ఆ నిధులు సీఎంల రాయబేరాల కోసమే.. | Deloitte Forensic Audit Report on ATF VAT | Sakshi
Sakshi News home page

ఆ నిధులు సీఎంల రాయబేరాల కోసమే..

Published Wed, Jun 6 2018 3:39 AM | Last Updated on Sat, Jul 28 2018 3:41 PM

Deloitte Forensic Audit Report on ATF VAT - Sakshi

సాక్షి, అమరావతి: ఎయిర్‌ ఏషియా కుంభకోణంలో రాజకీయ నాయకుల పాత్రపై రోజుకో అంశం వెలుగు చూస్తోంది. ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలతో రాయబేరాల కోసం ఎయిర్‌ ఏషియా భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు డెలాయిట్‌ ఇండియా ఫోరెన్సిక్‌ ఆడిట్‌ స్పష్టం చేసింది. టాటా గ్రూపు నుంచి ఎయిర్‌ ఏషియాకు జరిగిన రూ.22 కోట్ల అనుమానపు చెల్లింపులపై అప్పటి గ్రూపు చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించారు. దీనిపై కూలంకషంగా అధ్యయనం చేసిన ఆడిట్‌ సంస్థ.. అప్పటి ఎయిర్‌ ఏషియా ఇండియా సీఈఓ మిట్టు శాండిల్య ఈ మొత్తాన్ని సీఎంలు, రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహించడానికి వినియోగించినట్లు స్పష్టంచేసింది. విమానాలకు వినియోగించే ఇంధనం (ఏటీఎఫ్‌)పై ఉన్న పన్నుల భారాన్ని, ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు దళారి రాజేంద్ర దుబే సహకారంతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శాండిల్య సమావేశాలు నిర్వహించినట్లు కూడా స్పష్టంచేసింది. 2016లో విడుదలైన ఈ నివేదికను అప్పుడు అన్ని జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.  

వెలుగులోకి తెచ్చిన మిస్త్రీ 
మలేసియాకు చెందిన ఎయిర్‌ ఏషియా.. భారత్‌లో టాటా గ్రూప్‌తో కలిసి ఎయిర్‌ ఏషియా ఇండియా పేరుతో విమాన రంగంలోకి అడుగు పెట్టింది. టాటా గ్రూపు నుంచి ఎయిర్‌ ఏషియాకు చేసిన చెల్లింపులపై అనుమానం వ్యక్తంచేసిన అప్పటి టాటా సన్స్‌ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించారు. కానీ, నివేదిక వచ్చిన 15 రోజుల తర్వాత మిస్త్రీని పదవి నుంచి తొలగిస్తూ టాటా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ మరునాడే అంటే 2016 అక్టోబరు 25న టాటా గ్రూపు నుంచి రూ.22 కోట్ల అనుమానపు లావాదేవీలు ఎయిర్‌ ఏషియాకు చెందిన కంపెనీలతో జరిగినట్లు నివేదికలు స్పష్టం చేశాయంటూ టాటా బోర్డుకు మిస్త్రీ ఈ–మెయిల్‌ పంపడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

లైజనింగ్‌ కోసం ఏర్పాటుచేసుకున్న సింగపూర్‌ కంపెనీ హెచ్‌ఎన్‌ఆర్‌ ట్రేడింగ్‌కు, ఈ గ్రూపునకు మధ్య కేవలం ఖాళీ కాగితాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా, వివిధ ఇన్‌వాయిస్‌ ఫార్మాట్‌లో చెల్లింపులు జరిగిన విషయాన్ని డెలాయిట్‌ నివేదిక బహిర్గతం చేసింది. హెచ్‌ఎన్‌ఆర్‌ ట్రేడింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న దుబే రూ.12.28 కోట్లు తీసుకున్నారు కానీ, ఈ మొత్తాన్ని ఏ సేవలకు వినియోగించారన్నది ఎక్కడా సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. అలాగే, మరో డొల్ల కంపెనీ అయిన మీడియా ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌కు, శాండిల్య తండ్రికి మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా ఆ ఫోరెన్సిక్‌ నివేదిక పేర్కొంది.

బాబు రాగానే భారీగా వ్యాట్‌ తగ్గింపు 
2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలల్లోపే ఏటీఎఫ్‌పై వ్యాట్‌ను 16 శాతం నుంచి ఏకంగా ఒక శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం డెలాయిట్‌ నివేదికకు మరింత బలం చేకూరుస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎయిర్‌ ఏషియా ఇండియాలో 49 శాతం వాటా ఉన్న టాటా గ్రూపు.. రాయబేరాల కోసం రూ.22 కోట్లు వ్యయం చేయగా, దాదాపు ఇంతే మొత్తం ఎయిర్‌ ఏషియా గ్రూపు కూడా వ్యయం చేసినట్లు తెలుస్తోంది.

ఎయిర్‌ ఏషియా నేరపూరిత కుట్ర
ఎయిర్‌ ఏషియా వ్యవహారాలతో సంబంధం ఉన్న ట్రావెల్‌ ఫుడ్‌ సర్వీసెస్‌ యజమాని సునీల్‌ కపూర్‌ను సీబీఐ అధికారులు మంగళవారం విచారించారు. క్విడ్‌ ప్రోకో కింద కపూర్‌ను ఎయిర్‌ ఏషియా డెప్యూటీ సీఈఓ బో లింగం.. కపూర్‌ను దళారీగా నియమించుకుని తమ విమానాల్లో కేటరింగ్‌ కాంట్రాక్టును అప్పజెప్పిందన్న అనుమానంతో సీబీఐ ఆయనను విచారణకు పిలిచింది. పౌర విమానాయాన శాఖ అధికారులు, ఎయిర్‌ ఏషియా ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశాలు నిర్వహించడంపై సీబీఐ అధికారులు ఈ సందర్భంగా ఆరా తీశారు.

ఇదిలా ఉంటే.. 5/20 నిబంధనను సడలించేందుకు లేదా తొలగించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖలో ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తు సంస్థ అధికారి ఆర్‌కే గౌర్‌ వెల్లడించారు. అంతేకాక, దళారుల ద్వారా ప్రభుత్వంలోని పలువురు అధికారులతో కలిసి ఎయిర్‌ ఏషియా ప్రమోటర్లు, డైరెక్టర్లు నేరపూరిత కుట్ర పన్నినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, బుధవారం విచారణకు హాజరుకావాలంటూ ఫెర్నాండెజ్‌కు సీబీఐ నోటీసులు జారీచేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement