
విశాఖ నుంచి మలేసియాకు నేరుగా విమానం
కౌలాలంపూర్: చౌక చార్జీల విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా తాజాగా కౌలాలంపూర్-విశాఖపట్నం రూట్లో డెరైక్ట్ ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మే 7 నుంచి వారానికి మూడు విమానాలు నడుపుతామని తెలియజేసింది. ప్రారంభ ఆఫర్ కింద కౌలాలంపూర్-వైజాగ్ ఫ్లయిట్‌లో సుమారు రూ.4000కే టికెట్లు (వన్‌వే చార్జీ) అందిస్తున్నట్లు ఎయిర్ ఏషియా పేర్కొంది. ఈ ఏడాది మే 7 నుంచి 2016 మార్చి 26 దాకా చేసే ప్రయాణాలకు ఈ నెల 22 దాకా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పర్యాటక, వాణిజ్య కేంద్రంగా వైజాగ్ ఎదుగుతున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఈ ఫ్లయిట్ సేవలు ఉపయోగపడగలవని ఎయిర్ ఏషియా హెడ్(కమర్షియల్ విభాగం) స్పెన్సర్ లీ తెలిపారు.
బ్యాంకాక్, కొలంబోలకు కూడా..
ఇక్కడి విమానాశ్రయం నుంచి ఇప్పటికే ఎయిరిండియా దుబాయ్‌కి, సిల్క్ ఎయిర్‌వేస్ సింగపూర్‌కి, మలిందో ఎయిర్‌లైన్స్ కౌలాలంపూర్‌కి విమా న సర్వీసులు కల్పించాయి. విశాఖ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకుంటున్న నేపధ్యంలో బ్యాంకాక్, కొలంబో దేశాలకూ విశాఖ నుంచి విమాన సర్వీసులు రాబోతున్నాయని భారత విమాన ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు డి.వరదారెడ్డి తెలిపారు.