సాక్షి, అమరావతి: ఎయిర్ ఏషియా కుంభకోణానికి సంబంధించి బహిర్గతమైన ఆడియో టేపుల్లో ప్రస్తావనకు వచ్చిన పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు తెలిపారు. ఎయిర్ ఏషియా ఉన్నతాధికారుల సంభాషణ ఆడియో టేపుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుల పేర్లు ప్రస్తావనకు వచ్చిన విషయం తెలిసిందే. జీవీఎల్ బుధవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలసి విలేకరులతో మాట్లాడారు.
తప్పు చేయకుంటే భయమెందుకు?
గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఎయిర్ ఏషియా కుంభకోణంలో కొన్ని ఆడియో టేపులు బయటకు రాగానే టీడీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొదలైన సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని, విచారణలో వెల్లడైన అన్ని అంశాలపై చర్యలు ఉంటాయన్నారు. ఆడియో టేపుల్లో తమ పేర్లు ప్రస్తావనకు రావటంపై ఆ నాయకులు స్పందించాన్నారు.
ముహూర్తాలు ఎందుకు?
ఎయిర్ ఏషియాకు సంబంధించి టీడీపీ పెద్దల పేర్లు బయటకు రాగానే రెండు నెలల్లో రెండు భారీ కుంభకోణాలు బయట పెడతామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పేర్కొనటంపై జీవీఎల్ స్పందించారు. కుంభకోణాలు బయట పెట్టడానికి ముహూర్తాలు ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా షేర్ మార్కెట్ వ్యాపారం చేసుకునే కుటుంబరావు లాంటి వ్యక్తులను ఆ పదవిలో నియమించడం ఏపీలోనే జరిగిందన్నారు.
ఆ నిధులు ఏమయ్యాయి?
రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తే కేంద్ర నిధులు వస్తాయి కానీ అబద్ధాలు ప్రచారం చేస్తేనో, రాజకీయాలు చేస్తోనో నిధులు రావని జీవీఎల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన యూసీల్లో పేర్కొన్న వివరాలకు అనుగుణంగా రాజధాని పనులు జరగలేదని కేంద్ర అధికారుల పరిశీలనలో తేలిందని చెప్పారు. వెనుకబడిన జిల్లాల కోసం కేంద్రం ఇచ్చిన రూ.1,050 కోట్లతో ఎక్కడ అభివృద్ధి పనులు చేపట్టారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో పలువురి ఫోన్ల ట్యాపింగ్...
రాష్ట్రంలో పలువురు రాజకీయ నేతల టెలిఫోన్లను చంద్రబాబు ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని జీవీఎల్ సంచలన ఆరోపణ చేశారు. పూర్తి అభద్రతా భావంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వందలాది ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా తన ఫోనును ట్యాప్ చేస్తున్నారని చెప్పారని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు.
ఆడియో టేపుల్లో పేర్లు ఎఫ్‌ఐఆర్‌లోకి!
Published Thu, Jun 7 2018 3:15 AM | Last Updated on Mon, Aug 20 2018 5:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment