objects
-
ఢిల్లీ చట్టంపై మళ్లీ రగడ
ఢిల్లీ: ఢిల్లీ ఆర్డినెన్స్ చట్టం మరోసారి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య మళ్లీ గ్యాప్‌ను పెంచుతోంది. దేశ రాజధానిలో పోస్టింగ్‌లు, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పక్కకు పెడుతూ కేంద్రం కొత్త చట్టాన్ని తెచచింది. దీనిపై చర్చించడానికి సీఎం కేజ్రీవాల్ అసెంబ్లీ సెషన్‌ను ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశాలపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలపై కేంద్రం కొత్త చట్టాలను తీసుకురావడంపై ఆప్‌తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్ర విమర్శలు చేశాయి. ఈ బిల్లును సుప్రీంకోర్టులోనూ సవాలు చేసింది ఆప్. అయితే.. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ సెషన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎల్జీ సక్సేనా ఆగష్టు 11నే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖను పంపించారు. ఈ లేఖకు సంబంధించిన ఓ కాపీని ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా అసెంబ్లీకి సమర్పించారు. అసెంబ్లీ సమావేశాలు నియమాలకు అనుగణంగానే జరుగుతన్నాయని రాఖీ బిర్లా తెలిపారు. ఎప్పుడు సమావేశం కావాలనేది పూర్తిగా విధాన సభ విశేషాధికారమని పేర్కొన్నారు. క్యాబినెట్ పిలుపు మేరకే చర్చను ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. ఎల్జీ సక్సేనా ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం పాలసీపై కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేసిన సందర్భంలోనూ గత ఏప్రిల్‌లో అసెంబ్లీ సమావేశం అయింది. అప్పుడు కూడా ఎల్జీ సక్సేనా అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టు అయ్యారు. ఇదీ చదవండి: కృష్ణజన్మభూమి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. -
సరదా అనుకున్నాం కానీ, అదొక వ్యాధి అనుకోలేదు.. అసలు ఏంటిది?
గత కొన్ని రోజులుగా శ్రీనగర్ కాలనీ నివాసి లలిత (35) ఏదో ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఇంట్లో ఏవో కొన్ని వస్తువులు రహస్యంగా దాస్తోంది. డబ్బులు ధారాళంగా ఖర్చు చేస్తోంది. ఈ విషయాలన్నీ గమనించిన కుటుంబసభ్యులు ఎందుకయినా మంచిదని ఒకరోజున సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. కొన్ని గంటల పాటు పరిశీలించిన వైద్యుడు ఆమె సీబీఎస్డీ అనే వ్యాధికి గురైందని నిర్ధారించారు. అదేమిటీ..తరచూ షాపింగ్ చేస్తుంటే సరదా అనుకున్నాం కానీ అదొక వ్యాధి అనుకోలేదే అని ఆశ్చర్యపోయారు కుటుంబ సభ్యులు. నగరంలో విజృంభిస్తున్న సరికొత్త మానసిక వ్యాధికి లలిత ఓ ఉదాహరణ. సాక్షి, హైదరాబాద్: కంపల్సివ్ బయింగ్ బిహేవియర్ లేదా కంపల్సివ్ బైయింగ్, షాపింగ్ డిజార్డర్ (సీబీఎస్డీ/సీబీడీ)తో బాధపడు తున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఒకప్పుడు మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు అందరినీ వేధిస్తోందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. సీబీఎస్డీ తీవ్రమైన ఒత్తిడితో ముడిపడిన మానసిక ఆరోగ్య పరిస్థితి అని, అనవసరమైన వాటిని కూడా కొనడాన్ని నియంత్రించుకోలేని సమస్య గా మనస్తత్వవేత్తలు పేర్కొంటున్నారు. ఇటీవలే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ (కొన్నిప్రత్యేక అలవాట్ల నియంత్రణ లోపాలు)లో ఒకటిగా దీనిని చేర్చింది. ఈ సమస్య ఉన్నవారికి తరచుగా షాపింగ్ చేయాలనే కోరిక కలుగుతుంటుంది. అధిక వ్యయం వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థికసమస్యలు, అను బంధాల విచ్ఛిన్నం వంటి ప్రతికూల ఫలితాలున్నప్పటికీ పట్టించుకోకుండా అదేపనిలో నిమగ్నమైపోతారు. ఈ రుగ్మత ఉన్నవారు తమ బడ్జెట్‌పై స్పష్టమైన వైఖరి లేకుండా వారి సాధారణ కార్యకలాపాలను సైతం నిర్లక్ష్యం చేస్తూ కొనడంలోనే నిమగ్నమవుతుంటారు. కరోనా సహా...కారణాలనేకం.. మానసిక, పర్యావరణ, జీవ సంబంధమైన కార ణాలుసహా అనేక అంశాలు కంపల్సివ్ షాపింగ్ ను ప్రేరేపిస్తున్నాయి. పెరిగిన ఇంటర్నెట్, సోషల్ మీడియా, క్రెడిట్ కార్డ్‌లు, ఆన్లైన్ షాపింగ్, ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలు కూడా సీబీఎస్డీకి దోహదపడుతున్నట్లు మనస్తత్వవేత్తలు పేర్కొంటున్నారు. మరోవైపు ఆర్థిక అవగాహన లోపించడం, రుణాలు సులభంగా అందుబాటులోకి రావడం కూడా కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ప్రతి చిన్న వస్తువును ఆన్లైన్ ద్వారా కొనడం అత్యధికశాతం మందిని ఈ వ్యాధికి చేరువ చేసిందంటున్నారు. కంపల్సివ్ షాపింగ్ కోసం చికిత్స కోరిన వ్యక్తుల్లో దాదాపు 34% మంది ఆన్లైన్ షాపింగ్‌కు అలవాటు పడినవారని జర్మనీలోని హన్నోవర్ మెడి కల్ స్కూల్ పరిశోధకులు తేల్చడం గమనార్హం. భావోద్వేగ పరిస్థితులతో వ్యాధి తీవ్రం.. కంపల్సివ్ షాపింగ్ లింగ భేదాలకు అతీతంగా ఉందని నిపుణులు అంటున్నారు. అయితే సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలకు కాస్త షాపింగ్ ప్రియత్వం ఎక్కువ. అందువల్ల మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, ఆత్మవిశ్వాస లోపం వంటి ప్రతికూల భావోద్వేగ పరిస్థితులతో వ్యాధి తీవ్రతరం కావొచ్చు. బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ (కొన్ని సమయాల్లో కుంగుబాటు, కొన్ని సమయాల్లో విపరీత ప్రవర్తన), అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (అతిగా ప్రవర్తించడం) (ఓసీడీ) తదితర ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న వ్యక్తులలో కంపల్సివ్ షాపింగ్‌ను వైద్యులు గుర్తిస్తున్నారు. దీనికి మందులు, జీవనశైలి మార్పుల కలయికతో కూడిన సమగ్ర చికిత్స విధానం అవసరమని వైద్యులు అంటున్నారు. వ్యక్తులు ఖర్చు చేసే అలవాటుపై తిరిగి నియంత్రణ సాధించేందుకు ఈ చికిత్స సహాయపడుతుందని చెబుతున్నారు. కంపల్సివ్ షాపింగ్‌తో పోరాడుతున్న వ్యక్తులు శిక్షణ పొందిన మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి సహాయం పొందాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ.. సమగ్ర మనోరోగ చికిత్స జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాలలో 5% మంది పెద్దలను కూడా సీబీఎస్డీ ప్రభావితం చేస్తోంది. ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదించింది. వీరిలో ప్రతిముగ్గురి లో ఒకరు ఆన్లైన్ కొనుగోలు వ్యసనంతో బాధ పడుతున్నారు. ‘షాపింగ్‌పై కోరికతో వారు కొనుగోలు చేయగలిగిన దానికంటే ఎక్కువ కొనుగోలు చేస్తారు. మహిళలే కాదు..అందరిలోనూ కని్పస్తోంది గతంలో పార్కిన్సన్స్ లాంటి మెదడు మీద ప్రభావం చూపే వ్యాధుల్లో ఒక లక్షణంగా ఈ సీబీడీని గుర్తించేవాళ్లం. దీన్ని బైపోలార్ డిజార్డర్ అనేవాళ్లం. అయితే ఇటీవలి కాలంలో ఇతరత్రా వ్యాధులు లేకుండానే..సీబీడీకి గురవుతున్నారు. విచిత్రమేమిటంటే అవసరానికో, ఆర్థికంగా బాగుండో కొనేవారిలా కాకుండా ఈ వ్యాధికి గురైన వారు కొన్నవాటితో సంతోషం కూడా పొందరు. కొన్నప్పటికీ అసంతృప్తితో ఉంటారు. అవమానంగా ఫీలవుతారు. దాంతో మళ్లీ కొంటారు. అలా అలా.. మత్తు పదార్థాలకు అలవాటైన వారిలా.. కొంటున్న విషయాన్ని, కొన్న వస్తువుల్ని రహస్యంగా ఉంచుతారు. వీరికి చికిత్సలో భాగంగా కౌన్సెలింగ్ తో పాటు మందులను కూడా వాడాల్సి ఉంటుంది. గతంలో మహిళల్లో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. –డాక్టర్ చరణ్ తేజ, న్యూరో సైకియాట్రిస్ట్, కిమ్స్ ఆసుపత్రి -
NASA: మళ్లీ తెరపైకి ఏలియన్ల ఊసు!
గ్రహాంతరవాసుల ఉనికిపై మరోసారి అమెరికా వరుస ప్రకటనలకు దిగుతోంది. అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(National Aeronautics and Space Administration).. గ్రహాంతరవాసుల జాడకు సంబంధించిందిగా చెప్తూ ఓ ఫొటోను రిలీజ్ చేసింది. తాజాగా యూఎస్ స్పేస్ కమాండ్.. 2014లో భూమిని ఢీ కొట్టిన ఓ ఉల్కను.. ఇంటర్ స్టెల్లర్‌గా ధృవీకరించింది. ఈ మేరకు పెంటగాన్ సైతం ప్రకటన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాసా సైతం ఓ మిస్టరీ ఫొటోను విడుదల చేసి.. ఏలియన్ల ఉనికిపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంగారక గ్రహాంపై గుర్తు తెలియని ముద్రలకు సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ రిలీజ్ చేయగా.. అది ముమ్మాటికీ ఏలియన్లకు సంబంధించిందేనన్న చర్చ ఊపందుకుంది. మార్టిన్ క్రేటర్‌లోని ఆ గుర్తుల్ని హైరెజల్యూషన్ ఇమేజింగ్ ద్వారా క్యాప్చర్ చేసింది నాసా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేయగా.. ఫాలోవర్ల మధ్య జోరుగా చర్చ నడుస్తోంది. View this post on Instagram A post shared by NASA (@nasa) ఏలియన్ల ఉనికి తెలుస్తుందా? 2017లో భూమిని తాకిన ఓ శకలాన్ని.. ‘ఒయూమువామువా’గా నామకరణం చేశారు. సాంకేతిక పరిశోధనలతో.. అది ఇంటర్ స్టెల్లర్(నక్షత్రాల మధ్య) ఆబ్జెక్ట్‌గా తేలింది. అయితే.. అంతకంటే ముందే 2014 జనవరిలో ఓ ఉల్క భూమిని తాకింది. తాజాగా దీనిని కూడా ఇంటర్ స్టెల్లర్ ప్రాజెక్టుగానే ధృవీకరించింది అమెరికా స్పేస్ కమాండ్. మరో సౌర వ్యవస్థ నుంచి దూసుకొచ్చిన ఈ స్పేస్ రాక్‌ను హార్వార్డ్ ఖగోళ పరిశోధకులు అమీర్ సిరాజ్, అబ్రహం లియోబ్‌లు పరిశోధనలు జరిపి.. ఇంటర్ స్టెల్లర్ ఆబ్జెక్ట్‌గా నిర్ధారించారు. దీంతో 2017లో భూమిని తాకిన ‘ఒయూమువామువా’ను రెండో ఇంటర్ స్టెల్లర్ ఆబ్జెక్ట్‌గా తేల్చినట్లు అయ్యింది. 6/ “I had the pleasure of signing a memo with @ussfspoc’s Chief Scientist, Dr. Mozer, to confirm that a previously-detected interstellar object was indeed an interstellar object, a confirmation that assisted the broader astronomical community.” pic.twitter.com/PGlIOnCSrW — U.S. Space Command (@US_SpaceCom) April 7, 2022 అటువంటి ఇంటర్ స్టెల్లర్(నక్షత్రాల మధ్య) శకలాలు.. గ్రహాంతర జీవుల ఉనికిని ఇతర ప్రాంతాలకు మోసుకెళ్తాయని పరిశోధకులు నమ్ముతారు. ఇంటర్ స్టెల్లర్ మెటోర్స్ అనేవి ఇతర గ్రహాల వ్యవస్థ, అక్కడి ప్రాణుల ఉనికిని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాదు విశ్వంలో జీవరాశి(పాన్స్పెర్మియా) గురించి తెలియజేసేందుకు మధ్యవర్తిత్వం లాగా అవి పని చేస్తాయని అబ్రహం లోయిబ్ అంటున్నారు. అయితే.. 2014 ఉల్క సంగతి ఏమోగానీ.. ఒయూమువామువా మాత్రం ఆస్టరాయిడ్ అనడం కంటే.. ఏలియన్ టెక్నాలజీకి సంబంధించిన వస్తువుగా దాదాపు నిర్ధారణ అయినట్లు చెప్తున్నారు. హాలీవుడ్లో ఇంటర్ స్టెల్లర్ మూవీ.. అదే ఏడాది నవంబర్‌లో రిలీజ్ కావడం కొసమెరుపు. -
మీరు గానీ.. ఒక్కసారి గానీ.. ఈ షీల్డ్ వెనక్కి వెళ్లారంటే!
హ్యారీ పాటర్ సినిమాలో చూసే ఉంటారు. ఒక వింత వస్త్రాన్ని చుట్టేసుకొని హ్యారీ టక్కున మాయమైపోతుంటాడు. అతను అక్కడే ఉన్నా చూసే వాళ్లకు మాత్రం లేడనిపించేలా ఆ వస్త్రం కనికట్టు చేస్తుంది. వెనకున్న వస్తువులు కనిపిస్తాయి కాని అతను మాత్రం కనిపించడు. మళ్లీ దాన్ని తీసేయగానే హ్యారీ బయటకు కనిపిస్తుంటాడు. ఇలా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ఈ వెరైటీ వస్త్రాన్ని ఇప్పుడు నిజంగానే షీట్ రూపంలో తయారు చేశారు. లండన్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ఇన్విజిబిలిటీ షీల్డ్ కో’.. ఈ మ్యాజిక్ షీట్‌ను తాజాగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఎంతలా కష్టపడ్డారో! ఇన్విజిబిలిటీ షీల్డ్‌ను అనుకున్నట్టు తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డామని తయారీ బృందం చెప్పింది. ఎన్నో వస్తువులు, పదార్థాలను పరీక్షించామని, ఎన్నో వైఫల్యాలు ఎదురయ్యాయని తెలిపింది. విభిన్న కోణాలు, ఆకృతులు, దూరాల్లో లెన్స్‌లను పరీక్షించామని.. చివరగా కుంభాకార కటకాలను పాలిమర్ షీట్లో ఓ శ్రేణిలో అమర్చి అనుకున్న ఫలితాన్ని రాబట్టామని వివరించింది. గడ్డి ప్రాంతాలు, తీర ప్రాంతాలు లాంటి బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉన్న ప్రదేశాల్లో ఈ షీల్డ్‌లు అద్భుతంగా పని చేస్తాయంది. ఎక్కువ ఉష్ణోగ్రతను, అల్ట్రావయోలెట్ కాంతిని తట్టుకోగలవని తెలిపింది. ఇంతకీ ఈ షీల్డ్‌ల ధరెంతో తెలుసా? 37్ఠ25 ఇంచుల షీల్డ్‌కు కేవలం రూ.30 వేలు. ఇప్పటికే 25 షీల్డ్‌లను తయారు చేశారు. మరిన్ని తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. షీల్డ్ ఎలా పని చేస్తుందంటే..? ఇన్విజిబిలిటీ షీల్డ్ వెనుక దాక్కునే వ్యక్తులు, వస్తువులు కనిపించకుండా ఉండేందుకు నిలువు పద్ధతిలో ప్రత్యేక లెన్స్ శ్రేణిని (ఒకదాని పక్కన మరొకటి వరుసగా పేర్చడం) వాడారు. షీల్డ్ ముందు నుంచి చూసే వ్యక్తికి షీల్డ్ వెనకున్న వ్యక్తి కనిపించకుండా కాంతిని పరావర్తనం చెందించే సూత్రాన్ని ఉపయోగించారు. అంటే షీల్డ్ వెనకున్న వ్యక్తి నుంచి పరావర్తనం చెందే కాంతి షీల్డ్ ముందున్న వ్యక్తి వరకు చేరకుండా పక్కలకు ప్రసరించేలా లెన్స్‌లను వాడారు. షీల్డ్ వెనకున్న బ్యాక్‌గ్రౌండ్ మాత్రం బాగా కనబడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తంగా షీల్డ్ వెనకున్న వ్యక్తి కనిపించడు కానీ వెనకాల బ్యాక్‌గ్రౌండ్ మాత్రం కనిపిస్తుంది. అంటే షీల్డ్ వెనకున్న వ్యక్తి మాయమైనట్టే! చదవండి: 24 వేల ఏళ్లుగా గడ్డకట్టే మంచులోనే పడిఉంది... కానీ ఆ జీవి బతికే ఉంది! –సాక్షి సెంట్రల్ డెస్క్ -
కళ్లు మోసం చేస్తాయంటే ఇదేనేమో!
కొన్ని వస్తువులు, దృశ్యాలు దృష్టికోణాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపించొచ్చు. ఒకే ఫోటోలో రెండు రకాలైన అర్థం దాగి ఉండొచ్చు. పరేడోలియా అని పిలిచే అద్భుత దృశ్యాన్ని చూస్తే మన కళ్లు కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేస్తున్నాయోమో అనే భావన కలుగుతుంది. వాస్తవానికి మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో అదే విధంగా చూడగలుగుతాం. ఉదాహరణకు బాగా చీకటి పడ్డాకా వీధిలో నడుస్తుంటే ఎక్కడ నుంచి ఓ ముప్పు వస్తుందో అన్న భయం మనకు కలుగుతుంది. ఆ సమయంలో కొంచెం వంగి ఉన్న చెట్టును చూసినా దాని వల్ల మనకేదైనా జరుగుతుందేమో అన్న భయం కలగడం సహజం. అయితే ఎక్కువ ఆందోళన చెందినప్పుడు ప్రతీది పరేడోలియా విజువల్ లానే కనిపిస్తుంది. అంతేకాకుండా దాదాపు 40 శాతం మంది ఈ విజువల్ వండర్‌ను ఆస్వాదించారని ప్రొఫెసర్ లీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే దీన్నో జబ్బులా చూడాల్సిన పనిలేదు. వాస్తవానికి పరేడోలియా ఉన్నవారు మరింత సృజనాత్మకంగా ఆలోచిస్తారు అని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. లైవ్ సైన్స్ ప్రకారం, మతపరమైన లేదా అతీంద్రియ శక్తుల గురించి బలంగా నమ్మేవారు ప్రకృతిని కూడా వాళ్ల వాళ్ల ఆలోచనలతోనే చూస్తారు. అంటే భౌతికంగా దాని రూపం వేరైనా వారి ఆలోచనలకు అనుగుణంగా దాన్ని మార్చుకుంటారన్నామాట. -
పాక్–చైనా బస్సు సర్వీస్.. వయా పీవోకే!
బీజింగ్: ఈ నెల 3వ తేదీ నుంచి చైనా, పాక్‌ల మధ్య బస్సు సర్వీసు ప్రారంభం కానుంది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సు కాస్గర్– పాక్‌లోని పంజాబ్ రాష్ట్రం లాహోర్ మధ్య ఈ బస్సు నడపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) గుండా ఈ బస్సును నడపాలన్న నిర్ణయంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పీవోకే కూడా తమదే అని పేర్కొంటున్న భారత్.. ఆ భూభాగం గుండా బస్సు సర్వీసు నడపడం తమ ప్రాదేశిక సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగకరమని తెలిపింది. సీపెక్ ప్రాజెక్టు చైనా–పాక్ దేశాల ఆర్థిక సహకారానికి సంబంధించింది మాత్రమేననీ, మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రాజెక్టు కాదని చైనా తెలిపింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మొట్టమొదటి చైనా పర్యటన ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా బస్సు సర్వీసు నిర్ణయం వెలువడటం గమనార్హం. -
మోదీ ప్లాన్‌పై నితీశ్ నీళ్లు
పట్నా : ప్రధాని నరేంద్ర మోదీ ఆశలపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నీళ్లు జల్లుతున్నారు. దేశంలో(లోక్‌సభ-రాష్ట్రాలకు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న మోదీ ఆశయం నెరవేరే పని కాదని.. అందుకు తాను కూడా వ్యతిరేకినేనని నితీశ్ సంచలన ప్రకటన చేశారు. పట్నాలో ఆదివారం జేడీయూ అంతర్గత సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘దేశంలోని అన్నిరాష్ట్రాలకు, పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన సరికాదు. అందుకు నేను అంగీకరించబోను. ఇటీవలే గుజరాత్ ఎన్నికలు ముగిశాయి. కర్ణాటకలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాలూ ఏడాదిలోనే మరోసారి ఎన్నికలకు సిద్ధమవుతాయని ఎలా భావిస్తారు? అయినా ఎన్నికలు జరిగిన ఏడాదిన్నరలోపే ఆయా రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించటం ఆచరణ సాధ్యం కానే కాదు’’ అని నితీశ్ అభిప్రాయపడ్డారు. ఇక జమిలీ ఎన్నికల్లో భాగంగా బిహార్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను నితీశ్ ఖండించారు. 2020 అక్టోబర్-నవంబర్ సమయంలోనే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని నితీశ్ తేల్చిచెప్పారు. దీంతో జమిలీ ఎన్నికలపై బీజేపీకి మిత్రపక్షం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని స్పష్టమైంది. కాగా, నితీశ్ వ్యాఖ్యలు మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశమేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నీతి ఆయోగ్ నివేదిక.. అటు కేంద్రంలోనూ (లోక్‌సభ), ఇటు అన్ని రాష్ట్రాల్లోనూ (శాసనసభలు) ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల వృధా ఖర్చు, పరిపాలన స్తంభనను, ఇతరత్రా సమస్యలను అధిగమించవచ్చని నీతి ఆయోగ్ అప్పట్లో కేంద్రానికి నివేదించింది. ఇదే అంశంపై గతంలో పార్లమెంటరీ స్థాయీసంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, ఇతర సంస్థలు, మేధావులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలన్నింటినీ క్రోడీకరించిన నీతి ఆయోగ్.. ఆ నివేదికను కేంద్రానికి సమర్పించిది. -
బోధనోపకరణాలకు అత్యంత ప్రాముఖ్యం ఇవ్వాలి
కంబాలచెరువు : బోధనోపరకణాలకు అత్యంత ప్రాముఖ్యం ఇవ్వాలని సర్వశిక్షాఅభియాన్ జిల్లా అకడమిక్ మానిటరింగ్ అ«ధికారి చామంతి నాగేశ్వరరావు అన్నారు. స్థానిక కోటగుమ్మం వద్ద ఉన్న మండల వనరుల కేంద్రలో డీఐసీ, సీఆర్పీ, విషయ నిపుణులతో సమీక్షా సమావేశం గురువారం జరిగిం ది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ఇప్పుడు అన్ని తరగతుల్లో కృత్యాధార బోధన జరుగుతోందని, ఉపాధ్యాయులు ప్రతీ అంశానికి బోధనోపకరణాన్ని తయారుచేయాలన్నారు. త్వరలో జిల్లాస్థాయిలో ఒక వర్క్‌షాప్ నిర్వహిస్తామని, ప్రాథమిక సబ్జెక్టుల్లో అన్ని అంశాలకు టీఎల్ఎం తయారు చేసేలా విషయ నిపుణులకు శిక్షణ ఇస్తామన్నారు. గణిత విషయనిపుణులు భమిటిపాటి ఫణికుమార్ తయారుచేసిన టీఎల్ఎమ్ సంతృప్తికరంగా ఉందన్నారు. ఫణికుమార్ వాట్సాప్ వేదికగా గురుదేవోభవ, బాలవాణì , నిత్యవిద్యార్థి, గ్రూప్ద్వారా తగు సమాచారాన్ని, విద్యార్థుల కృత్యాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు అందజేయడం అభినందనీయమన్నారు. ఉపా«ధ్యాయులు ఆధునిక పరిజ్ఞానాన్ని తరగతి గదిలో ఉపయోగించడం అవసరమన్నారు. సీఆర్పీలు స్కూలు సందర్శన సమయంలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. విద్యార్థుల ఆధార్ నమోదు త్వరితగతిన చేపట్టాలన్నారు. త్వరలో జరగున్న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు సమర్థంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సహాయ ఏఎంఓ శ్రీనివాసాచార్యులు, అర్బన్ డీఐ అయ్యంకి తులసీదాస్, జయంతి శాస్త్రి, ప్రసాద్, శ్రీనివాసరావు, కుమారి, నీలిమ, ఇందిర, భమిడిపాటి ఫణికుమార్ పాల్గొన్నారు. -
జావా సముద్రంలో కొనసాగుతున్న గాలింపు చర్యలు
ఇండోనేషియా: జావా సముద్రంలో ఎయిర్ ఆసియా విమాన ప్రయాణికుల మృతదేహాల కోసం గురువారం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐదో రోజు రెస్క్యూ టీమ్స్ సముద్రంలో మృతిదేహాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఇప్పటివరకూ ఏడు మృతదేహాలను మాత్రమే వెలికితీసిన సంగతి తెలిసిందే. బుధవారం గాలింపు చర్యలకు ప్రతికూల వాతావరణం వల్ల తీవ్ర ఆటంకం కలిగింది. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల కారణంగా గాలింపు పరిమితంగా కొనసాగింది. బలమైన అలల వల్ల శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి. -
మృత్యు సముద్రం...
తేలుతున్న విమాన ప్రయాణికుల మృతదేహాలు ప్రతికూల వాతావరణంతో స్వాధీనానికి ఆటంకం జకార్తా: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఆసియా విమాన ప్రయాణికుల మృతదేహాలు, విమాన శకలాల స్వాధీనానికి ప్రతికూల వాతావరణం వల్ల బుధవారం తీవ్ర ఆటంకం కలిగింది. భారీ వర్షం, పెనుగాలులు, దట్టమైన మేఘాల కారణంగా గాలింపు పరిమితంగా కొనసాగింది. బలమైన అలల వల్ల శకలాలు ప్రమాద స్థలి నుంచి కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఇండోనేసియా గాలింపు, సహాయకచర్యల సంస్థ అధిపతి సోలిస్తియో చెప్పారు. వీటిలో ఎయిర్ ఆసియా యూనిఫామ్ ధరించిన ఎయిర్‌హోస్టెస్ మృతదేహం ఉందన్నారు. చాలా మృతదేహాలు సముద్రంలో తేలాడుతున్నాయన్నారు. మృతదేహాలు, బ్లాక్‌బాక్స్ ఫ్లైట్ రికార్డర్ల కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపామని, అయితే భారీ వర్షం, మూడు మీటర్ల ఎత్తున లేస్తున్న అలల వల్ల గాలింపును నిలిపేశామని తెలిపారు. ధ్వనితరంగాలతో వస్తువులు గుర్తించే సోనార్ చిత్రాల్లో కూలిన విమానానివిగా భావిస్తున్న పెద్ద శకలాలు గుర్తించామని, అవి అలల తాకిడికి కొట్టుకుపోతున్నాయన్నారు. శకలాలు మంగళవారం కనిపించిన చోటికి 50 కి.మీ దూరానికిపైగా వెళ్లాయని ఇండోనేసియా మరో అధికారి తెలిపారు. మృతదేహాలు తీరానికి వస్తాయని భావిస్తున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న మృతదేహాల్లో రెండింటిని సురబయకు తీసుకొచ్చారు. ఎయిర్ ఆసియాకు చెందిన క్యూజెడ్8501 విమానం ఆదివారం 162 మందితో ఇండోనేసియాలోని సురబయ నుంచి సింగపూర్ వెళ్తూ కూలిపోవడం తెలిసిందే . కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి స్వాధీనం చేసుకున్న ఓ ప్రయాణికుడి మృతదేహంపై లైఫ్ జాకెట్ కనిపించింది. దీంతో ప్రమాదం ఎలా జరిగి ఉంటుందన్నదానిపై ఊహాగానాలు పెరిగాయి. విమానం నీటిని తాకడానికి ముందే లైఫ్ జాకెట్‌ను తొడుక్కుని ఉండొచ్చని, అదే నిజమైతే విమానం కూలడానికి ముందు ఆపదలో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. -
లాకర్ తీసుకుందామా...
రమేష్ చాలా జాగ్రత్తపరుడు. ఆర్థిక విషయాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తాడు. ఇలా ఉండగా.. ఒకసారి దగ్గరి బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో రమేష్ కుటుంబం మొత్తం వెళ్లాల్సి వచ్చింది. ఇంటికీ, బీరువాలకు తాళాలు గట్రా అన్ని పకడ్బందీగానే వేసుకుని వెళ్ళారు. ఫంక్షన్ చూసుకుని ఇంటికి తిరిగొచ్చేసరికి తలుపులు బార్లా తెరిచి ఉండటంతో గాభరాపడుతూ లోపలికెళ్లారంతా. తీరా చూస్తే బీరువాలో దాచుకున్న బంగారు నగలు, కొంత డబ్బు అంతా కూడా దొంగలు దోచుకెళ్లారని అర్థమవడంతో గొల్లుమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. చోరీ అయినవి చేతికి ఎప్పుడొస్తాయో తెలియదు. ఇలాంటి ఉదంతాలు.. నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. ఇలా దోపిడీ దొంగల భయం పెరిగిపోతున్న నేపథ్యంలో కాస్త మెరుగైన భద్రతను అందించే బ్యాంకు లాకర్లకు డిమాండ్ పెరుగుతోంది. కొండొకచో బ్యాంకులకు కూడా దొంగతనాల బెడద ఎదుర్కొంటున్నప్పటికీ.. విలువైన వాటిని భద్రంగా దాచుకునేందుకు ఇంటితో పోలిస్తే బ్యాంకు లాకర్లే కొంత సురక్షితమైనవిగా ఉంటున్నాయి. అందుకే వీటిని ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. వీటి ప్రాధాన్యత గుర్తించే ఆంధ్రా బ్యాంకు లాంటివి ప్రత్యేకంగా లాకర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాయి. బ్యాంకు ఖాతాల్లో డబ్బు దాచుకున్నట్లే.. విలువైన ఆభరణాలు, వస్తువులు, కీలకమైన పత్రాలు మొదలైన వాటిని దాచుకునేందుకు బ్యాంకులు లాకర్లను అద్దెకి ఇస్తుంటాయి. వీటిని వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా లేదా సంస్థల పేరు మీద కూడా తీసుకోవచ్చు. డిమాండ్ గణనీయంగా పెరిగిపోవడంతో ప్రస్తుతం బ్యాంకు లాకర్లు పొందడమన్నది కష్టసాధ్యంగా మారింది. చాలా బ్యాంకుల్లో వెయిటింగ్ లిస్టు ఉంటోంది. ఇందులోనూ మళ్లీ ప్రొఫైల్‌ని బట్టి కీలకమైన ఖాతాదారులకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. లాకరు ఎక్కడ కావాలనుకుంటున్నారో ఆ బ్యాంకు శాఖలో ఖాతా కలిగి ఉండాల్సి వస్తుంది. అలాగే నిర్దిష్ట మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కూడా బ్యాంకులు అడుగుతున్నాయి. లాకరు తీసుకునేటప్పుడు జాయింట్‌గా గానీ లేదా నామినేషన్ పద్ధతిలో గానీ తీసుకోవడం మంచిది. ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగినా.. లాకర్లలో ఉన్నవి వారసులకు చేరడంలో సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. సాధారణంగా ప్రతి లాకరుకు తాళం చెవులు రెండు ఉంటాయి. ఒకటి బ్యాంకు దగ్గర, రెండోది లాకరు అద్దెకు తీసుకున్న వారి దగ్గర ఉంటుంది. ఈ రెండింటినీ ఉపయోగిస్తేనే లాకరు తెరుచుకుంటుంది. తాళం చెవిని పోగొట్టుకున్నారంటే .. మొత్తం తాళాన్నే మార్చాల్సి వస్తుంది. అందుకయ్యే ఖర్చునంతా కూడా భరించాల్సి వస్తుంది. కొన్ని బ్యాంకులు ఏడాదికి 12 సార్ల దాకా లాకరును తెరిచి చూసుకునేందుకు ఉచితంగా అనుమతిస్తున్నాయి. ఎస్బీఐలో అయితే.. 12 సార్లకు మించితే వెళ్లిన ప్రతిసారీ రూ. 51 కట్టాల్సి ఉంటుంది. ఒక్కసారైనా.. లాకర్ తీసుకున్న తర్వాత కనీసం ఏడాదికోసారైనా బ్యాంకుకు వెళ్లి, లాకరును తెరిచి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడాది గడిచినా అలా చేయకపోతే ఆ లాకర్‌ను రద్దు చేసే అధికారం బ్యాంకులకు ఉంది. అయితే, నేరుగా రద్దు చేసే అధికారం లేదు. ముందుగా ఒక సంవత్సరం నుంచి మీ లాకర్లో లావాదేవీలు జరగటం లేదు కాబట్టి రద్దు చేయాలనుకుంటున్నామంటూ ఖాతాదారుకు సమాచారం అందించాలి. ఒకవేళ ఖాతాదారు మరణిస్తే వారసులకు తెలపాలి. వీరెవ్వరూ అందుబాటులో లేకపోతే ఆ అకౌంట్‌ను పరిచయం చేసిన వ్యక్తి ద్వారా సమాచారం అందించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ విఫలమైతే వాడకంలో లేని అకౌంట్‌గా పరిగణించి ప్రత్యేక లెడ్జర్‌ను తయారు చేయడం ద్వారా ఆ లాకర్‌ను రద్దు చేసి వేరే వారికి ఇవ్వొచ్చు. ఇలా చేయకుండా సకాలంలో అద్దె చెల్లించలేదనో, లేక మొక్కుబడిగా సమాచారం అందించో, లాకర్‌ను రద్దు చేసిన అనేక సందర్భాల్లో వినియోగదారుల ఫోరంలో ఖాతాదారులదే పై చేయి అయ్యింది. వివిధ పరిమాణాలు.. చిన్నవి, మధ్యస్థాయి, పెద్దవి, అతి పెద్దవంటూ లాకర్లు రకరకాల పరిమాణాల్లో ఉంటాయి. సాధారణంగా 864 ఘనపు అంగుళాల నుంచి 3,456 ఘనపు అంగుళాల దాకా వివిధ సైజుల్లో ఇవి లభిస్తాయి. లాకర్ల పరిమాణం, బ్యాంకు శాఖలు ఉన్న ప్రాంతాలను బట్టి అద్దెలు మారుతుంటాయి. పెద్ద నగరాల్లో ఎక్కువగాను.. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కిరాయిలు కాస్త తక్కువగాను ఉంటాయి. అద్దెలు..వ్యయాలు.. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) చిన్న సైజు లాకరుకు గ్రామీణ ప్రాంతాల్లో అద్దె ఏడాదికి రూ. 764 కాగా పట్టణ ప్రాంతాల్లో రూ. 1,019గా ఉంది. లాకరు సైజు, ప్రాంతాన్ని బట్టి కిరాయి గరిష్టంగా రూ. 5,093 దాకా ఉంది. అదే ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంకు విషయానికొస్తే.. వార్షికంగా రెంట్ రూ. 1,250 నుంచి రూ. 10,000 దాకా (లాకర్ సైజు, ప్రాంతాన్ని బట్టి) ఉంది. సిటీ బ్యాంకు లాంటి వాటిల్లో గరిష్టంగా రూ. 40,000 దాకా కూడా అద్దె ఉంది. ఇవే కాకుండా.. తాళం చెవి గానీ పోగొట్టుకుంటే .. కొత్త తాళం చెవిని ఇచ్చేందుకు కూడా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తాయి బ్యాంకులు. కొన్నింటిలో ఇది రూ. 500పైచిలుకు ఉంది. ఇక అద్దె గానీ బకాయి పడితే.. వార్షిక కిరాయిలో పది శాతం నుంచి 50 శాతం దాకా చార్జీలు విధిస్తోంది (బకాయి పడిన కాలానికి) ఎస్బీఐ. మరోవైపు, లక్షల రూపాయల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తేనో లేదా బీమా పథకాల్లాంటివి కొంటేనో మాత్రమే లాకర్లు ఇస్తామంటూ షరతులు పెడుతుంటాయి బ్యాంకులు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఖాతాదారు లాకరుని ఉపయోగించకుండా, అద్దె కట్టకుండా వదిలేస్తే.. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి బకాయిలను జమ చేసుకోవడం దీని వెనుక ముఖ్యోద్దేశం. అయితే, లక్షల రూపాయల్లో ఎఫ్డీలో లేదా బీమా పథకాలో తీసుకోవాలన్నది కచ్చితం కాదంటోంది రిజర్వ్ బ్యాంక్. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కొత్తగా లాకర్ తీసుకునేవారి నుంచి మూడేళ్ల అద్దె, బ్రేకింగ్ చార్జీలు మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ కింద ముందస్తుగా తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఏడాదికి రూ. 1,200 అద్దె అనుకుంటే.. బ్రేకింగ్ చార్జీలు రూ. 100 అనుకుంటే.. మూడేళ్లకు సంబంధించి బ్యాంకులు రూ. 3,700 దాకా బ్యాంకులు సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకోవచ్చు. భద్రత .. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు సాధారణంగానే పటిష్టమైన లాకర్లు, అలారం సిస్టమ్, సీసీటీవీలు, గార్డులు వంటి గట్టి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తాయి. అయితే, కొన్ని సార్లు ఇంతటి భద్రత వ్యవస్థ కూడా విఫలమయ్యే అవకాశం ఉంది. భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, దొంగతనాల బారిన కూడా పడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో పరిహారాల్లాంటివి చెల్లించడం తమ బాధ్యత కాదంటున్నాయి బ్యాంకులు. మనం లాకర్లలో ఏం దాచుకున్నదీ, వాటి విలువ ఎంత ఉంటుందనేది కూడా తమకు తెలియదు కాబట్టి వాటిలోవి పోతే అందుకు తమది పూచీ ఉండదన్నది వాటి వాదన. ఇలాంటప్పుడు బ్యాంకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని నిరూపిస్తే తప్ప పరిహారాల కోసం పోరాడటం కుదరదు. అయితే, ఇలాంటి కొన్ని కేసుల్లో ఖాతాదారులు విజయం సాధించిన సందర్భాలు, నష్టపరిహారం దక్కించుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే, ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి కనుక.. ఆ మేరకు లాకర్లను సురక్షితమైనవిగానే పరిగణించవచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లాకరు తీసుకునేటప్పుడు షరతులు, నిబంధనలన్నింటినీ క్షుణ్నంగా తెలుసుకోవాలి. లాకరులో ఏమేమి ఉంచుతున్నారో రాసి పెట్టుకోవాలి. వీలైతే ఫొటో కాపీలు తీసి ఉంచుకుంటే మరీ మంచిది. ఒకవేళ అనూహ్యమైన ఘటన ఏదైనా జరిగినా.. డిమాండ్ చేయాల్సిన పరిహారం గురించి ఒక అవగాహన ఉంటుంది. లాకరు తెరిచి, మూసిన ప్రతిసారి తాళం సరిగ్గా పడిందో లేదో ఒకటికి రెండుసార్లు పరీక్షించుకోవాలి.