జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం !
రెండు రోజుల క్రితం తప్పిపోయిన ఎయిర్ ఏషియా విమానం శకలాలు జావా సముద్రంలో కనిపించాయి. బోర్నియో ద్వీపం వద్ద విమనం తలుపులు, స్లైడ్, ఇతర పరికరాలు కనిపించినట్లు ఇండోనేసియా ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 162 మందితో వెళ్తూ అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం తలుపు ఒకటి కనిపించినట్లు ఇండోనేషియా టీవీ చానళ్లు తొలుత చెప్పాయి. మెట్రో టీవీ, కొంపాస్ టీవీలు తాము చూసినట్లు చెబుతున్న ఎమర్జెన్సీ స్లైడ్ ఫొటోలను ప్రసారం చేశాయి. ఈ తలుపు, స్లైడ్ సముద్రపు నీటిలో తేలియాడుతున్నాయి. అచ్చం ఎమర్జెన్సీ స్లైడ్, విమానం తలుపులాగే కనపడుతున్న వస్తువులు గాలింపు సందర్భంగా కనిపించినట్లు ఇండోనేషియా వైమానిక దళాధికారి ఆగస్ డ్వి పుట్రాంటో తెలిపారు. తర్వాత ఈ విషయాన్ని ఇండోనేసియా సర్కారు కూడా నిర్ధారించింది.
మొత్తం పది పెద్ద వస్తువులు తమకు కనిపించాయని, వాటితో పాటే చాలా చిన్న వస్తువులు కూడా ఉన్నాయని, కొన్ని తెల్లటి వస్తువులున్నా, వాటిని ఫొటోలు తీయలేకపోయామని పుట్రాంటో అన్నారు. విమానం రాడార్ పరిధి నుంచి తప్పిపోయిన ప్రదేశానికి పది కిలోమీటర్ల దూరంలోనే ఈ వస్తువులు కనిపించడం గమనార్హం.