ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులు పరుగులు మొదలు. చేయాల్సిన పనుల చిట్టా చాంతాడంత. దీంతో హడావుడి, ఆందోళన. ఫలితం ఒత్తిడి. అందుకనే ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. ఆందోళనతో చిత్తవుతున్నారు. వీటి వల్ల వచ్చే శారీరక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
మరి ఈ ఒత్తిడిని తగ్గించుకుంటే చాలా అనారోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకు ఇంట్లో మనంతట మనం పాటించగల చిన్న చిట్కాలను చెబుతున్నారు. అవేంటో చూద్దామా..?
గోరు వెచ్చని లేదా చల్లని నీటితో స్నానం చేయడం చాలా మంచిది. శరీరంలో ఎక్కడైనా నొప్పులుగా అనిపిస్తే చిన్నగా మసాజ్ చేసుకోవడం, కండరాలన్నీ సాగేలా ఒళ్లు విరుచుకోవడం లాంటి పనుల వల్ల ఒత్తిడి తగ్గుతుంది. బాత్ రూమ్‌లో కూనిరాగాలు తీయడం లేదా ఏదైనా లైట్ మ్యూజిక్‌ని పెట్టుకుని, గోరువెచ్చని నీటితో శరీరం, మనస్సు తేలిక పడేంతవరకు టబ్ బాత్ చేయాలి. అందుకు మంచి సువాసన ఉన్నసహజమైన సబ్బును ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.
డ్యాన్స్
నృత్యం చేయడం అనేది ఒత్తిడి నివారిణిలా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మంచి సంగీతాన్ని పెట్టుకుని దానికి తగినట్లుగా డ్యాన్స్ చేయవచ్చు. ఎవరైనా ఉన్నప్పుడు చేయడం మొహమాటం అయితే ఎవరూ లేనప్పుడు ఆ పని చేయండి. దీనివల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఒత్తిడి హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. ఇష్టమైన వారితో ప్రేమగా... ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడుఇష్టమైన వారితో ప్రేమగా...సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. అందువల్ల శరీరంలో డోపమైన్ లాంటి హ్యాపీ హార్మోన్ లు విడుదలవుతాయి. దీంతో మీరు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
బబుల్ ర్యాప్‌లను పగలగొట్టడం...
బబుల్ ర్యాప్ కవర్లను చూడగానే అంతా వాటిని పగలగొట్టాలని ఉవ్విళ్లూరతారు. అందుకు కారణాలు లేక΄ోలేదు. అలా వాటిని పేల్చడం వల్ల మనలో ఓ రకమైన ఆనందం కలుగుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. అందువల్లనే మనం వాటిని పేల్చేందుకు ఇష్టపడుతుంటాం. మంచి పుస్తకాలు చదవడం... మంచి పుస్తకాలు, పేపర్లు చదవడం ద్వారా కూడా ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.
ఒత్తిడిగా అనిపించినప్పుడు మీకు నచ్చిన పుస్తకం తీసి చదవండి. వెంటనే తగ్గుముఖం పడుతుంది ఆ ఒత్తిడి. అలాగే రోజూ దినపత్రికలను చదవడం కూడా ఒత్తిడి నివారణలో ఒక భాగం. దినపత్రికలు చదవడమనగానే నేరవార్తలు, హత్యావార్తలు కాదు. మనసుకు కాస్తంత ఆహ్లాదం కలిగించే వార్తలు చదవడం మేలు.
ఆలయ సందర్శనం...
మీ మతాన్ని అనుసరించి మీరు ప్రార్థనామందిరాలను సందర్శించడం మంచిది. రోజూ కాసేపు పూజామందిరంలో గడపడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాగని దేనినీ అతిగా చేయరాదు. గంటలు గంటలు పూజలు చేస్తూ గడపడం కూడా మంచిది కాదు. క్రమం తప్పకుండా ఆలయానికి లేదా మసీద్‌కు లేదా చర్చికి వెళ్లడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది. మీరు ఒత్తిడిలో ఉన్నారు అనుకున్నప్పుడువీటిలో మీకు వీలైనవాటిని పాటించి చూడండి. అన్నింటికన్నా ముఖ్యం ఒత్తిడి వచ్చాక బాధ పడేకంటే ఒత్తిడికి గురికాకుండా చూసుకోవడం చాలా ఉత్తమం.
అదేవిధంగా ఒత్తిడి ఎందువల్ల వస్తుందో తెలుసుకుంటే నివారించుకోవడం సులభం కాబట్టి. ముందుగా మీ పనులను ప్రశాంతగా పూర్తి చేయడం ఆరంభించండి. ధ్యానం... ఒత్తిడి నుంచి బయట పడటానికి ధ్యానం అద్భుతమైన మార్గం అని చాలా అధ్యయనాల్లో తేలింది. శ్వాస మీద ధ్యాస పెట్టి కేవలం రెండు నిమిషాలు కళ్లు మూసుకున్నా సరే అది మీ శరీరంలో స్ట్రెస్ హార్మోన్ స్థాయుల్ని తగ్గిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment