
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో చాలా కాలం తరువాత సమ్మె సైరన్ మోగనుంది. ఈ మేరకు గుర్తింపు సంఘం సమ్మెకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్రం టెండర్ల తేదీలను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సింగరేణిలో గుర్తింపు యూనియన్‌గా ఉన్న టీబీజీకేఏస్ అప్రమత్తమైంది. కేంద్రం ప్రైవేటీకరిస్తున్న బొగ్గుబ్లాకుల్లో నాలుగు సింగరేణి సంస్థ పరిధిలోవే ఉన్నాయి.
బొగ్గు గనుల ప్రయివేటీకరణపై ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాలు ఉద్యమానికి సమాయత్తమవుతుండగా, టీబీజీకేఏస్ మరో అడుగు ముందుకేసి సింగరేణిలో సమ్మె పిలుపు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై గురువారం రామగుండం ఏరియాలో నిర్వహించే సెంట్రల్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్‌పరం అయితే రాబోయే రోజుల్లో కార్మికుల ఉనికికే ప్రమాదంగా మారనుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
వ్యూహాత్మకంగా ముందుకు...
టీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ సింగరేణిలో గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సమ్మె నిర్వహించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ సెంట్రల్ కమిటీ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని భావిస్తోంది. కాగా, టీబీజీకేఏస్ సెంట్రల్ కమిటీ సమావేశం గురు వారం యైటింక్లయిన్‌కాలనీలో నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఏస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్ తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment