న్యూఢిల్లీ: వివిధ విభాగాల సొంత అవసరాలకు (క్యాప్టివ్) కేటాయించే స్పెక్ట్రం విషయంలో ఇప్పటివరకూ నిర్దిష్ట విధానమేదీ ఖరారు చేయకపోవడంపై టెలికం శాఖ (డాట్) తీరును కాగ్ ఆక్షేపించింది. అలాగే, క్యాప్టివ్ యూజర్లకు కేటాయించే స్పెక్ట్రం ధరలను సమీక్షించే యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పు పట్టింది.
క్యాప్టివ్ స్పెక్ట్రం నిర్వహణ విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించే శాఖలు, విభాగాలు, ఏజెన్సీలను ప్రోత్సహించేలా ధరల విధానాన్ని సత్వరం సమీక్షించాలని సూచించింది. అందరికీ ఒకే ధర పెట్టకుండా వినియోగం, ప్రత్యేకతలను బట్టి వివిధ రేట్లు నిర్ణయించే అవకాశాలను డాట్ పరిశీలించాలని పేర్కొంది. పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఈ అంశాలు ప్రస్తావించింది.
స్పెక్ట్రం లభ్యత, కేటాయింపులు, ప్రణాళికలు, ధర తదితర అంశాలను తరచుగా సమీక్షించేందుకు సంబంధిత వర్గాలందరితోనూ డాట్ శాశ్వత ప్రాతిపదికన ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. స్పెక్ట్రంను సమర్ధవంతంగా వినియోగించుకునేలా వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని కాగ్ తెలిపింది.
మరిన్ని సూచనలు..
► ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు వాస్తవంగా వినియోగించుకుంటున్న స్పెక్ట్రం వివరాలన్నీ ఒకే దగ్గర లభించేలా మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) ఉండాలి.
► కేటాయింపుల విషయంలో వర్కింగ్ గ్రూప్‌ల సిఫార్సుల ఖరారు,
► సెక్రటరీల కమిటీ నిర్ణయాల అమలు కోసం అన్ని విభాగాలతో కలిసి డాట్ క్రియాశీలకంగా పనిచేయాలి.
► 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో ఎల్‌టీఈ (లాంగ్ టర్మ్ ఎవల్యూషన్) ఆధారిత నెట్‌వర్క్ ప్రాజెక్టు సత్వరం పూర్తయ్యేలా డాట్, రైల్వేస్ ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తుండాలి. ఇది పూర్తయితే ప్రస్తుతం రైల్వేస్ వినియోగిస్తున్న 900 మెగాహెట్జ్ బ్యాండ్‌ను ఇతరత్రా వాణిజ్యపరమైన అవసరాల కోసం కేటాయించవచ్చు.
► తమ దగ్గర నిరుపయోగంగా ఉన్న ఇంటర్నేషనల్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (ఐఎంటీ) స్పెక్ట్రంను వేలం వేసేందుకు/వినియోగంలోకి తెచ్చేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో సంప్రదింపులు జరపడం ద్వారా డాట్ సత్వరం నిర్ణయం తీసుకోవాలి.
► ఓఎన్‌జీసీ, గెయిల్ వంటి సంస్థలకు కేటాయించిన స్పెక్ట్రంను అవి పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా, నిరుపయోగంగా ఉన్న ఫ్రీక్వెన్సీలను వాపసు చేసేలా చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment