తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల అధ్యయన యాత్రను జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం ఉదయం 5 గంటలకు ప్రారంభించనున్నారు.
ప్రారంభించనున్న ప్రొ. కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల అధ్యయన యాత్రను జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం ఉదయం 5 గంటలకు ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ జేఏసీ దీక్షా శిబిరం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారు.
జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు, పలు ప్రజాసంఘాల నాయకులు కాన్వాయ్‌గా ఇక్కడి నుంచి బయల్దేరి ఉదయం 9 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌కు చేరుకుంటారు. వివిధ జిల్లాలకు చెందిన బాధ్యులతో కలసి ఆర్‌కే-ఓసీపీని సందర్శిస్తారు. అనంతరం మందమర్రి సమీపంలోని ఎర్రగుంటపల్లిలో భూ నిర్వాసితులు, సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల బాధితులు, వారసత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్న వారిని కలసి అభిప్రాయాలు సేకరిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు గోదావరిఖనిలో జరిగే సదస్సులో పాల్గొంటారు.