సాక్షి, హైదరాబాద్ : సింగరేణిలో రెండు ఓపెన్ కాస్ట్(ఓసీ) గనులను మూసి వేసేందుకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ సిద్ధమైంది. ప్రత్యామ్నాయంగా మరో 3 కొత్త ఓసీ గనులను ప్రారంభించాలని నిర్ణయించింది. బొగ్గు నిల్వలు తరిగిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డోర్లి, మేడిపల్లి ఓసీ గనులను మూసివేయనుంది. అలాగే కొత్తగా కిష్టా రం, కేటీకే ఓసీ–3, ఇందారం ఓసీ గనులను ప్రారం భించేందుకు సన్నాహాలు చేస్తోంది. పాత గనుల మూత, కొత్త గనుల ప్రారంభంపై సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ గురువారం ఇక్కడి సింగరేణి భవన్‌లో ఆయా ఏరియాల జనరల్ మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. కొత్త గనులను సత్వరమే ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేయా లని ఆదేశించారు. ఈ ఏడాది ప్రారంభించనున్న ఇతర ఓసీ గనులకు సంబంధించిన పర్యావరణ, అటవీ శాఖ అనుమతులను సత్వరం పొందేలాæ చొరవ చూపాలని కోరారు. ఒడిశాలోని నైనీ బ్లాకు పురోగతిని కూడా సమీక్షించారు.
వచ్చే ఏడాది చివరికల్లా ఈ గనిని ప్రారంభించే అవకాశం ఉన్నందు న పలు సమస్యలపై చర్చించేందుకు త్వరలోనే తాను ఒడిశా సీఎంను కలవనున్నట్లు వివరించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా విషయంలో రానున్న 3 నెలల కాలం చాలా క్లిష్టమైందని అన్నారు. వర్షాలు లేని, తెరిపిగా ఉన్న కాలంలోనే బొగ్గు ఉత్పత్తి పెంచి తగినన్ని నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. వినియోగ దారులకు బొగ్గు రవాణా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, గతే డాది ఇదేకాలంలో సాధించిన దానికన్నా కొంత మేర మెరుగు పడినా.. రానున్న 3 నెలల వర్షాకాలంలో ఉత్పత్తి తగ్గకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. వర్షాకాలంలోనూ గనులు పనిచేయడానికి అవసరమైన పంపింగ్ తదితర వ్యవస్థను సంసిద్ధ పరుచుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు శంకర్, చంద్రశేఖర్, బలరాం, ఈడీ కోల్ మూమెంట్ ఆల్విన్, అడ్వయిజర్ మైనింగ్ డీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment