ జనరల్ అల్హమొరాద్ మాట్లాడుతూ..‘బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ‘స్టెనా ఇంపెరో’ నౌక ఇరాన్‌కు చెందిన చేపల బోటును ఢీకొట్టింది. అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించింది. ఈ నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో కెప్టెన్ సహా 18 మంది భారతీయులు కాగా, రష్యా, ఫిలిప్పీన్స్, లాత్వియా, ఇతర దేశాలకు చెందిన ఐదుగురు ఉన్నారు’ అని తెలిపారు. స్వీడన్‌కు చెందిన స్టెనా బల్క్ అనే కంపెనీ ఈ నౌకను బ్రిటన్ కేంద్రంగా నిర్వహిస్తోంది. ఈ విషయమై స్టెనా బల్క్ ప్రెసిడెంట్ ఎరిక్ హనెల్ మాట్లాడుతూ..‘మా నౌక హోర్ముజ్ జలసంధిలో ఉండగానే మరో చిన్నపాటి నౌక, హెలికాప్టర్ దాన్ని సమీపించాయి. అంతర్జాతీయ జలాల్లోకి ‘స్టెనా ఇంపెరో’ ప్రవేశించిన కొద్దిసేపటికే సౌదీఅరేబియాలోని జుబైల్ నగరంవైపు కాకుండా దిశను మార్చుకుని ఇరాన్‌వైపు వెళ్లింది’ అని చెప్పారు. ఈయూ ఆంక్షలను ఉల్లంఘించి సిరియాకు ముడిచమురు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో ఇరాన్‌కు చెందిన చమురు నౌకను బ్రిటిష్ మెరైన్లు జీబ్రాల్టర్ జలసంధి వద్ద ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. -
కాంగ్రెస్ కబంధ హస్తాల్లో కోదండరాం: సుమన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కబంధ హస్తాల్లో జేఏసీ చైర్మన్ కోదండరాం బందీ అయ్యారని ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం, మల్లన్న సాగర్, పాలమూరు, డిండి, కొండపోచమ్మ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేసిన ముఠానే నిరుద్యోగుల సమస్యను వాడుకుంటూ విద్యార్థుల భవిష్యత్‌ను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. రాజకీయం చేస్తున్న కోదండరాం ముఠా: పల్లా సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు వస్తున్న ఖ్యాతిని తట్టుకోలేక విపక్షాలు కోదండరాంను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం, కేసీఆర్, ఆయన కుటుంబంపై విషం కక్కుతున్నాయని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కోదండరాంను, ఆయన ముఠాను నిరుద్యోగులు నమ్మడం లేదన్నారు. కోదండరాంకు దమ్ముంటే పార్టీ పెట్టాలన్నారు. విద్యార్థి మురళి డీఈడీ, బీఈడీ చేయలేదని తెలిసి కూడా ఆయన డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారని కోదండరాం అసత్యాలు చెప్పడం దురదృష్టకరమన్నారు. -
అత్యాచారం చేసి, మతమార్పిడికి ఒత్తిడి
సుల్తాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. సుల్తాన్‌పూర్‌లో ఓ వ్యక్తి తన భార్య, సమీప బంధువు సాయంతో ఓ దళిత మహిళను ఐదు నెలలుగా బంధించి, అత్యాచారం చేయడంతో పాటు బలవంతపు మతమార్పిడికి ఒత్తిడితెచ్చాడు. బాధితురాలి దుండగుడి బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తౌహిద్ అనే వ్యక్తి ఉద్యోగం ఇస్తానని ఆశ చూపి బాధితురాలిని తన ఇంటికి తీసుకెళ్లాడు. తౌహిద్ తన భార్య తబాసుమ్, బావమరిది పప్పు సాయంతో ఆమెను బందీని చేశాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడి, మతంమార్చుకోవమని ఒత్తడి చేశాడు. మంగళవారం బాధితురాలు తప్పించుకుని ఓ ఆశ్రమానికి వెళ్లింది. వారి సాయంతో పోలీసులుకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు. ఈ కేసును త్వరితగతిన విచారణ చేయాల్సిందిగా ఎస్పీ సోనియా సింగ్ ఆదేశించారు.