లోక్‌సభలో ఎంపీ కల్వకుంట్ల కవిత
సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు గనుల ప్రైవేటీకరణ వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారనీ, కార్మికుల సంక్షేమం ఎవరూ పట్టించుకోరని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత లోక్‌సభలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కోల్‌మైన్స్(స్పెషల్ ప్రావి జన్స్) బిల్లు -2014పై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో కవిత మాట్లాడుతూ ‘గడిచిన కొన్నేళ్లలో బొగ్గు రంగం పలు వివాదాలతో అనేక ప్రశ్నలను మిగిల్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత బిల్లు ఆహ్వానించదగ్గదే. దేశంలోనే అన్ని స్కాములకు మాతృస్కాము వంటిద న్న అపఖ్యాతి తెచ్చింది ‘కోల్’ స్కాము మనందరికీ తెలుసు. సుప్రీం కోర్టు జోక్యం, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల ఈ చెడ్డపేరును చెరిపేసే అవకాశం వచ్చింది. దేశంలో ఉన్న విద్యుత్తు సంక్షోభానికి ఇది సమాధానం కానుంది. బొగ్గు రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారన్న భయం వెంటాడుతోంది.
సుప్రీం రద్దుచేసిన బ్లాకులను తిరిగి సద్వినియోగంలోకి తేవాలంటే కోల్‌మైన్స్ యాక్ట్‌ను గానీ, మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్‌ను గానీ సవరించకుండానే మనం నేరుగా కేటాయించుకోవచ్చు. కార్మికుల సంక్షేమం గురించి ఈ బిల్లులో లేదు. ఈ మైన్‌లను ప్రైవేటీకరిస్తే.. వారి సంక్షేమం ఎలా? ప్రయివేటు రంగం కార్మికుల సంక్షేమం చూడదు. కనీసం కోల్ ఇండియా వేతన స్కేళ్లను గానీ వేజ్‌బోర్డును గానీ వాళ్లు పట్టించుకునే పరిస్థితి ఉండదు. సంబంధిత మంత్రి దీనికి సమాధానం చెప్పాలి..’ అని కోరారు.