గత కొన్ని రోజులుగా శ్రీనగర్ కాలనీ నివాసి లలిత (35) ఏదో ఒత్తిడికి గురవుతున్నట్టు కనిపిస్తోంది. ఇంట్లో ఏవో కొన్ని వస్తువులు రహస్యంగా దాస్తోంది. డబ్బులు ధారాళంగా ఖర్చు చేస్తోంది. ఈ విషయాలన్నీ గమనించిన కుటుంబసభ్యులు ఎందుకయినా మంచిదని ఒకరోజున సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. కొన్ని గంటల పాటు పరిశీలించిన వైద్యుడు ఆమె సీబీఎస్‌డీ అనే వ్యాధికి గురైందని నిర్ధారించారు. అదేమిటీ..తరచూ షాపింగ్ చేస్తుంటే సరదా అనుకున్నాం కానీ అదొక వ్యాధి అనుకోలేదే అని ఆశ్చర్యపోయారు కుటుంబ సభ్యులు. నగరంలో విజృంభిస్తున్న సరికొత్త మానసిక వ్యాధికి లలిత ఓ ఉదాహరణ.
సాక్షి, హైదరాబాద్: కంపల్సివ్ బయింగ్ బిహేవియర్ లేదా కంపల్సివ్ బైయింగ్, షాపింగ్ డిజార్డర్ (సీబీఎస్‌డీ/సీబీడీ)తో బాధపడు తున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఒకప్పుడు మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు అందరినీ వేధిస్తోందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. సీబీఎస్‌డీ తీవ్రమైన ఒత్తిడితో ముడిపడిన మానసిక ఆరోగ్య పరిస్థితి అని, అనవసరమైన వాటిని కూడా కొనడాన్ని నియంత్రించుకోలేని సమస్య గా మనస్తత్వవేత్తలు పేర్కొంటున్నారు.
ఇటీవలే ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ (కొన్నిప్రత్యేక అలవాట్ల నియంత్రణ లోపాలు)లో ఒకటిగా దీనిని చేర్చింది. ఈ సమస్య ఉన్నవారికి తరచుగా షాపింగ్ చేయాలనే కోరిక కలుగుతుంటుంది. అధిక వ్యయం వల్ల ఉత్పన్నమయ్యే ఆర్థికసమస్యలు, అను బంధాల విచ్ఛిన్నం వంటి ప్రతికూల ఫలితాలున్నప్పటికీ పట్టించుకోకుండా అదేపనిలో నిమగ్నమైపోతారు. ఈ రుగ్మత ఉన్నవారు తమ బడ్జెట్‌పై స్పష్టమైన వైఖరి లేకుండా వారి సాధారణ కార్యకలాపాలను సైతం నిర్లక్ష్యం చేస్తూ కొనడంలోనే నిమగ్నమవుతుంటారు.
కరోనా సహా...కారణాలనేకం..
మానసిక, పర్యావరణ, జీవ సంబంధమైన కార ణాలుసహా అనేక అంశాలు కంపల్సివ్ షాపింగ్ ను ప్రేరేపిస్తున్నాయి. పెరిగిన ఇంటర్నెట్, సోషల్ మీడియా, క్రెడిట్ కార్డ్‌లు, ఆన్‌లైన్ షాపింగ్, ప్రకటనలు, ప్రమోషన్ కార్యక్రమాలు కూడా సీబీఎస్‌డీకి దోహదపడుతున్నట్లు మనస్తత్వవేత్తలు పేర్కొంటున్నారు.
మరోవైపు ఆర్థిక అవగాహన లోపించడం, రుణాలు సులభంగా అందుబాటులోకి రావడం కూడా కారణమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ప్రతి చిన్న వస్తువును ఆన్‌లైన్ ద్వారా కొనడం అత్యధికశాతం మందిని ఈ వ్యాధికి చేరువ చేసిందంటున్నారు. కంపల్సివ్ షాపింగ్ కోసం చికిత్స కోరిన వ్యక్తుల్లో దాదాపు 34% మంది ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడినవారని జర్మనీలోని హన్నోవర్ మెడి కల్ స్కూల్ పరిశోధకులు తేల్చడం గమనార్హం.
భావోద్వేగ పరిస్థితులతో వ్యాధి తీవ్రం..
కంపల్సివ్ షాపింగ్ లింగ భేదాలకు అతీతంగా ఉందని నిపుణులు అంటున్నారు. అయితే సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలకు కాస్త షాపింగ్ ప్రియత్వం ఎక్కువ. అందువల్ల మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, ఆత్మవిశ్వాస లోపం వంటి ప్రతికూల భావోద్వేగ పరిస్థితులతో వ్యాధి తీవ్రతరం కావొచ్చు. బైపోలార్ ఎఫెక్టివ్ డిజార్డర్ (కొన్ని సమయాల్లో కుంగుబాటు, కొన్ని సమయాల్లో విపరీత ప్రవర్తన), అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (అతిగా ప్రవర్తించడం) (ఓసీడీ) తదితర ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్‌తో బాధపడుతున్న వ్యక్తులలో కంపల్సివ్ షాపింగ్‌ను వైద్యులు గుర్తిస్తున్నారు.
దీనికి మందులు, జీవనశైలి మార్పుల కలయికతో కూడిన సమగ్ర చికిత్స విధానం అవసరమని వైద్యులు అంటున్నారు. వ్యక్తులు ఖర్చు చేసే అలవాటుపై తిరిగి నియంత్రణ సాధించేందుకు ఈ చికిత్స సహాయపడుతుందని చెబుతున్నారు. కంపల్సివ్ షాపింగ్‌తో పోరాడుతున్న వ్యక్తులు శిక్షణ పొందిన మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి సహాయం పొందాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లోనూ..
సమగ్ర మనోరోగ చికిత్స జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాలలో 5% మంది పెద్దలను కూడా సీబీఎస్‌డీ ప్రభావితం చేస్తోంది. ప్రతి 20 మందిలో ఒకరు దీని బారిన పడుతున్నారని ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ నివేదించింది. వీరిలో ప్రతిముగ్గురి లో ఒకరు ఆన్‌లైన్ కొనుగోలు వ్యసనంతో బాధ పడుతున్నారు. ‘షాపింగ్‌పై కోరికతో వారు కొనుగోలు చేయగలిగిన దానికంటే ఎక్కువ కొనుగోలు చేస్తారు.
మహిళలే కాదు..అందరిలోనూ కని్పస్తోంది
గతంలో పార్కిన్సన్స్ లాంటి మెదడు మీద ప్రభావం చూపే వ్యాధుల్లో ఒక లక్షణంగా ఈ సీబీడీని గుర్తించేవాళ్లం. దీన్ని బైపోలార్ డిజార్డర్ అనేవాళ్లం. అయితే ఇటీవలి కాలంలో ఇతరత్రా వ్యాధులు లేకుండానే..సీబీడీకి గురవుతున్నారు. విచిత్రమేమిటంటే అవసరానికో, ఆర్థికంగా బాగుండో కొనేవారిలా కాకుండా ఈ వ్యాధికి గురైన వారు కొన్నవాటితో సంతోషం కూడా పొందరు. కొన్నప్పటికీ అసంతృప్తితో ఉంటారు. అవమానంగా ఫీలవుతారు. దాంతో మళ్లీ కొంటారు.
అలా అలా.. మత్తు పదార్థాలకు అలవాటైన వారిలా.. కొంటున్న విషయాన్ని, కొన్న వస్తువుల్ని రహస్యంగా ఉంచుతారు. వీరికి చికిత్సలో భాగంగా కౌన్సెలింగ్ తో పాటు మందులను కూడా వాడాల్సి ఉంటుంది. గతంలో మహిళల్లో ఎక్కువగా చూసేవాళ్లం. ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. –డాక్టర్ చరణ్ తేజ, న్యూరో సైకియాట్రిస్ట్, కిమ్స్ ఆసుపత్రి
Comments
Please login to add a commentAdd a comment