పెరుగుతున్న జనాభాతోపాటు అన్ని రకాల జబ్బులు కూడా పెరుగుతున్నాయి. ఏ వ్యాధైనా తొలిదశలో గుర్తించి, సరైన చికిత్స చేయించుకుంటే తగ్గిపోతాయి. మానసిక వ్యాధులు సైతం ఇలాగే తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. కానీ.. మానసిక వ్యాధిగ్రస్తులు అందరిలో ఒకరిలా ఉండలేకపోతున్నారు. ఏ విషయమైనా ప్రతికూలంగా ఆలోచిస్తుంటారు. చిరునవ్వును ఆస్వాదించలేకపోతున్నారు.
మానసిక క్షోభ అనుభవిస్తూ జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ ఒత్తిడికి గురికావడం వల్లే మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని.. దీన్ని అధిగమించడానికి జీవితంలో పాజిటివ్ దృక్పథం పెంచుకుంటూ ఒత్తిడిని జయించాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే ఉత్తమ సమాజం ఏర్పడుతుందని చెబుతున్నారు.
మహానుభావుల జీవితమే స్ఫూర్తి..
స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారు మహాత్మా గాంధీని రైలు నుంచి కిందకు నెట్టేశారు. ఆ స్థానంలో సాధారణ వ్యక్తులుంటే అవమానం తట్టుకోలేకపోయేవారు. కానీ.. గాంధీ వారినే భారతదేశం నుంచి నెట్టేసే వరకు విశ్రమించలేదు. అవమానాన్ని పట్టుదలగా మార్చుకుని దేశానికి స్వాతంత్య్రం తెచ్చే వరకు వెనుకడుగు వేయలేదు. అలాగే.. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు 91 ఏళ్ల జీవితంలో 60 ఏళ్లు సినిమానే జీవితంగా గడిపారు.
సుమారు 40 ఏళ్ల క్రితమే అనారోగ్యానికి గురయ్యారు. తనకు కేన్సర్ ఉందని తెలిసినా.. దానిని జయిస్తానని ధైర్యంగా గడిపారు. నైతిక విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ.. నిత్యం నకడ, మితాహారం, సమయానుకూలంగా నిద్ర, అందరితో స్నేహంగా, సంతోషంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగారు. తాను సంతోషంగా ఉంటూ ఇతరులను ఆనందంగా ఉంచగలిగితే అంతకు మించింది మరేదీ లేదు. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక ఘటన జరుగుతుంది. దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి.
మానసిక వ్యాధులు.. లక్షణాలు
మనిషి శరీరంలో జరిగే రసాయనిక మార్పులు, హార్మోన్లకు సంబంధించిన మార్పుల వల్ల మానసిక వ్యాధులు పుట్టుకొస్తాయి. సెరటోనిన్ అనే రసాయన పదార్థం మెదడులోని నాడీ కణాల్లో తగ్గినప్పుడు డిప్రెషన్ వస్తుంది. ఈ వ్యాధితో బాధ పడేవారు ఎప్పుడూ నిషాతో ఉండటం.. ఆత్మహత్య ఆలోచనలు, నిద్ర రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
డోపమెన్ అనే రసాయన పదార్థం మెదడులోని కొన్ని భాగాల్లో ఎక్కువగా పెరగడంతో స్కిజోఫ్రినియా అనే వ్యాధి వస్తుంది. విచిత్రమైన అనుమానాలు, భయభ్రాంతులు, వారిలో వారే మాట్లాడుకోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మెదడులో సెరటోనిన్, అడ్రనలిన్ అనే రసాయన పదార్థాల హెచ్చుతగ్గులతో ఆనక్సిటీ వ్యాధి వస్తుంది. ఎసిట్రైల్ కోలిన్ అనే రసాయన పదార్థం తగ్గినప్పుడు మతిమరుపు వస్తుంది. బైపోలార్ డిజార్డన్ అనే వ్యాధికూడా రసాయనాల హెచ్చుతగ్గుల వల్ల వస్తుంటుంది.
మంత్రాలు, తాయత్తులతో తగ్గదు
మానసిక వ్యాధి వస్తే మంత్రాలు, తాయత్తులు కట్టించుకుంటుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ విశ్వాసాలు ఎక్కువ. పట్టణాల్లోనూ కొన్నిచోట్ల ఈ సంస్కృతి కనిపిస్తోంది. మానసిక జబ్బులకు శాసీ్త్రయ వైద్యం ఒక్కటే పరిష్కార మార్గం. మందులు వాడినా తగ్గట్లేదు అనే ధోరణి ప్రజల్లో ఉంది. ఒక్కోసారి నెల పట్టొచ్చు. ఆరు నెలలైనా పట్టొచ్చు. కానీ మానసిక ఆరోగ్యానికి ఇదే మంచి మార్గం.
ఒత్తిడిని అధిగమిద్దాం ఇలా..
మనుషులు పలు కారణాలతో అనేక రకాల ఒత్తిడులకు గురవుతుంటారు. అవి శారీరక, మానసిక ఒత్తిడి అని రెండు రకాలుంటాయి. ఆరోగ్యం కాపాడుకుంటే శారీరక ఒత్తిడిని జయించవచ్చు. మిత ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, నిత్యం యోగా చేయడం, వృత్తిపరమైన శిక్షణతో మానసిక ఒత్తిడిని అధిగమించొచ్చు.
వ్యాపారంలో సరైన లాభాలు రాకపోవడం, అధిక పని, పదోన్నతి లేని ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. చేసే పనిని ప్రేమించాలి. వృత్తిపరంగా గెలుపు, ఓటములు ఉంటాయి. ఓటమిని సవాల్‌గా స్వీకరించి విశ్లేశించుకుని ముందుకెళ్లాలి. స్ఫూర్తిదాయక వ్యక్తుల మధ్య గడపడం, మంచి పుస్తకాలు చదవడం, అనవసర ఆలోచనలు, చికాకులను దూరం పెట్టడం ద్వారా సంతోషమైన జీవితాన్ని గడపాలి.
Comments
Please login to add a commentAdd a comment