మృత్యు సముద్రం...
- తేలుతున్న విమాన ప్రయాణికుల మృతదేహాలు
- ప్రతికూల వాతావరణంతో స్వాధీనానికి ఆటంకం
జకార్తా: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఆసియా విమాన ప్రయాణికుల మృతదేహాలు, విమాన శకలాల స్వాధీనానికి ప్రతికూల వాతావరణం వల్ల బుధవారం తీవ్ర ఆటంకం కలిగింది. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల కారణంగా గాలింపు పరిమితంగా కొనసాగింది. బలమైన అలల వల్ల శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి.
ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇండోనేసియా గాలింపు, సహాయకచర్యల సంస్థ అధిపతి సోలిస్తియో చెప్పారు. వీటిలో ఎయిర్ ఆసియా యూనిఫామ్ ధరించిన ఎయిర్‌హోస్టెస్ మృతదేహం ఉందన్నారు. చాలా మృతదేహాలు సముద్రంలో తేలాడుతున్నాయన్నారు.
మృతదేహాలు, బ్లాక్‌బాక్స్ ఫ్లైట్ రికార్డర్ల కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపామని, అయితే భారీ వర్షం, మూడు మీటర్ల ఎత్తున లేస్తున్న అలల వల్ల గాలింపును నిలిపేశామని తెలిపారు. ధ్వనితరంగాలతో వస్తువులు గుర్తించే సోనార్ చిత్రాల్లో కూలిన విమానానివిగా భావిస్తున్న పెద్ద శకలాలు గుర్తించామని, అవి అలల తాకిడికి కొట్టుకుపోతున్నాయన్నారు. శకలాలు మంగళవారం కనిపించిన చోటికి 50 కి.మీ దూరానికిపైగా వెళ్లాయని ఇండోనేసియా మరో అధికారి తెలిపారు.
మృతదేహాలు తీరానికి వస్తాయని భావిస్తున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాల్లో రెండింటిని సురబయకు తీసుకొచ్చారు. ఎయిర్ ఆసియాకు చెందిన క్యూజెడ్8501 విమానం ఆదివారం 162 మందితో ఇండోనేసియాలోని సురబయ నుంచి సింగపూర్ వెళ్తూ కూలిపోవడం తెలిసిందే .
కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న ఓ ప్రయాణికుడి మృతదేహంపై లైఫ్ జాకెట్ కనిపించింది. దీంతో ప్రమాదం ఎలా జరిగి ఉంటుందన్నదానిపై ఊహాగానాలు పెరిగాయి. విమానం నీటిని తాకడానికి ముందే లైఫ్ జాకెట్‌ను తొడుక్కుని ఉండొచ్చని, అదే నిజమైతే విమానం కూలడానికి ముందు ఆపదలో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.