తెలుగు సినిమాల్లో హీరో కొడితే విలన్ గాల్లోకి అంతెత్తున ఎగిరిపడతాడు. వాస్తప ప్రపంచంలో అలాంటివి అసాధ్యం. అయినాసరే కొందరు అభిమానులు ఆ సీన్‌లను కళ్లప్పగించి చూస్తారు. మనిషిని గాల్లోకి ఎగరేసేంత అపార శక్తి మరో మనిషికి లేదుగానీ వస్తువులను గాల్లోనే నిలిపే శక్తి అతిధ్వని తరంగాలకు ఉందని తాజాగా ధ్వనిశాస్త్రవేత్తలు నిరూపించి చూపారు. తొలి దశలో చిన్నపాటి వస్తువులను, నీటి బిందువులను గాల్లో అలాగే ఒక స్థానంలో నిలబెట్టగలమని ప్రయోగపూర్వకంగా ప్రదర్శించి చూపారు. భవిష్యత్తులో ఇంకాస్త బరువైన వస్తువులనూ గాల్లో యథాస్థానంలో ఉంచడమేకాదు కావాల్సిన దిశలో కదిలించగలమని చెబుతున్నారు.
గాల్లో ఎలా సాధ్యం?
శబ్ద పీడనంతో వస్తువులను గాల్లో కదిలించవచ్చని శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారుగానీ ప్రయోగపూర్వకంగా నిరూపించలేకపోయారు. ధ్వని తరంగాలు గాల్లో ప్రయాణించేటప్పుడు గాలి పీడనంలో మార్పులు తీసుకురాగలవు. ఈ కారణంగా ఆ ప్రాంతంలోని వస్తువుల అణువులను దగ్గరకు జరపడం, లేదంటే దూరం దూరంగా విడగొట్టడం సాధ్యం. ఏదైనా వస్తువు మీదుగా అతిధ్వని తరంగాలను ప్రయాణింపజేసినప్పుడు, లేదంటే వస్తువు వైపుగా అతిధ్వని తరంగాలను ప్రయోగించినప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తికి అభిముఖంగా దానిని యథాస్థానంలో అక్కడే గాల్లో నిలపవచ్చని తాజాగా నిరూపితమైంది. ఈ సందర్భంలో ఆ వస్తువు చూడ్డానికి గాల్లో ఈదుతున్నట్లుగా ఉంటుంది.
గాల్లోనే ఉంటే మనకేం ఉపయోగం?
ద్రవాల్లోని కలుషితాలను వేరేచేయాలన్నా, అసలు ఆ ద్రవం కలుషితం అయ్యిందో లేదో తెలియాలన్న పెద్దపెద్ద ల్యాబ్ పరీక్షలు చేయకుండా సులభంగా ఆ ద్రవం ప్రవహించే మార్గంలో అతిధ్వని తరంగాలను ప్రసరింపజేసి కలుషితకారక పదార్థ అణువులను పక్కకు జరిపి పూర్తి ద్రవాన్ని శుద్ధిచేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అతిసూక్షస్థాయి వస్తువుల్లో పాడైన, నకిలీ వస్తువులను వేరు చేసేందుకు అతిధ్వని తరంగాలు ఉపయోగపడతాయని ధ్వని శాస్త్రవేత్తలు చెప్పారు. త్వరలోనే పూర్తిస్తాయి పరీక్షలను పూర్తిచేసుకుని వాణిజ్యపర వినియోగం స్థాయికి తీసుకురావొచ్చని అకౌస్టోఫ్యాబ్ సంస్థ సహవ్యవస్థాపకులు శ్రీరామ్ సుబ్రమణియమ్, శుభీ భన్సాల్ చెప్పారు
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment