ఇండోనేషియా విమాన శకలాల కోసం జావా సముద్రంలో వెతుకుతున్ననౌకలు
జకార్తా/సింగపూర్: సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానం బ్లాక్ బాక్స్ కోసం మరో వారం రోజులు ఆగవలసిందేనని ఇండోనేషియా అధికారులు చెప్పారు. ఆ బ్లాక్ బాక్స్ లభిస్తే ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం క్యుజడ్ 8501 కూలిపోయిన ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవని అధికారులు తెలిపారు.
విమాన ప్రయాణికుల మృతదేహాల కోసం ఐదో రోజు గురువారం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెస్క్యూ టీమ్స్ సముద్రంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. విమానంలో 162 మంది ఉండగా, ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీశారు.
ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపు సాధ్యం కావడంలేదు. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బలమైన అలల వల్ల విమాన శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి.