‘ఎ మిస్ ప్లేస్‌డ్ బుక్ ఈజ్ ఎ లాస్ట్ బుక్‘ అన్నది ఆంగ్ల నానుడి. అలాగే ‘దయచేసి ఎక్కడ నుంచి తీసిన పుస్తకాలు అక్కడే పెట్టండి’ అన్న మాట కూడా గ్రంథాల యాలలో చూస్తుంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ, పుస్తకం కానీ స్థానభ్రంశం చెందితే దానిని తిరిగి పట్టుకోవడం కష్టం అవుతుంది. పుస్తకాల విషయంలో అది మరీ కష్టం. అందుకే ఎక్కడ తీసిన పుస్తకాన్ని అక్కడ పెట్టడం అవసరమే కాదు, అనివార్యం కూడా.
గ్రంథాలయాల్లో పుస్తకాల్ని ఒక క్రమంలో సర్దుతారు. ఫలానా పుస్తకం కావాలి అంటే ఫలానా అలమరలోని ఫలానా అరలో ఉంది అ నిర్వాహకులు ఉన్న చోటు నుండి కదలకుండా చెప్పగలరు. కానీ, ఆ పుస్తకాన్ని ఉన్న చోటు నుండి తీసి తిరిగి అక్కడ పెట్టక ΄ోతే చెప్పటం సాధ్యం కాదు. బద్ధకించి, మళ్ళీ అక్కడిదాకా వెళ్ళటం ఎందుకు అని తాము ఉన్న చోటనే ఎక్కడి నుండో తెచ్చిన పుస్తకం పెట్టేసేవాళ్ళు ఉన్నారు.
మరి కొంత మంది తాము చదవటం పూర్తి కాలేదు, దానిని దాని స్థానంలో పెడితే ఎవరైనా తీసుకువెడితే వాళ్ళు తిరిగి ఇచ్చేదాకా ఎదురు చూడాలి, కనుక దాని చోటు మారిస్తే తానే తీసుకోవచ్చు అని జాగ్రత్తగా... గుర్తుగా పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చే సమయానికి పెట్టిన చోటు మర్చి΄ోతారు. ఇంకొకరు ఎవరో ఇది ఇక్కడిది కాదు అని తీసి పక్కన పెడతారు. అంతే సంగతులు. మళ్ళీ ఎప్పుడో అన్నీ సద్దుతున్నప్పుడు మాత్రమే బయట పడుతుంది.
ఇది ఒక్క పుస్తకాల విషయానికే కాదు, అన్ని విషయాలకీ వర్తిస్తుంది. ఇంట్లో ఏదైనా వస్తువుని అది ఉండే చోట కాక మరొకచోట పెడితే, ఎదురుగా ఉన్నా త్వరగా కనపడదు. ఇంకేదో వెతుకుతున్నప్పుడు కనపడుతుంది. అప్పుడు అది పనికి రావచ్చు, రాక ΄ోవచ్చు. అందుకే ఎక్కడ నుండి తీసిన వస్తువుని అక్కడ పెడితే వెతుక్కునే పని ఉండదు. కళ్ళు మూసుకుని అయినా దానిని తీయవచ్చు. దీనికి కారణం మనిషి ఒక వస్తువుని పరిసరాలు మొదలైన వాటిని కూడా జత చేసి గుర్తు పెట్టుకునేట్టు చేయటం మనసు లక్షణం. మనుషులనైనా మొదటి సారి ఎక్కడ చూశామో అక్కడ కనపడితే వెంటనే గుర్తిస్తాం. వాతావరణం, పరిసరాలు మారితే గుర్తు పట్టటం కష్టమే. ఇక్కడ ఉంటారు అని అనుకోలేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నాలు దీనికి చిహ్నం.
ఇల్లు అందంగా, వెసులుబాటుగా ఉండటానికి ఒక సూత్రం ΄ాటించాలని ΄ాశ్చాత్యులు గట్టిగానే చె΄్పారు. ‘‘ప్రతి వస్తువు దాని చోట ఉండటం, ప్రతి వస్తువుకి ఒక చోటు ఉండటం.’’ వేలం వెఱి<గా వస్తువులని సేకరించితే ఎక్కడ పెట్టాలో తెలియక చిందరవందరగా పడేస్తూ ఉంటారు. వస్తువుది, ఇంటిది కూడా అందం, విలువ తగ్గి΄ోతాయి. పెట్టటానికి తగిన చోటు లేనప్పుడు తెచ్చి వాటి విలువని తగ్గించ కూడదు.
ఎక్కడి వస్తువులను అక్కడ పెట్టటం గొప్ప సౌలభ్యమే కాదు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ హనుమ. సంజీవని పర్వతాన్ని తెచ్చి, దానితో పని పూర్తి అయిన పిమ్మట ఎక్కడి నుండి తీసుకువచ్చాడో తిరిగి అక్కడ భద్రంగా పెట్టి వచ్చాడు. అందువల్ల రెండవమారు తేవటానికి వెళ్ళినప్పుడు అది ఉండే ప్రదేశం తెలుసు కనుక వెంటనే తేగలిగాడు. మొదటిసారి పని అయింది కదా అని ఎక్కడో అక్కడ పెట్టి ఉంటే వెతకటానికి ఎంతో సమయం వెచ్చించవలసి వచ్చేది. వ్యక్తిత్వ వికాసానికి ఇది కూడా పెం΄÷ందించుకోవాల్సిన ఒక లక్షణం.
వస్తువుల విషయం మాత్రమే కాదు. ప్రేమాభిమానాలు, నమ్మకం, విశ్వసనీయత మొదలైన మనోభావాలని కూడా అస్థాన పతితం చేయకూడదు. కఠిన మైన మనస్సు కలవారి మీద ప్రేమాభిమానాలు పెంచుకుంటే, తరువాతి కాలంలో ఎవరినైనా ప్రేమగా చూడగలగటం కష్టమే. ప్రేమరాహిత్యంలో బతికే వారి విషయంలో ఇటువంటిదే జరిగి ఉండవచ్చు.
– డా. ఎన్. అనంత లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment