కొత్తగా ఐదు బొగ్గు గనులు | Five new coal mines | Sakshi
Sakshi News home page

కొత్తగా ఐదు బొగ్గు గనులు

Published Thu, Jul 21 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

కొత్తగా ఐదు బొగ్గు గనులు

కొత్తగా ఐదు బొగ్గు గనులు

  • ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం
  • మరో ఆరు గనులకు ప్రతిపాదనలు
  • అదనంగా 11 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి æ
  • నల్లబంగారం ఉత్పత్తిలో సింగరేణి ముందంజ
  • సాక్షి, హన్మకొండ : 
    వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా సింగరేణి సంస్థ అడుగులు వేస్తోంది. భారీ స్థాయిలో గనులను విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది ఐదు కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మరో ఆరు గనులు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దక్షిణ భారతదేశంలోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా పేరుగాంచిన సింగరేణి వరుసగా వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటు పోతోంది. ఈ ఏడాది 63 మిలియన్‌ టన్నుల బొగ్గు వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల పరిధిలో ఐదు నూతన గనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. తొలి ఏడాదిలో ఈ గనుల నుంచి 4 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. రెండో ఏడాది నుంచి ఈ ఐదు గనులు ద్వారా ఏటా 11.50 మిలియన్‌ టన్నులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా రాబోయే గను ల్లో ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రిలో శాంతిఖని(కంటిన్యూస్‌ మైనర్‌), వరంగల్‌ జిల్లా భూపాలపల్లి ఏరియాలోని కాకతీయఖని ఓపెన్‌ కాస్ట్‌–02, ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాలో పీవీకే–5, జేవీఆర్‌ ఓపెన్‌కాస్ట్‌–02 గనులు, మణుగూరులో ఓపెన్‌కాస్ట్‌–2లను ప్రారంభించనున్నారు.
     
    వేగంగా విస్తరణ
    గత దశాబ్దకాలంగా చేపట్టిన సంస్కరణ ఫలితంగా సింగరేణిలో గనులు, కార్మికుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. 2000 ప్రారంభంలో లక్ష మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు సింగరేణి సంస్థలో పనిచేశారు. ప్రస్తుతం ఆ సంఖ్య 59వేల దగ్గర ఉంది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున «థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అందుకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండటంతో సింగరేణి సంస్థ విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ప్రస్తుతం 34 భూగర్భ, 15 ఉపరితల గనులు ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి 60 మిలియన్‌ టన్నులుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు రాబోయే మూడేళ్లలో మరో ఆరు గనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం 70 మిలియన్‌ టన్నులు దాటనుంది. కొత్త గనులు ప్రారంభమైతే తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
     
    అనుమతుల కోసం..
    సింగరేణి సంస్థ రాబోయే రెండు మూడేళ్లలో ఆరు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వరంగల్‌ జిల్లా భూపాలపల్లి ఏరియాలో కేటీకే(కాకతీయఖని) 3 భూగర్భగని, కేటీకే 5లో లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు, ఆదిలాబాద్‌ జిల్లాలో శాంతిఖని, శ్రీరాంపూర్‌ ఓసీపీ–2, ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాలో రాంపూర్‌ భూగర్భగని, జేవీఆర్‌(జలగం వెంగళరావు) ఓసీపీ–2లకు అనుమతులు ఇవ్వాలని సింగరేణి కార్పొరేట్‌ ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్టు విభాగం నిర్ణయించింది. వీటిలో రాంపూర్‌ భూగర్భగని, జేవీఆర్‌ ఓసీపీ–2లకు ఇటీవల టెక్నికల్‌ బోర్డు ఆమోదముద్ర వేసింది. వీటికి సంబంధించి పర్యావరణ అనుమతులు కోసం కేంద్ర పరిశీలనకు పంపనున్నారు. విడతల వారీగా మిగిలిన నాలుగు గనులకు టెక్నికల్‌ బోర్డు అనుమతి ఇవ్వనుంది. రాంపూర్‌ భూగర్భగని నుంచి ప్రతి ఏటా 1.4 మిలియన్‌ టన్నులు, జేవీఆర్‌ ఓసీపీ–2 నుంచి 10 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement