open cast
-
రామగుండం ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం, ఇద్దరు మృతి
పెద్దపల్లి, సాక్షి: రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓసీపీ-2లో పైప్‌లైన్ లీకేజీని అరికట్టేందుకు నలుగురు కార్మికులు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీదపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక మృతి చెందారు. మృతులు ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్‌గా గుర్తించారు. మృతదేహాలను గోదావరి ఖని ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ప్రమాదం గురించి తెలియగానే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ -2 గనిలో పైప్‌లైన్ మరమ్మత్తులు చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఒక ప్రకటన విడుదల చేశారాయన. .. వర్షాకాలం గనుల్లో నిలిచిపోయే నీటిని తోడి వేసేందుకు అవసరమైన పంపులు, వాటర్ పైప్లైన్ల మరమ్మత్తుల సందర్భంగా ఈ ఘటన జరిగిందని తెలిసింది. కార్మికుల భద్రత విషయంలో అలసత్వానికి తావు లేకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులకు సూచిస్తున్నాను’’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తా : బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి రామగుండం ఓపెన్ కాస్ట్ గనిలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్ సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. మృతి చెందిన కార్మికులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో అధికారులకు ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్లు అక్షయ పాత్రగా మారారని బండి సంజయ్ మండిపడ్డారు. సింగరేణి అధికారులు కాంట్రాక్టు కేటాయించి పనులపై పర్యవేక్షణ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి నిబంధనలను గాలికి వదిలి వేయటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సింగరేణిలో ఓబీ పనుల్లో అధికార పార్టీ నేతలు బినామీలతో కాంట్రాక్టు పనులు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. సింగరేణి ప్రమాద విషయంలో కేంద్ర మంత్రులకు పిర్యాదు చేస్తానన్నారు. మృతి చెందిన కుటుంబాలకు కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. (ఓపెన్‌కాస్ట్ ప్రమాదం : వైఎస్ జగన్‌లా ఆదుకోవాలి) -
ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ..!
రామగుండంక్రైం: పొట్టకూటికోసం ఒకరు.. పిల్లల పోషణకు మరొకరు..కూతుళ్ల పెళ్లిళ్లు ఘనంగా చేయాలని ఓ తండ్రి.. కుటుంబానికి సాయంగా ఉంటానని ఓబీ సంస్థలో కార్మికులు గా చేరారు. మంగళవారం జరిగిన బ్లాస్టింగ్‌లో మృతిచెందిన నలుగురు కుటుంబాల దీనగాథ ఇదీ..(ఓపెన్‌కాస్ట్ ప్రమాదం : వైఎస్ జగన్‌లా ఆదుకోవాలి) పొట్టకూటి కోసం.. మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన రాకేశ్ తండ్రి రాజన్న మృతిచెందాడు. తల్లి సుశీల పొట్టకూటి కోసం ఇద్దరు కొడుకులు రవి ,రాకేశ్, కూతురు మౌనికను తీసుకుని గోదావరిఖనికి వచ్చి భగత్‌సింగ్ నగర్ ఉంటున్నారు. మౌనిక పెళ్లి చేయగా, పెద్ద కొడుకు రవి కూలీ పని చేసుకుంటున్నాడు. రాకేశ్ ఏడాది క్రితమే ఓబీ సంస్థలో పనిలో చేరాడు. ఎదిగిన కొడుకు మృతితో సుశీల కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కూతుళ్ల పెళ్లి కోసం.. బిళ్ల రాజేశం వ్యవసాయం చేసేవాడు. ఈయనకు భార్య ధనలక్ష్మి, కూతుళ్లు మధుప్రియ, మానస. కూతుళ్ల పెళ్లి కోసం వ్యవసాయం వదిలి ఓబీ సంస్థలో కార్మికునిగా చేరాడు. పెద్ద కూతురు మధుప్రియకు వివాహం చేయగా, చిన్న కూతురు మానసకు కూడా మంచి సంబంధం తీసుకొచ్చి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నాడు. ప్రమాదంలో మృతిచెందడంతో భార్య బిడ్డలు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. పిల్లల భవిష్యత్ ఆగం కమాన్‌పూర్‌కు చెందిన బండ అర్జయ్య(42) ఓబీ కార్మికుడిగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ఊర్మిళ, కరీంనగర్లో బీఫార్మసీ చదువుతున్న కూతురు నవ్యశ్రీ, గర్రెపల్లి మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న కొడుకు అభిరామ్ ఉన్నారు. పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలని కలలుగన్న అర్జయ్య ప్రమాదంలో దుర్మరణం చెందడంతో పిల్లల భవిష్యత్తును తలచుకుంటూ ఊర్మిళ శోకసంద్రంలో మునిగిపోయింది. భార్యా, పిల్లలకు దూరం.. బ్లాస్టింగ్ ప్రమాదంలో మృతి చెందిన బండారి ప్రవీణ్‌కుభార్య విలాసిని, ఐదేళ్ల కూతురు హానిక, ఏడాదిన్నర కొడుకు విహాన్ ఉన్నారు. ప్రవీణ్ తండ్రి సాల్మన్ సింగరేణి సంస్థలో పనిచేసి రిటైర్ అయి మృతిచెందాడు. ప్రవీణ్ రెండేళ్లుగా ఓబీ సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రవీణ్ మృతితో భార్య, పిల్లలు ఒంటరయ్యారు. తాము ఎలా బతకాలని విలాసిని రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. -
ఓపెన్‌కాస్ట్ ప్రమాదం : వైఎస్ జగన్‌లా ఆదుకోవాలి
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి ఉపరితల గనిలో మంగళవారం జరిగిన ప్రమాదానికి కారణమైన వారిని సస్పెండ్ చేయాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎల్జి పాలిమర్స్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినట్లు సింగరేణి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకెళ్లమని బాధిత కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. రామగుండం రీజియన్, ఆర్జీ–3 డివిజన్ పరిధిలోని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు–1 (ఓసీపీ–1) బొగ్గుగని ఫేజ్–2లో మట్టి తొలగిస్తుండగా జరిగిన ప్రమాదంలో కమాన్‌పూర్‌కు చెందిన బిల్ల రాజేశం (46), గోదావరిఖనికి చెందిన రాకేశ్ రాజన్న బెల్కివార్ (27), బండారి ప్రవీణ్ (37), కమాన్‌పూర్ (దాసరిపల్లి)కి చెందిన బండి అర్జయ్య (48)లు మృతిచెందగా, మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. (‘సింగరేణి’లో భారీ పేలుడు) కాగా, నష్ట పరిహారం విషయంలో సింగరేణి అధికారులతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు ఇంకా కొలిక్కిరాకపోవడంతో మృతుల కుటుంబసభ్యుల ఆందోళన కొనసాగుతోంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.30 లక్షలు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ అంగీకరించాడు. అయితే కోటి రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని కార్మిక సంఘాలు, కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. -
‘సింగరేణి’లో భారీ పేలుడు
రామగిరి(మంథని) : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి ఉపరితల గనిలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, తోటి కార్మికుల కథనం ప్రకారం.. రామగుండం రీజియన్, ఆర్జీ–3 డివిజన్ పరిధిలోని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు–1 (ఓసీపీ–1) బొగ్గుగని ఫేజ్–2లో మట్టి తొలగింపు పనులను సింగరేణి యాజమాన్యం ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఇక్కడ మట్టి తొలగించేందుకు నిత్యం బ్లాస్టింగ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం షిఫ్టు విధులకు వెళ్లిన కార్మికులు బ్లాస్టింగ్ కోసం ముందుగా వేసిన డ్రిల్స్‌లో బ్లాస్టింగ్ ఇన్చార్జి, డిప్యూటీ మేనేజర్ ఎ.మధు, ఓవర్‌మెన్ మామిడి సతీశ్ పర్యవేక్షణలో డిటోనేటర్లు అమర్చి, రసాయనాలు నింపుతున్నారు. 31వ డ్రిల్స్‌లో పేలుడు పదార్థాలు నింపిన కార్మికులు 32వ డ్రిల్ బోల్టర్ (పెద్ద బండరాయి)కి వేశారు. 10:25 గంటలకు అందులో డిటోనేటర్ అమర్చి రసాయనం నింపే పనిని కమాన్‌పూర్‌కు చెందిన బిల్ల రాజేశం (46), గోదావరిఖనికి చెందిన రాకేశ్ రాజన్న బెల్కివార్ (27), బండారి ప్రవీణ్ (37), ఎస్ఎంఎస్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికునిగా పని చేస్తున్న కమాన్‌పూర్ (దాసరిపల్లి)కి చెందిన బండి అర్జయ్య (48), కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లి పంచాయతీ పరిధి శాలపల్లికి చెందిన కుందారపు వెంకటేశ్, జూలపల్లికి చెందిన బండి శంకర్, రత్నాపూర్ పంచాయతీ పరిధి రాంనగర్‌కు చెందిన కొదురుపాక భీమయ్య చేపట్టారు. ఈ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బిల్ల రాజేశం, రాకేశ్‌రాజన్న బెల్కివార్, బండారి ప్రవీణ్, బండి అర్జయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు ముక్కలు ముక్కలయ్యాయి. కొద్ది దూరంలో ఉన్న వెంకటేశ్, బండి శంకర్, కొదురుపాక భీమయ్య తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను ఓ వాహనంలో గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుందారపు వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చెల్లాచెదురుగా పడిన నలుగురి శరీర భాగాలను మరో వాహనంలో తీసుకెళ్లారు. -
ఓపెన్ కాస్ట్లో ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఆర్జీ-3 ఓసీపీ-1లో మట్టి తొలగిస్తుండగా భారీ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు భారీ పేలుడు సంభవించి నలుగురు కార్మికులు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు కమాన్ పూర్‌కు చెందిన రాజేష్, అర్జయ్య, గోదావరిఖని చెందిన రాకేష్, ప్రవీణ్‌లుగా గుర్తించారు. కమాన్‌పూర్‌కు చెందిన వెంకటేశ్, రత్నాపూర్‌కు చెందిన బీమయ్య, జూలపల్లికి చెందిన శంకర్‌కు గాయాలు అయ్యాయి. గాయపడ్డ ముగ్గురికి గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు అంతా కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్నారు. రామగుండం సీపీ సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మట్టిలో బండరాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేయడానికి ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలో క్షతగాత్రులను ఎంపీ వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఐఎన్టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు సోమారపు సత్యనారాయణలు పరామర్శించారు. ఆందోళనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రి వద్ద, ఓసీపీ-1 వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ ఘటనలో మృతిచెందిన నలుగురికి కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఐఎన్టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు. గాయపడ్డ ముగ్గురికి రూ. 50 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని, పేలుడుపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలన్నారు. (‘కింగ్‌కోఠి’లో 19 మందికి పాజిటివ్) -
షార్ట్ సర్క్యూట్‌తో షావల్ యంత్రం దగ్ధం
టేకులపల్లి: ఓపెన్ కాస్ట్లో మంగళవారం రాత్రి సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓపెన్ కాస్ట్లో బొగ్గు తీసి లారీలో లోడ్ చేసే షావల్ యంత్రంలో మంటలు చెలరేగి యంత్రం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని కొయ్యగూడెంలోని ఓపెన్ కాస్ట్లో చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ షావల్ యంత్ర ఆపరేటర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు చెబుతున్నారు. -
ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం..ఆపరేటర్ మృతి
మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): మణుగూరు ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం జరిగింది. రెండు డంపర్లు ఢీకొని కొండారెడ్డి అనే ఆపరేటర్ మృతిచెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కొండారెడ్డి మృతితో ఆయన కుటంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు
కాసిపేట : మండలంంలోని కెకె ఓపెన్‌కాస్టు నిర్వాసిత గ్రామం దుబ్బగూడెంలో బుధవారం సామాజిక ఆర్ధిక స్థితిగతులపై చేస్తున్న సర్వేను గ్రామస్తులు అడ్డుకున్నారు. గతవారం రోజుల క్రితం సర్వేలు ప్రారంభించగా తమకు పునరావాసానికి స్థలం ఎక్కడ కేటాయిస్తారో చెప్పాలని అడ్డుకోవడంతో సర్వే నిలిచిపోయింది. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేను కలవగా సింగరేణి చూపిన స్థలంతో పాటు గ్రామస్తులు చూసుకున్న అనువైన చోట కేటాయిస్తారని రెండు మూడు ప్రదేశాల్లో స్థలం చూపించడం జరిగింది. తిరిగి సర్వేకు రావడంతో స్థల కేటాయింపుపై స్పష్టత వచ్చాకే సర్వేలు చేయాలని అడ్డుకున్నారు. అధికారులు ముందు సర్వే చేసినట్లయితే ఎంత స్థలం అవసరమో తేలుతుందని, అనంతరం ఇష్టం ఉన్నచోట స్థలం కేటాయించనున్నట్లు తెలిపినప్పటికీ గ్రామస్తులు వినకుండా అధికారులను తిప్పి పంపించారు. మందమర్రి డెప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, బెల్లంపల్లి డీటీ షరీఫ్ తదితరులున్నారు. -
సింగరేణిలో ఖాళీలు భర్తీ చేయాలి
► అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలి ► వారసత్వ హక్క పునరుద్ధరించాలి ► ఓపెన్‌కాస్టులతో పర్యావరణానికి విఘాతం ► సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్(బీఎంఎస్) అధ్యక్షుడు చింతల సూర్యనారాయణ. రామగుండం : సింగరేణి సంస్థలో ఉద్యోగ విరమణ చేస్తున్న కార్మికుల స్థానంలో కొత్త వారిని నియమించాలని, వారసత్వ ఉద్యోగావకాశాలు ఇవ్వాలని సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడు చింతల సూర్యనారాయణ అన్నారు. కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామగుండం పట్టణానికి చెందిన కౌశిక హరిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవడంతో ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నా ఉద్యోగులు, కార్మికులు ఉద్యోగ విరమణ పొందుతున్న వారి స్థానంలో ఖాళీల ను మాత్రం భర్తీ చేయడంలేదని పేర్కొన్నారు. దీంతో ఉన్నవారిపై భారం పడుతోందని తెలి పారు. సింగరేణిలో 50-60 మెట్రిక్ టన్నులకు మాత్రం ఉత్పత్తి పెరిగిందని, కార్మికుల సంఖ్య 1.25 లక్షల నుంచి 57 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, అధికారి కార్మిక సంఘం వారసత్వ ఉద్యోగాలను మరిచిందని ఎద్దేవా చేశారు. ఓపెన్‌కాస్టుల ఏర్పాటుకు కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ వ్యతి రేకమని, ఓపెన్‌కాస్టులతో పర్యావరణానికి విఘాతం కలుగుతోందన్నారు. సింగరేణి సం స్థలో ఉన్నత స్థానంలో ఉద్యోగాల కల్పనకు కో ల్ ఇండియా మాదిరిగా నోటిఫికేషన్ జారీ చేయకుండా అత్యధిక విద్యావంతులైన కార్మికులలో నే అర్హులైన వారిని ఎంపిక చేయాలని, వారి స్థానంలో వారసులకు ఉద్యోగావకాశాల ను కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తొమ్మి దో వేజ్‌బోర్డు ఒప్పందంలో కార్మికులకు అన్యా యం జరిగిందని, కార్మిక హక్కుల సాధనతోపాటు జూలై నుంచి అమలుకానున్న పదో వేజ్‌బోర్డులో కార్మికులకు సంపూర్ణ న్యాయం జరి గే విధంగా గోదావరిఖని నుంచి గోలేటి వరకు ఈనెల 3 నుంచి భరోసా యాత్ర చేపడుతున్న ట్లు తెలిపారు. సమావేశంలో కేంద్ర నిర్వాహక కార్యదర్శి టంగుటూరి కొమురయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌశిక హరి, ఉపాధ్యక్షుడు పూల నాగరాజు, రాష్ట్ర కోకన్వీనర్ బూర్ల లక్ష్మీనారాయణ, వడ్డెపల్లి రాంచందర్, పెద్దపల్లి రవీం దర్, సుల్వ లక్ష్మీనర్సయ్య, కోమళ్ల మహేశ్, బాలరాజ్‌కుమార్, గాలిపెల్లి తిరుపతి, బోడకుంట జనార్దన్, శివరాత్రి సారయ్య, నాయని రాజేశం, తీగుట్ల లింగయ్య, కండె మధు పాల్గొన్నారు. -
నేడు ఓపెన్ కాస్ట్ గనుల అధ్యయన యాత్ర
ప్రారంభించనున్న ప్రొ. కోదండరాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల అధ్యయన యాత్రను జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం ఉదయం 5 గంటలకు ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ జేఏసీ దీక్షా శిబిరం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారు. జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు, పలు ప్రజాసంఘాల నాయకులు కాన్వాయ్‌గా ఇక్కడి నుంచి బయల్దేరి ఉదయం 9 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌కు చేరుకుంటారు. వివిధ జిల్లాలకు చెందిన బాధ్యులతో కలసి ఆర్కే-ఓసీపీని సందర్శిస్తారు. అనంతరం మందమర్రి సమీపంలోని ఎర్రగుంటపల్లిలో భూ నిర్వాసితులు, సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల బాధితులు, వారసత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్న వారిని కలసి అభిప్రాయాలు సేకరిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు గోదావరిఖనిలో జరిగే సదస్సులో పాల్గొంటారు. -
పరిహారం ఇవ్వలేదని..
శ్రీరాంపూర్: పరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్నారంటూ భూ నిర్వాసితులు సింగరేణి సంస్థకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ మండలం సింగపూర్ గ్రామంలో చోటు చేసుకుందీ ఘటన. గ్రామానికి చెందిన ఓపెన్ కాస్ట్ భూ నిర్వాసితులకు సింగరేణి సంస్థ పరిహారం చెల్లించలేదు. దీనికి తోడు అధికారులు గ్రామ సమీపంలో రోజుకొక చోట క్యాంపులు పెడుతూ ఓపెన్ కాస్ట్ తవ్వకాల కోసం సర్వేలు చేపడుతున్నారు. ఈ చర్యలతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఈరోజు ఉదయం అక్కడికి వచ్చిన అధికారులకు చెందిన 5 వాహనాలను రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగించారు. గ్రామస్తులతో చర్చలు ప్రారంభించారు. -
మాజీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష భగ్నం
ఖమ్మం జిల్లా మణుగూరులో రెండు రోజులుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆమరణ దీక్షను పోలీసులు బుధవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. మణుగూరు ఓపెన్ కాస్ట్‌కు సంబంధించి భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని కోరుతూ రేగా కాంతారావు సోమవారం నుంచి దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు తెల్లవారుజామున రంగ ప్రవేశం చేసి దీక్షను భగ్నం చేశారు. ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పోలీసుల చర్యకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ బుధవారం పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది. నాయకులు, కార్యకర్తలు విద్యా సంస్థలను, దుకాణాలను బంద్ చేయించారు.