గువాహటి : ఎయిర్ ఏషియా విమానంలో కోల్‌కతా నుంచి బగ్‌డోగ్రాకు బయల్దేరిన ప్రయాణీకులకు చేదు అనుభవం ఎదురైంది. విమానాన్ని దాదాపు నాలుగు గంటల పాటు నిలిపివుంచి ఆ తర్వాత దించివేయడంతో ఆగ్రహానికి గురైన ప్రయాణీకులు ఎయిర్‌లైన్ స్టాఫ్‌తో వాగ్వాదానికి దిగారు.
ఇదే విమానంలో ప్రయాణిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(పశ్చిమ బెంగాల్) దీపాంకర్ రే సైతం ఎయిర్ లైన్ స్టాఫ్ ప్రయాణీకులతో మొరటుగా ప్రవర్తించారని చెప్పారు. ఉదయం 9 గంటలకు బయల్దేరాల్సిన విమానం తొలుత 30 నిమిషాల పాటు ఆలస్యమైందని తెలిపారు. అనంతరం 2 గంటలకు పైగా విమానంలోనే ఉంచారని వెల్లడించారు.
వెయిటింగ్ సమయంలో ఎయిర్‌లైన్ స్టాఫ్ ప్రయాణీకులకు కనీసం నీరు కూడా ఇవ్వలేదని వాపోయారు. ఆ తర్వాత విమానం కెప్టెన్ ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రయాణీకులందరినీ దిగిపోమ్మని అన్నారని వివరించారు. బయట విపరీతంగా వర్షం కురుస్తుండటంతో ప్రయాణీకులు ఎవరూ దిగటానికి ఆసక్తి చూపలేదని తెలిపారు. దీంతో కోపగించుకున్న కెప్టెన్ ప్రయాణీకులు దిగిపోవడానికి ఎయిర్ కండిషనర్‌ను విపరీతంగా పెంచేశారని చెప్పారు.
దీంతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారని, కొందరు వాంతులు చేసుకున్నారని, పిల్లలు బిగ్గర ఏడుపు ప్రారంభించారని తెలిపారు. చాలా మంది శ్వాస ఆడక విమానం నుంచి కిందికి దిగిపోయారని దీపాంకర్ వివరించారు. కాగా, విమానం ఆలస్యం కావడంపై ఎయిర్ ఏషియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. నాలుగున్నర గంటల పాటు ఆలస్యం అయినందుకు క్షమాపణలు కోరింది.
Comments
Please login to add a commentAdd a comment