కామ పిశాచి.. సవతి కూతురిని దాచేసి | Man Gets Life for Holding Stepdaughter Captive For 19 Years | Sakshi
Sakshi News home page

సవతి కూతురి కిడ్నాప్, పెళ్లి, నిర్బంధం..

Published Sat, Feb 29 2020 4:20 PM | Last Updated on Sun, Mar 1 2020 8:28 AM

Man Gets Life for Holding Stepdaughter Captive For 19 Years - Sakshi

న్యూఢిల్లీ : మానవ మృగాల్లో కూడా అనిర్వచనీయ కరడుగట్టిన మృగాలు ఉంటాయని అమెరికాకు చెందిన హెన్రీ మిచెల్లీ పియెట్‌ నిరూపించాడు. 63 ఏళ్ల ఆ కామ పిశాచి తన సవతి కూతురిని 11 ఏళ్ల వయస్సులో కిడ్నాప్‌ చేసి అక్రమంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మెక్సికోకు తీసుకెళ్లి అక్కడ ఆమెపై ప్రతిరోజు భౌతికంగానే కాకుండా లైంగిక దాడి చేసి ఏకంగా తొమ్మిది మంది పిల్లలను కన్నాడు. తాను మాత్రం బీరు సీసాలతో, హోటల్‌ భోజనంతో కులాసాగానే బతుకుతూ భార్యా, పిల్లలను అర్ధాకలికి వదిలేసి భూలోక నరకం చూపించాడు. (బాయ్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో పెట్టి తాళం..)

1997 నుంచి 19 ఏళ్ల పాటు తన సవతి తండ్రి పియెట్‌ నిర్బంధంలో ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన రొసాలిన్‌ మ్యాక్‌గిన్నిస్, స్థానికుల సహాయంతో 2016 జూన్‌లో ఎనిమిది మంది పిల్లలతో తప్పించుకొని అమెరికాలోని ఓక్లహామ చేరుకున్నారు. పెద్ద కుమారుడు అంతకుముందే ఆ చెర నుంచి తప్పించుకొని ఎక్కడికో పారిపోయారు. రొసాలిన్‌ తన భర్తగానీ భర్త పియెట్‌పై కేసు పెట్టగా, ఆయన్ని ఓక్లహామ పోలీసులు 2017లో అరెస్ట్‌ చేశారు. ఈ కేసును విచారించిన ఓక్లహామ ఫెడరల్‌ కోర్టు పియెట్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గత బుధవారం తీర్పు చెప్పింది. ఈ తీర్పు రొసాలిన్‌కు జరిగిన నష్టాన్ని పూడ్చ లేదని, ఆమె పట్ల సానుభూతి చూపడం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని అమెరికా అటార్నీ బ్రియాన్‌ జే. కుస్టర్‌ వ్యాఖ్యానించారు.

రొసాలిన్‌కు ప్రస్తుతం 34 ఏళ్లు. ఆమె ‘పీపుల్‌ టీవీ’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ప్రకారం ఆమె తొమ్మిదవ ఏట, ఆమె తల్లి, పియెట్‌తో డేటింగ్‌  చేస్తూ కలిసి ఉన్నారు. అప్పుడే పియట్, రొసాలిన్‌ను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. పియట్‌ భౌతికంగా కొడుతుండడంతో రొసాలిన్‌ తల్లి కూడా ఆయనతో విడిపోయింది. అప్పటికే తనకు ముగ్గురు పిల్లలున్న పియెట్‌ ఓ రోజు వారితో కలిసి రొసాలిన్‌ చదువుతున్న స్కూల్‌కు వ్యాన్‌లో వెళ్లి ఆమెను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడు. అప్పటికి 11 ఏళ్లున్న రొసాలిన్‌ను పియెట్‌ తన పిల్లలకు తల్లిగా పరిచయం చేసి, వారి సాయంతో ఆమెను అక్రమంగా పెళ్లి చేసుకున్నాడు.

మెక్సికో వెళ్లిన తర్వాత పియెట్‌ ఓ షెడ్డులో రొసాలిన్‌తో వేరు కాపురం పెట్టాడు. బయటకు వెళ్లేటప్పుడు పియెట్‌ షెడ్డుకు తాళం పెట్టి వెళ్లేవాడు. రొసాలిన్‌కు 15వ ఏట మొదటి సంతానం కలిగింది. అప్పటి వరకు పారిపోయేందుకు పలు సార్లు ప్రయత్నించి విఫలమైన రొసాలిన్‌ ఆ తర్వాత తెలియని మానసిక స్థితిలో నిస్తేజంగా ఉండిపోయి తొమ్మిది మంది పిల్లలకు తల్లయింది. పిల్లలు కూడా సరిగ్గా తిండిలేక ఇబ్బంది పడుతుండడంతో వారిని తీసుకొని ఎక్కడికన్నా పారిపోవాలనుకుంది. చేతిలో చిల్లి గవ్వా లేకపోవడం, ఇరుగు, పొరుగు వారితో కనీసం ముఖ పరిచయం కూడా లేకపోవడంతో పారిపోయేందుకు అంతగా సాహసం చేయలేక పోయింది. 2016లో కొద్దిగా పరిచయమైన పొరుగింటి మహిళ సహకారంతో రొసాలిన్, మెక్సికోలోని అమెరికా అంబసీని సందర్శించి అమెరికాలోని ఓక్లహామ చేరుకున్నారు. ‘నేను ఎలా బతికానో, ఎందుకు బతికానో తెలియదు. నా 19 ఏళ్ల జీవితం జీవచ్ఛవంలా, అగమ్య గోచరంగా, ఒకరకమైన అపస్మారక స్థితిలో సాగింది’ అంటూ ఆమె ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంది.

పియెట్‌ పైసాచిక ఉదంతం ఆస్ట్రియా రేపిస్ట్‌ జోసఫ్‌ ఫ్రిజిల్‌ ఉదంతాన్ని గుర్తు చేస్తోంది. ఆ రాక్షసుడు సొంత కూతురిని నేల మాలిగలో 24 ఏళ్ల పాటు నిర్బంధించి ఏడుగురు సంతానాన్ని కన్నాడు. (చదవండి: చచ్చిపోతా.. చిన్నోడి కోసం 4 లక్షల డాలర్లు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement