ఇంటిని చక్కదిద్దుకోవడం మొదలుకొని పిల్లలకు చక్కని భవిష్యత్ నిర్మాణం వరకు ఇంటి ఇల్లాలు పడే తపన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎంతో ఒత్తిడికి గురై, మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారుతుంటారు మహిళలు. ఇల్లాలి బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూనే కొన్ని అలవాట్లను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే శరీరం ఆరోగ్యంగా... మనసుకు ఉల్లాసంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక ఆందోళనలను దూరం చేసి మనసుకు సాంత్వన నిచ్చేది మన అభిరుచులే. రోజులో కొంతసమయాన్ని ఎంతో ఇష్టమైన పనిమీద కేంద్రీకరించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. భావోద్వేగాలు, ఒత్తిళ్లు, నిరాశలు తగ్గుముఖం పడతాయి.
యోగా...
ప్రపంచంలోనే పాపులర్ వ్యాయామం యోగా. మహిళలు అలవర్చుకోవాల్సిన అభిరుచిలో ఇది ప్రధానమైనది. యోగా చేయడం వల్ల ఫిట్‌గా, బలంగా తయారవడంతో పాటు ఒత్తిడి తగ్గి, సంతోషంగా ఉంటారు. శరీరంతో పాటు మానసిక పరిస్థితి మెరుగుపడి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకు అనువుగా మనసు మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
సిరామిక్స్ తయారీ...
ఒత్తిడిని తగ్గించడంలో సిరామిక్స్ తయారీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రకరకాల పాత్రల తయారీ నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. స్వయంగా అందమైన పాత్రలు రూపొందించి బహుమతిగా ఇవ్వడానికి లేదా ఇంట్లో వాడుకోవచ్చు. క్రోకరీ తయారీ సమయంలో దృష్టిమొత్తం పాత్రపై ఉండడం వల్ల మెడిటేషన్ చేసినట్లవుతుంది.
ఫొటోగ్రఫీ...
మంచి అలవాట్లలో ఫొటోగ్రఫీ కూడ ఒకటి. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఫోటోలు తీయవచ్చు. ఇప్పుడు ఖరీదైన కెమేరాలు కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయి. మీ అభిరుచికి తగ్గట్టుగా క్లిక్‌మనిపించాలి. తీసిన ఫోటోలను క్రియేటివ్‌గా తయారు చేసి వివిధ రకాల ప్లాట్‌ఫామ్‌లపై పెట్టుకుంటే ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఈ ఫోటోగ్రఫీ వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ఉత్సాహంతో నిండుతుంది.
స్విమ్మింగ్
ఈత కొట్టడం వల్ల చాలారకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. స్విమ్మింగ్ కోసం బయటకు వెళ్లడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటు కొత్త పరిచయాలతో ఉత్సాహం కలుగుతుంది.
డ్యాన్సింగ్...
నాలుగు స్టెప్పులు వేసారంటే హుషారు దానంతట అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. మ్యూజిక్‌కు తగ్గట్టుగా శరీరాన్ని కదిలిస్తే ఆనందం రెట్టింపు అవుతుంది. డ్యాన్స్‌తో అధిక బరువు తగ్గి, కండరాలు బలంగా మారతాయి. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఆభరణాల తయారీ
జ్యూవెలరీ తయారీ అలవాటు చాలా మంచిది. దృష్టిమొత్తం డిజైన్ మీద ఉంటుంది. మనలోని సృజనాత్మకతను వెలికి తీసి సరికొత్త అభరణాలు తయారు చేసి ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. దీనిలో మంచి నైపుణ్యం సాధిస్తే ఆదాయం కూడా వస్తుంది. ఆన్‌లైన్ లో కూడా నేర్చుకోవచ్చు.
కుట్లు... అల్లికలు
ప్రస్తుత కాలంలో మహిళలు ధరించే డ్రెస్సులు దాదాపు అన్నీ ఎంబ్రాయిడరీతోనే ఉంటున్నాయి. వీటి రేటు కూడా ఎక్కువే. స్వయంగా మీ డ్రెస్ మీద మీరే ఎంబ్రాయిడరీ చేస్తే ఖర్చూ ఉండదు. స్వయంగా డిజైన్ చేశామన్న సంతృప్తి కలుగుతుంది. సులభంగా వేయగలిగే ప్యాట్రన్ లేదా ఫ్లోరల్ డిజైన్‌తో మొదలు పెట్టి మెల్లగా ఎంబ్రాయిడరీలోని మెలకువలు నేర్చుకోవాలి. ఇందుకు ఏకాగ్రతతో΄ాటు ఓపిక కూడా కావాలి. మీరు ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్ లేదా అల్లిన వస్తువు ఇతరులకు నచ్చినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరిగి సంతోషంతో పాటు, ఆదాయమూ వస్తుంది.
కుకింగ్, బేకింగ్... సరికొత్త కలెక్షన్..
దాదాపు మహిళలంతా వంటచేస్తుంటారు. అయితే రోజూ చేసే వంట కాకుండా... కొంచం కొత్తగా చేసి ఇంట్లోవాళ్లకు రుచులను వడ్డించండి. తిన్నవారు ‘ఎంత బావుందో’ అని చెప్పేమాట మీ కడుపుని నింపేస్తుంది. ఇంట్లో చేసినవి ఏవైనా ఆరోగ్యమే! అందుకే రకరకాల వంటకాలను తయారు చేయడానికి ప్రయత్నించాలి.
గార్డెనింగ్... బొకేల తయారీ
గార్డెనింగ్‌ను అలవాటు చేసుకుంటే.. ఒత్తిడి మీ దరిదాపుల్లోకి రాదు. సేంద్రియ కూరగాయలు, పండ్లు పండించడంతో΄ాటు, సువాసనలు వెదజల్లే పూలపరిమళాలు ఇంటి ఆవరణలో మీతో పాటు మీ కుటుంబానికీ ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇక పూలను బొకేలుగా మార్చితే మీ నైపుణ్యాలు మెరుగుపడినట్టే. పూలను ఒకదానికి ఒకటి జత చేసే క్రమంలో మనలోని సృజనాత్మకత వెలికి వస్తుంది. మనసు ఆహ్లాదంగా మారుతుంది.
అందంగా... ఆరోగ్యంగా
ఒత్తిడి వల్ల ముఖసౌందర్యాన్ని గాలికి వదిలేస్తుంటారు. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు మరింత నిస్సత్తువగా అనిపిస్తుంది. అందువల్ల మీ ముఖాన్ని మరింత కాంతిమంతంగా మార్చుకునేందుకు ఇంట్లోనే ఫేషియల్ తయారు చేసుకోవాలి. చర్మ సంరక్షణకు ఎటువంటి క్రీమ్‌లు, ఫేషియల్స్‌లు చేసుకోవాలో నేర్చుకుని చర్మసౌందర్యాన్ని పెంచుకోవాలి. వీటికి ఫేషియల్ యోగాను జతచేస్తే ఆందమూ ఆరోగ్యం మీ సొంతమైనట్టే.
వీటిలో కనీసం కొన్నింటిని అలవరచుకున్నా మీలో పేరుకుపోయిన ఒత్తిడి, నిస్సత్తువలు నియంత్రణలోకి వచ్చి ఆనందంగా జీవించ గలుగుతారు.
Comments
Please login to add a commentAdd a comment