సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పేరు ఎన్నో అవినీతి కుంభకోణాల్లో వినిపించిందని, స్టేలు తెచ్చుకుని పబ్బం గడుపుతున్నారని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌ను దోచుకుతిన్న తెలుగుదేశం పార్టీ కన్ను ఇప్పుడు దేశాన్ని దోచుకోవడంపై పడిందని ఆరోపించారు. విమానయాన శాఖలో ఈ నాలుగేళ్లలో ఎన్నో రకాలుగా అవినీతి జరిగిందని చెప్పారు. వాటిలో ఎయిర్ ఏషియా కుంభకోణం ఒకటని వెల్లడించారు.
దేశ రక్షణ శాఖలో సైతం ఆయుధాల విడిభాగాల కొనుగోళ్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ ఓఎస్డీతో తెలుగుదేశం పార్టీకి లింకులు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాయితీ పరుడినని చెప్పుకుంటూ అశోక్ గజపతి రాజు ఎయిర్ ఏషియాలో కుంభకోణంలో పాలు పంచుకున్నారని అన్నారు. 2016 మే 20న పర్మిట్లలో మార్పులు చేస్తూ జీవో జారీ అయిందని చెప్పారు. ఈ జీవోలో ఎయిర్‌ఏషియాకు అనుకూలంగా నిబంధనలను సవరించారని ఆరోపించారు.
అంతకుముందే ఎయిర్ ఏషియా గ్రూప్ సీఈవో, ఎయిర్ ఏషియా ఇండియా సీఈవోలు అడ్డదారిలో పర్మిషన్లు సంపాదించే విషయంపై ఫోన్‌లో సంభాషించుకున్నారని, ఆ ఆడియో క్లిప్పే ఇప్పుడు వెలుగులోకి వచ్చిందన్నారు. చంద్రబాబు, అశోక్ గజపతి రాజులకు కుంభకోణంలో కచ్చితంగా వాటా ఉందని ఆరోపించారు. చంద్రబాబు సింగపూర్ టూర్‌లో స్కాంలో ఉన్నవారిని కలిసింది నిజామా? కాదా? అని ప్రశ్నించారు. అశోక్ గజపతి రాజు ఓఎస్డీ అప్పారావు మంత్రా నారా లోకేశ్‌కు సన్నిహితుడని, ఆయనే కొందరితో ఒప్పందం కుదిర్చారని ఆరోపణలు గుప్పించారు.
ఏపీ పరువును అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్నారని, ఎయిర్ ఏషియా కుంభకోణంపై చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇందులో చంద్రబాబుకు ప్రమేయం లేకపోతే సీబీఐ విచారణపై ఉలుకెందుకు అని ప్రశ్నించారు. చంద్రబాబు నిజాయితీపరుడైతే ఆయనే స్వయంగా సీబీఐ దర్యాప్తును కోరాలని అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై కుటుంబరావు మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షనేత గురించి మాట్లాడే ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకోండి అంటూ బొత్స కుటుంబరావుపై ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment