
లెవీ చెల్లించి ‘ఈ-ఆక్షన్’కు రావచ్చు
గనులు కోల్పోయిన కంపెనీలపై కోల్ ఆర్డినెన్స్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ:అవకతవకల అభియోగాలతో సుప్రీంకోర్టు కేటాయింపులను రద్దుచేయడంతో బొగ్గు గనులను కోల్పోయిన కంపెనీలు తాజాగా జరగబోయే ఈ-ఆక్షన్‌లో పాల్గొనవచ్చని, అయితే సదరు కంపెనీలు అదనంగా లెవీ ఫీజు చెల్లించి బిడ్లు సమర్పించవచ్చని బొగ్గు గనులపై రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ స్పష్టంచేసింది. కేటాయింపుల్లో అవకతవకలలో ప్రమేయం ఉన్నట్టు నిర్ధారణ జరిగిన సంస్థలు మాత్రం ఈ-ఆక్షన్‌లో పాల్గొనడానికి వీల్లేదని ఆర్డినెన్స్ పేర్కొంది. ఉక్కు, సిమెంట్, విద్యుత్ ఉత్పాదనలోని కంపెనీలకు, బొగ్గు గనులతో అనుసంధానమైన సంస్థలకు ఈ-ఆక్షన్‌లో పాల్గొనేందుకు అర్హత ఉందని ఆర్డినెన్స్ తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బొగ్గు గనుల కేటాయింపు విధివిధానాలపై రాష్ట్రపతి బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఆర్డినెన్స్ సరికాదు: సీపీఎం
ఇదిలా ఉండగా,.. బొగ్గు బ్లాకుల ఈ-ఆక్షన్ ప్రక్రియులో ప్రైవేటు కంపెనీలకు అనుమతిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, 1973వ సంవత్సరపు బొగ్గు గనుల జాతీయాకరణ చట్టాన్ని ఉల్లంఘించేదిగా ఉందని సీపీఎం బుధవారం విమర్శించింది. విలువైన జాతీయు ఆస్తి అయిన బొగ్గుపై పార్లమెంటు ఆమోదం కూడా లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని సీపీఎం పోలిట్ బ్యూరో ఒక ప్రకటనలో అభిప్రాయపడింది.