Libraries
-
స్థానం మారిన పుస్తకం
‘ఎ మిస్ ప్లేస్డ్ బుక్ ఈజ్ ఎ లాస్ట్ బుక్‘ అన్నది ఆంగ్ల నానుడి. అలాగే ‘దయచేసి ఎక్కడ నుంచి తీసిన పుస్తకాలు అక్కడే పెట్టండి’ అన్న మాట కూడా గ్రంథాల యాలలో చూస్తుంటాం. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ, పుస్తకం కానీ స్థానభ్రంశం చెందితే దానిని తిరిగి పట్టుకోవడం కష్టం అవుతుంది. పుస్తకాల విషయంలో అది మరీ కష్టం. అందుకే ఎక్కడ తీసిన పుస్తకాన్ని అక్కడ పెట్టడం అవసరమే కాదు, అనివార్యం కూడా.గ్రంథాలయాల్లో పుస్తకాల్ని ఒక క్రమంలో సర్దుతారు. ఫలానా పుస్తకం కావాలి అంటే ఫలానా అలమరలోని ఫలానా అరలో ఉంది అ నిర్వాహకులు ఉన్న చోటు నుండి కదలకుండా చెప్పగలరు. కానీ, ఆ పుస్తకాన్ని ఉన్న చోటు నుండి తీసి తిరిగి అక్కడ పెట్టక ΄ోతే చెప్పటం సాధ్యం కాదు. బద్ధకించి, మళ్ళీ అక్కడిదాకా వెళ్ళటం ఎందుకు అని తాము ఉన్న చోటనే ఎక్కడి నుండో తెచ్చిన పుస్తకం పెట్టేసేవాళ్ళు ఉన్నారు. మరి కొంత మంది తాము చదవటం పూర్తి కాలేదు, దానిని దాని స్థానంలో పెడితే ఎవరైనా తీసుకువెడితే వాళ్ళు తిరిగి ఇచ్చేదాకా ఎదురు చూడాలి, కనుక దాని చోటు మారిస్తే తానే తీసుకోవచ్చు అని జాగ్రత్తగా... గుర్తుగా పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చే సమయానికి పెట్టిన చోటు మర్చి΄ోతారు. ఇంకొకరు ఎవరో ఇది ఇక్కడిది కాదు అని తీసి పక్కన పెడతారు. అంతే సంగతులు. మళ్ళీ ఎప్పుడో అన్నీ సద్దుతున్నప్పుడు మాత్రమే బయట పడుతుంది. ఇది ఒక్క పుస్తకాల విషయానికే కాదు, అన్ని విషయాలకీ వర్తిస్తుంది. ఇంట్లో ఏదైనా వస్తువుని అది ఉండే చోట కాక మరొకచోట పెడితే, ఎదురుగా ఉన్నా త్వరగా కనపడదు. ఇంకేదో వెతుకుతున్నప్పుడు కనపడుతుంది. అప్పుడు అది పనికి రావచ్చు, రాక ΄ోవచ్చు. అందుకే ఎక్కడ నుండి తీసిన వస్తువుని అక్కడ పెడితే వెతుక్కునే పని ఉండదు. కళ్ళు మూసుకుని అయినా దానిని తీయవచ్చు. దీనికి కారణం మనిషి ఒక వస్తువుని పరిసరాలు మొదలైన వాటిని కూడా జత చేసి గుర్తు పెట్టుకునేట్టు చేయటం మనసు లక్షణం. మనుషులనైనా మొదటి సారి ఎక్కడ చూశామో అక్కడ కనపడితే వెంటనే గుర్తిస్తాం. వాతావరణం, పరిసరాలు మారితే గుర్తు పట్టటం కష్టమే. ఇక్కడ ఉంటారు అని అనుకోలేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నాలు దీనికి చిహ్నం. ఇల్లు అందంగా, వెసులుబాటుగా ఉండటానికి ఒక సూత్రం ΄ాటించాలని ΄ాశ్చాత్యులు గట్టిగానే చె΄్పారు. ‘‘ప్రతి వస్తువు దాని చోట ఉండటం, ప్రతి వస్తువుకి ఒక చోటు ఉండటం.’’ వేలం వెఱి<గా వస్తువులని సేకరించితే ఎక్కడ పెట్టాలో తెలియక చిందరవందరగా పడేస్తూ ఉంటారు. వస్తువుది, ఇంటిది కూడా అందం, విలువ తగ్గి΄ోతాయి. పెట్టటానికి తగిన చోటు లేనప్పుడు తెచ్చి వాటి విలువని తగ్గించ కూడదు. ఎక్కడి వస్తువులను అక్కడ పెట్టటం గొప్ప సౌలభ్యమే కాదు వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. దీనికి గొప్ప ఉదాహరణ హనుమ. సంజీవని పర్వతాన్ని తెచ్చి, దానితో పని పూర్తి అయిన పిమ్మట ఎక్కడి నుండి తీసుకువచ్చాడో తిరిగి అక్కడ భద్రంగా పెట్టి వచ్చాడు. అందువల్ల రెండవమారు తేవటానికి వెళ్ళినప్పుడు అది ఉండే ప్రదేశం తెలుసు కనుక వెంటనే తేగలిగాడు. మొదటిసారి పని అయింది కదా అని ఎక్కడో అక్కడ పెట్టి ఉంటే వెతకటానికి ఎంతో సమయం వెచ్చించవలసి వచ్చేది. వ్యక్తిత్వ వికాసానికి ఇది కూడా పెం΄÷ందించుకోవాల్సిన ఒక లక్షణం. వస్తువుల విషయం మాత్రమే కాదు. ప్రేమాభిమానాలు, నమ్మకం, విశ్వసనీయత మొదలైన మనోభావాలని కూడా అస్థాన పతితం చేయకూడదు. కఠిన మైన మనస్సు కలవారి మీద ప్రేమాభిమానాలు పెంచుకుంటే, తరువాతి కాలంలో ఎవరినైనా ప్రేమగా చూడగలగటం కష్టమే. ప్రేమరాహిత్యంలో బతికే వారి విషయంలో ఇటువంటిదే జరిగి ఉండవచ్చు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
అరుదైన ఆహ్వానం: 12 ఏళ్లు.. 15 లైబ్రరీలు..
ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానం అందుకున్నఇరవై మందిలో విద్యార్థులు ఆరుగురు. వారిలో అమ్మాయి ఒకే ఒక్కరు. ఆ సరస్వతి పుత్రిక పేరు ఆకర్షణ. లైబ్రరీలు స్థాపిస్తూ సాహిత్యాన్ని సామాన్యులకు దగ్గర చేస్తున్న ఆమె అక్షరసేవకు జాతీయ స్థాయిలో అందిన గుర్తింపు ఇది. ‘‘హైదరాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్‌మాస్టర్ నుంచి 12వ తేదీన నాన్నకు ఫోన్ వచ్చింది. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా 15వ తేదీన ఢిల్లీలో జరిగే వేడుకలకు హాజరుకావలసిందిగా మీ అమ్మాయి ఆకర్షణకు ఆహ్వానం వచ్చిందని చెబుతూ అభినందనలు తెలియచేశారు’’ అంటూ తాను లైబ్రరీ వ్యవస్థాపకురాలిగా మారిన వివరాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు ఆకర్షణ సతీష్.కోవిడ్ వచ్చినప్పుడు..‘‘హైదరాబాద్‌లో స్థిరపడిన తమిళ కుటుంబం మాది. నాన్న సతీశ్ క్యాన్సర్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ ఉద్యోగి. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను. పుస్తక పఠనం నా హాబీ కావడంతో వెయ్యికి పైగా పుస్తకాలతో ఇంట్లోనే నాకు సొంత లైబ్రరీ ఉంది. ఇతరుల కోసం లైబ్రరీ స్థాపించాలనే ఆలోచన కోవిడ్ సమయంలో వచ్చింది.తొలి లైబ్రరీ క్యాన్సర్ హాస్పిటల్లో..నాన్న ఉద్యోగరీత్యా క్యాన్సర్ హాస్పిటళ్లకు టచ్‌లో ఉంటారు. కోవిడ్ సమయంలో ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వాళ్లు ‘కోవిడ్ కారణంగా వంటవాళ్లు డ్యూటీకి రావడం లేదు. పేషెంట్లకు ఆహారం అందించడానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేసి పెట్టవలసింది’గా కోరడంతో నాన్న వాళ్ల కోసం రోజూ భోజనం వండించి తీసుకెళ్లి ఇచ్చేవారు. నాకు స్కూల్ లేకపోవడంతో రోజూ నాన్నతోపాటు హాస్పిటల్‌కి వెళ్లేదాన్ని. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్లలో నా ఏజ్ గ్రూప్ వాళ్లతో స్నేహం ఏర్పడింది. వాళ్లు కొంతమంది చదువుకోవడానికి పుస్తకాలు తెచ్చిపెట్టమని అడిగారు. రోజూ నా పుస్తకాలు కొన్ని తీసుకెళ్లి ఇస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలత గారు... ‘హాస్పిటల్‌కి చికిత్స కోసం ఎప్పుడూ కొత్తవాళ్లు వస్తుంటారు. హాస్పిటల్లోనే లైబ్రరీ ఉంటే బావుంటుంది’ అన్నారు. వారి ఆలోచనే నా లైబ్రరీ ఉద్యమానికి నాంది. నా పుస్తకాలతోపాటు మా స్కూల్, అపార్ట్మెంట్ స్నేహితుల నుంచి సేకరించిన వెయ్యికి పైగా పుస్తకాలతో తొలి లైబ్రరీ అలా మొదలైంది. ఇప్పటికి 9,836 పుస్తకాలతో 15 లైబ్రరీలు ఏర్పాటు చేయగలిగాను.పదకొండు వేల పుస్తకాలు..నాలుగేళ్లలో పదకొండు వేల పుస్తకాలు సేకరించాను. అందులో రెండు వేల పుస్తకాలు ప్రధాని నరేంద్రమోదీగారిచ్చారు. ఈ ఏడాది మార్చి 18న కోయంబత్తూరులో ఆయనను కలిసే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగా ఆయన 25 లైబ్రరీలు స్థాపించమని, 25 లైబ్రరీ స్థాపనకు స్వయంగా హాజరవుతానని చె΄్పారు. భారత రాష్ట్రపతి గత ఏడాది శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కలిశాను.అప్పుడామె ‘ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్ తగ్గుతోంది, పుస్తక పఠనాన్ని ్రపోత్సహించడానికి దోహదం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించ’మని చెప్పి ఆమే స్వయంగా 74 పుస్తకాలిచ్చారు. ఈ ఏడాది ఢిల్లీ, కర్తవ్య పథ్‌లో జరిగిన 75వ రిపబ్లిక్ డే ఉత్సవాలకు ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరయ్యాను. ఇదే ఏడాది స్వాతంత్య్రదినోత్సవం వేడుకలకు కూడా హాజరయ్యే అవకాశం కలగడం సంతోషంగా ఉంది’’ అంటూ 25 లైబ్రరీల లక్ష్యాన్ని పూర్తి చేస్తానని చెప్పింది ఆకర్షణ సతీశ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆ ఫోబియాకు పుస్తకాల శక్తితో చెక్ పెట్టి..స్ఫూర్తిగా నిలిచిన ట్రాన్స్‌విమెన్!
ట్రాన్స్జెండర్లను మన సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లను ఆదరించి, అక్కున చేర్చుకోవడం అటుంచి కనీసం మనిషిగా కూడా చూడరు. శారీరకంగా వచ్చే మార్పులని సైన్స్ చెబుతున్నా..విద్యావంతులు సైతం వాళ్లను సాటి మనుషులుగా గుర్తించరు. ఎన్నో వేధింపులు, అవమానాలు దాటుకుని కొందరూ మాత్రమే పైకొచ్చి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కొద్దిమంది మాత్రమే తమలాంటి వాళ్లు వేధింపులకు గురికాకుండా తలెత్తుకుని బతకాలని పాటుపడుతున్నారు. అలాంటి కోవకు చెందిందే రితుపర్ణ నియోగ్. ఎవరీ నియోగ్? ఏం చేస్తోందంటే..అస్సాంకి చెందిన రితుపర్ణ నియోగ్ చిన్నతనంలో ఎన్నో బెరింపులు, వేధింపులకు గురయ్యింది. తన బాల్యంకి సంబంధించిన పాఠశాల జ్ఞాపకాలన్నీ చేదు అనుభవాలే. కొద్దిలో రితుపర్ణకు ఉన్న అదృష్టం ఏంటంటే..కుటుంబం మద్దతు. తన కుటుంబ సహాయ సహకారాల వల్ల ఇంట్లో ఎలాంటి వేధింపులు లేకపోయినా..బయట మాత్రం తన తోటి స్నేహితుల నుంచే విపరీతమైన వేధింపులు ఎదుర్కొంది రితుపర్ణ. కొన్నాళ్లు ఇంటికే పరిమితమై లింగ గుర్తింపు విషయమై క్వీర్ ఫోబియాను పేర్కొంది. ఇక్కడ క్వీర్ అంటే..క్వీర్ అనేది లైంగిక, లింగ గుర్తింపులను వివరించే పదం. లెస్బియన్, గే, బైసెక్సువల్, లింగమార్పిడి వ్యక్తులు అందరూ క్వీర్ అనే పదంతో గుర్తిస్తారు. వారు ఎదుర్కొనే సమస్యల కారణంగా భయాందోళనకు లోనై బయటకు తిరిగేందుకే జంకితే దాన్ని క్వీర్ ఫోబియా అంటారు. తనలా అలాంటి సమస్యతో మరెవ్వరూ ఇంటికే పరిమితం కాకుండా ఉండలే చేసేందుకు నడుంబిగించింది రితుపర్ణ. దానికి ఒక్కటి మార్గం పుస్తకాలను ప్రగాఢంగా నమ్మింది. వారు బాగా చదువుకుంటే తమ హక్కులు గురించి తెలుసుకోగలుగుతారు, ఇలా భయంతో బిక్కుబిక్కుమని కాలం గడపరనేది రితుపర్ణ నమ్మకం. తాను కూడా ఆ టైంలో ఎదురయ్యే అవమానాలను ఎలాఫేస్ చేయాలనేది తెలియక సతమతమయ్యి ఆ క్రమంలోనే నాలుగు గోడలకు పరిమితమైనట్లు చెప్పుకొచ్చింది రితుపర్ణ. చివరికి ఏదోలా బయటపడి..ఉన్నత చదువులు చదువుకున్నానని చెప్పుకొచ్చింది. 2015లో గౌహతిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో చదవు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చినట్లు తెలిపింది. అప్పుడే తన గ్రామం దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఎంత వెనుకబడి ఉందనేది తెలుసుకుంది. ట్రాన్స్ జెండర్‌గా తాను మాత్రం ఈ గ్రామం నుంచి బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నాని గ్రహించి..తనలాంటి వాళ్ల అభ్యన్నతికి పాటుపడాలని లక్ష్యం ఏర్పరుచుకుంది. ఆ నేఫథ్యంలో 2020లో తనలాంటి పిల్లల కోసం 'కితాపే కథా కోయి' అనే హైబ్రిడ్ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. ఉచిత కమ్యూనిటీ లైబ్రరీలతో గ్రామంలోని పిల్లలు టీ ఎస్టేట్‌లోకి వెళ్లకుండా ఉండేలా చేసింది. వాళ్లు ఆ లైబ్రరీలో హిందీ, అస్సామీ, ఆంగ్లం వంటి పుస్తకాలను చదివేందుకు సహకరిస్తుంది రితుపర్ణ. తన గ్రామంలోని ప్రజలతో తన ఆలోచనను పంచుకోవడమే గాక, ఆచరణలోకి తీసుకొచ్చింది. మొదటగా తన స్వంత పుస్తకాలతో ఉచిత లైబ్రరీ తెరిచింది. అలా వందలాది పుసక్తాలతో కూడిన పెద్ద లైబ్రరీగా రూపాంతరం చెందింది. ఆ లైబ్రరీలో.. లింగం, లైంగికత, మానసిక ఆరోగ్యం, వాతావరణ న్యాయం, సామర్థ్యం, స్త్రీవాదం, మైనారిటీ హక్కులు వంటి వివిధ విషయాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. రీతుపర్ణ ఇటీవల అస్సాం ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం నేషనల్ కౌన్సిల్‌కు సభ్య ప్రతినిధిగా నామినేట్ అయ్యారు. View this post on Instagram A post shared by Rituparna (@the_story_mama) (చదవండి: అత్యంత లగ్జరియస్ వివాహం..ఒక్కో అతిథికి ఏకంగా..!) -
గ్రంథాలయాలకు నూతన శోభ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థకు ప్రభుత్వం సరికొత్త శోభను తీసుకొస్తోంది. అధునాతన సౌకర్యాలతో విజ్ఞాన భాండాగారాలను తీర్చిదిద్దుతోంది. తొలి దశలో ఏడు జిల్లాల్లో శాఖ, జిల్లా గ్రంథాలయాలకు నూతన భవనాలను నిర్మిస్తోంది. మరికొన్ని గ్రంథాలయాల్లో మరమ్మతులు జరుగుతున్నాయి. ఇటీవల పోటీ పరీక్షల్లో కొలువులు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది గ్రంథాలయాల్లో చదివినవారే ఉండటం గమనార్హం. ఈ క్రమంలో గ్రంథాలయాల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది. విద్యార్థులు, అభ్యర్థులకు మేలు చేస్తూ ఇటీవల కొత్త సిలబస్‌కు తగ్గట్టుగా రూ.9.73 కోట్లతో 1.60 కోట్ల కొత్త పుస్తకాలను కొనుగోలు చేసింది. దీంతో పాటు గ్రామాల్లో బీడీసీ(బుక్ డిపాజిట్ సెంటర్) పేరుతో ఉదయం, సాయంత్రం వేళల్లో చదువరుల కోసం ప్రత్యేక సెంటర్లు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ఉమ్మడి విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 14 శాఖా గ్రంథాలయాలకు నూతన భవనాలు, 20 గ్రంథాలయాల్లో మరమ్మతులకు రూ.7.95 కోట్ల అంచనాకు తగ్గట్టుగానే మొత్తం పరిపాలన అనుమతులిచ్చి పనులు ప్రారంభించింది. నెల్లూరులో రూ.3.48 కోట్ల అంచనాతో మూడు జిల్లా గ్రంథాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఇప్పటికే రూ.98.50 లక్షలు మంజూరు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యాన్ని పూర్తి చేసేలా పనులు చేస్తోంది. తొలుత గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేసి ఆ తర్వాత అవసరానికి అనుగుణంగా తొలి అంతస్తును కూడా నిర్మించేలా ప్రణాళికలు రచిస్తోంది. పేద విద్యార్థులు, నిరుద్యోగులకు మేలు చేకూర్చేలా.. అధునాత సాంకేతికత ఎంత అందుబాటులోకి వచ్చినా గ్రంథాలయాలకు ఎక్కడా ఆదరణ తగ్గలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 987 గ్రంథాలయాలుండగా వాటిల్లో 8.56 లక్షల మందికి సభ్యత్వం ఉంది. రోజుకు సగటున 2.01 కోట్ల మంది లైబ్రరీల సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయిలో గ్రంథాలయాలను అందుబాటులోకి తేవడం వల్ల పేద, బడుగు వర్గాల విద్యార్థులకు, స్కాలర్లకు, నిరుద్యోగులకు ఎంతో లాభం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రంథాలయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ప్రభుత్వం గ్రంథాలయ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి గ్రంథాలయ సంస్థల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. ప్రస్తుతం జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో ఎంపిక చేసిన చోట నూతన భవనాలు నిర్మిస్తున్నాం. విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న సీఎం జగన్.. గ్రంథాలయ వ్యవస్థను విప్లవాత్మకంగా మారుస్తున్నారు. – మందపాటి శేషగిరిరావు, చైర్మన్, ఏపీ గ్రంథాలయ పరిషత్ సంస్థ -
లైబ్రరీల్లో సౌకర్యాల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లైబ్రరీల్లో అన్ని సౌకర్యాలను కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో లైబ్రరీలపై మంత్రి సమీక్షించారు. నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని, జిల్లా లైబ్రరీలను ఉదయం 8 నుంచి రాత్రి 9 వరకు, శాఖా గ్రంథాలయాలను ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు తెరిచే ఉంచాలని సూచించారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు ప్రత్యేక రీడింగ్ రూం ఏర్పాటు చేయాలన్నారు. పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ ముద్రించిన 42 పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. ‘మన ఊరు– మనబడి’ పథకం కింద ఎంపికైన స్కూళ్లలో గ్రంథాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు
సాక్షి, హైదరాబాద్: చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు.. తిరగని పంకాలు.. ఇదీ మన గ్రంథాలయాల్లో నెలకొన్న పరిస్థితి. రాష్ట్రంలో 80 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగ యువతకు గ్రంథాలయాల్లో కుర్చునేందుకు కుర్చీలు కూడా దొరకడంలేదు. ఉన్న కుర్చీలు ఎక్కడ నడ్డివిరుస్తాయోననే ఆందోళన.. ఫ్యాను తిరగక ఉక్కపోత వెరసి ఉద్యోగార్థులకు ఈ లైబ్రరీలు చెమటలు కక్కిస్తున్నాయి. మరోవైపు గ్రంథాలయాలకు రావాల్సిన నిధులకు స్థానిక సంస్థలు గండికొడుతున్నాయి. వసూలు చేసే ఆస్తిపన్నులో 8 శాతం రావాల్సిన సుంకాన్ని సైతం ఇవ్వకుండా ఎగ్గొడుతున్నాయి. నగర గ్రంథాలయ సంస్థకు జీహెచ్ఎంసీ ఏకంగా రూ.800 కోట్ల మేర బకాయిపడింది. ఈ నిధులు సకాలంలో రాకపోవడంతో పాత పుస్తకాలతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా..ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అవసరాల కోసం నెలకు రూ.15 లక్షలకు ఖర్చవుతున్నాయి. గ్రంధాలయాలు కిటకిట పోటీ పరీక్షల శిక్షణ సంస్థలన్నీ గ్రేటర్‌లోనే కేంద్రీకృతమయ్యాయి. కోచింగ్ కోసం ఇక్కడి అభ్యర్థులే కాకుండా తెలంగాణ, ఏపీ, ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థు లు కూడా ఇక్కడికే వస్తుంటారు. వీరిలో చాలా మంది ఆయా కోచింగ్ సెంటర్లు, వర్సిటీ, ఇతర గ్రం«థాలయాలకు సమీపంలోని ప్రైవేటు హాస్టళ్లు, గదులను అద్దెకు తీసుకుని ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. వాటిలో కంబైన్డ్ స్టడీస్‌కు అవకాశం లేకపోవడం, ఉన్న వాటిలోనూ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సమీపంలోని నగర, జిల్లా, మండల కేంద్ర గ్రంధాలయాలను ఆశ్రయిస్తున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర గ్రంధాలయం సహా చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, ఓయూ, తెలుగు విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలు అభ్యర్థులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ కావాల్సిన గ్రంథాల యాలు..ఏళ్ల తరబడి తాళపత్ర గ్రంథాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, నవలలు, సాహిత్యం, కథలు, నిఘంటవులు, న్యూస్ పేపర్లు, కరెంట్ ఎఫైర్స్ బుక్స్‌కే పరిమితవుతున్నాయి. కుర్చీ దొరకదు..ఫ్యాన్లు తిరగవు ఆయా గ్రంధాలయాల్లో విద్యార్థుల నిష్పత్తి మేరకు ఫర్నీచర్ లేకపోవడం ఇబ్బందిగా మారింది. అభ్యర్థులే స్వయంగా కుర్చీలు, ప్యాడ్లు కొనుగోలు చేసుకోవాల్సివస్తోంది. మార్కెట్లో రకరకాల పుస్తకాలు అందుబాటులోకి వస్తే..ఆయా గ్రం«థాలయాల్లో మాత్రం ఇప్పటికీ పాత పుస్తకాలే దర్శనమిస్తున్నాయి. పోటీ పరీక్ష ల పుస్తకాలే కాదు మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే విద్యార్థులు అడిగిన పుస్తకాలను కొను గోలు చేసి అందుబాటులో ఉంచుతున్నట్లు గ్రంథపాలకులు చెప్పుతున్నప్పటికీ..ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. పుస్తకాలు వితరణకు దాతలు సుముఖంగా ఉన్నప్పటికీ...వాటిని తీసుకుని భద్రపరిచేందుకు అనువైన స్థలం లేకపోవడం గమనార్హం. కనీస సదుపాయాలు లేవు ఇంట్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం లేదు. కోచింగ్ సెంటర్లకు వెళ్లే ఆర్థిక స్తోమత కూడా లేదు. గ్రంథాలయంలో ఏకాంతంగా కూర్చొని నచ్చిన పుస్తకాన్ని చదువుకోవచ్చని భావించి ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడ కూర్చొని చదువుకునేందుకు కుర్చీలే లేవు. మేమే స్వయంగా వీటిని సమ కూర్చుకోవాల్సి వస్తుంది. వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన ఫ్యాన్లు కూడా లేవు. ఉన్నవాటిలోనూ చాలా వరకు పని చేయడం లేదు. –హరికృష్ణ, మెదక్ భోజనం, మంచినీటి వసతి కల్పించాలి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం రూ.5 భోజనం సరఫరా చేస్తుంది. అయితే నాణ్యత లేకపోవడంతో తినలేకపోతున్నాం. హోటళ్లలో తిందామంటే ఖర్చులకు డబ్బులు కూడా లేవు. ఖాళీ కడుపుతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు గ్రంధాలయంలో తాగునీరు కూడా లేకపోవడంతో బాటిళ్లను వెంట తెచ్చుకోవాల్సి వస్తుంది. కుర్చీలు లేక చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది. –శివకుమార్, సంగారెడ్డి (చదవండి: పక్కాగా లెక్క.. బడి బయట పిల్లలెందరు..?) -
World Book Day 2021: చలో..‘బుక్’అయిపోదాం..
ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమట.. అప్పట్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పారు.. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఈ రోజు (ఏప్రిల్ 23) ప్రపంచపుస్తక దినోత్సవం.. పుస్తకం గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే.. అందుకే ఈసారి వాటికి నిలయమైన గ్రంథాలయాల గురించి తెలుసుకుందాం.. ఇవి ప్రపంచంలోనే డిఫరెంట్ లైబ్రరీలు.. చలో మరి.. దీని వయసు 1,162 ఏళ్లు ప్రపంచంలో ఇప్పటికీ నిలిచిఉన్న పురాతన లైబ్రరీ మొరాకోలోని ‘ది అల్ ఖారవియిన్ లైబ్రరీ’. క్రీస్తుశకం 859లో ఫాతిమా అల్ ఫిహ్రీ అనే సంపన్న మహిళ దీనిని కట్టించారు. ఇందులో ఎన్నో పురాతనమైన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి.. మొరాకో ప్రభుత్వం ఈ మధ్యే ఈ బిల్డింగ్‌ను పునరుద్ధరించి.. ప్రజల కోసం ఓపెన్ చేసింది. 470 భాషలు.. 3.2 కోట్ల పుస్తకాలు అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉండే ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’ ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీ ఇదే. 470 భాషలకు చెందిన 3.2 కోట్ల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి . అందమైన నగిషీలు, మార్బుల్ ఫినిషింగ్‌తో అందమైన లైబ్రరీగానూ పేరుపొందింది. ప్రతినిధుల సభకు అనుబంధంగా ఉన్నా అక్కడి పౌరులెవరైనా వెళ్లి పుస్తకాలు చదువుకోవచ్చు. నేచురల్ లైటింగ్.. చూడటానికి డిఫరెంట్‌గా కనిపిస్తున్న ఈ బిల్డింగ్ ఈజిప్ట్‌లోని బబ్లియోథెకా అలెగ్జాండ్రియా లైబ్రరీ. ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద లైబ్రరీల్లో ఇదీ ఒకటి. ఈ లైబ్రరీకి 2002లో కొత్త బిల్డింగ్ కట్టించారు. పూర్తిగా సౌర కాంతి పడి పుస్తకాలు చదువుకునేలా రూపొందించారు.ఎక్కువ సంఖ్యలో పురాతన గ్రంథాల ఫొటో కాపీలు ఇక్కడ ఉన్నాయి. చదువుతూ.. రిలాక్స్.. లైబ్రరీ అంటే అంతా సైలెంట్, ఓ పక్కన కూర్చుని మీ చదువేదో మీరు చదువుకుంటారు కదా.. కానీ ఫ్రాన్స్‌లో సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసిన ‘లైర్ అ లా ప్లాగ్ (బీచ్ దగ్గర చదువుకోండి)’ లైబ్రరీలు మాత్రం వెరీ స్పెషల్. నచ్చిన పుస్తకమో, నవలో, మేగజైనో తీసుకుని.. బీచ్ ఇసుకలో అలా రిలాక్స్డ్గా చదువుకోవచ్చు. బీచ్‌ల వెంట ఆరెంజ్ పైకప్పు, ఎరుపు రంగు కుర్చీలను ఏర్పాటు చేశారు. బొమ్మల పుస్తకాలు.. బొమ్మలతో ఉండే కథల పుస్తకాలు.. చిన్నప్పుడు ఇష్టంగా చదివేవాళ్లం.. వాటిని ఇప్పుడు కూడా చదవొచ్చు.. జపాన్‌లోని ఇవాకీ సిటీలో ఉన్న ఈ లైబ్రరీకి వెళ్తే.. ఇక్కడ వెయ్యికి పైగా ఇలాంటి పిక్చర్ బుక్స్ ఉన్నాయి. లోపల సెటప్ సూపర్‌గా ఉంటుంది.. అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. -
బ్రాందీ వద్దు బుక్స్ కావాలి
తెలుగు రాష్ట్రాలలో గ్రంథాలయాలు, పుస్తక పఠనం ఆదరణ కోల్పోతుంటే ‘సెవన్ సిస్టర్స్’గా పిలువబడే ఈశాన్య రాష్ట్రాల్లో ‘రోడ్‌సైడ్ లైబ్రరీ’ల ఉద్యమం ఊపందుకుంది. మిజోరామ్‌లో మొదలైన రోడ్‌సైడ్ లైబ్రరీలు ఇప్పుడు అరుణాచల్‌ప్రదేశ్‌కు పాకాయి. నారంగ్ మీనా అనే గిరిజన స్కూల్ టీచర్ అక్కడ ‘వైన్ షాపుల కంటే గ్రంథాలయాలే ఎక్కువ కనపడేలా చేస్తాను’ అంటూ ప్రతిన బూని పని చేస్తోంది. ‘మా అమ్మ నిరక్షరాస్యతే నాకు చదువు అవసరాన్ని తెలియచేసింది’ అని ఆమె అంటోంది. నెల క్రితం వార్తల్లో వచ్చిన మీనా నేడు ఏ విధంగా ఉద్యమాన్ని విస్తరిస్తున్నదో తెలిపే కథనం... రోడ్డు పక్కన పూల చెట్లు కనిపించడం బావుంటుంది. కాని ఆ చెట్లకు పుస్తకాలు కాయడం ఇంకా బాగుంటుంది. ఈశాన్యరాష్ట్రాల్లో కొసాకు ఉండే అరుణాచల్ ప్రదేశ్‌లో వీధిలో నడుస్తుంటే లైబ్రరీలు కనిపించే ఉద్యమం మొదలైంది. రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో ఒక పుస్తకాల అర, రెండు బల్లలు, రాత్రి పూట చదువుకోవడానికి రెండు లైట్లు... దీనిని ‘రోడ్‌సైడ్ లైబ్రరీ’ అంటారు. అక్కడ ఎంతసేపైనా కూచుని పుస్తకం చదువుకోవచ్చు. నచ్చిన పుస్తకం పట్టుకుపోవచ్చు. ఇంట్లో తాము చదివేసిన పుస్తకాలను తెచ్చిపెట్టవచ్చు. గొప్ప మెదళ్లు రెండు చోట్ల తయారవుతాయి. ఒకటి తరగతి గదిలో. రెండు గ్రంథాలయంలో. గొప్ప వ్యక్తిత్వాలు కూడా ఈ రెండుచోట్లే రూపు దిద్దుకుంటాయి. ఆ విషయాన్ని కనిపెట్టింది ఇటానగర్‌కు చెందిన నారంగ్ మీనా అనే గవర్నమెంట్ స్కూల్ టీచర్. వెనుకబడిన తన రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు చైతన్యవంతం కావాలంటే లైబ్రరీలే మార్గం అని ఆమె రోడ్‌సైడ్ లైబ్రరీల ఉద్యమం మొదలెట్టింది. చదవండి: (వీధిలో విజ్ఞాన వెలుగులు) నారంగ్ మీనా ఏర్పాటు చేసిన రోడ్ సైడ్ లైబ్రరీలు గ్రంథాలయం మనసుకు చికిత్సాలయం ‘ఏ లైబ్రరీ ఈజ్ ఏ హాస్పిటల్ ఫర్ ది మైండ్’ అని ఉంటుంది మీనా నిర్వహిస్తున్న ‘నారంగ్ లెర్నింగ్ సెంటర్’ ఫేస్బుక్ పేజీలో. నాలుగేళ్ల క్రితం మీనా అరుణాచల్ ప్రదేశ్‌లోని గిరిజన మహిళలు తమ స్వావలంబన కోసం వివిధ ఉపాధి మార్గాలలో నైపుణ్యం పొందే నురంగ్ లెర్నింగ్ సెంటర్‌ను స్థాపించింది. దాని కార్యకలాపాల్లో భాగంగా రోడ్‌సైడ్ లైబ్రరీల స్థాపన మొదలెట్టింది. మొదటి లైబ్రరీ నెల క్రితం అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ నుంచి గంట దూరంలో ఉండే నిర్జులి అనే ఊళ్లో ఒక రోడ్డు పక్కన స్థాపించింది. ‘దాని కోసం నేను 20 వేల రూపాయలు ఖర్చు చేశాను. పది వేల రూపాయలు పుస్తకాలకు, పదివేలు స్టాండ్ తయారీకి’ అని నారంగ్ మీనా చెప్పింది. ‘మిజోరంలో ఇద్దరు అధ్యాపకులు (సి.లాంజువాలా, లల్లైసంగ్జూలీ) రోడ్‌సైడ్ లైబ్రరీలను స్థాపించారు. వారు అమెరికాలో ఇలాంటి లైబ్రరీలు చూసి స్ఫూర్తి పొందారు. వాటికి వచ్చిన ఆదరణ చూసి నేను ప్రేరణ పొందాను’ అని మీనా అంది. మంచి వైపు లాగడానికి ‘మేము పిల్లలకు చాక్లెట్లు ఇచ్చి వాళ్లను ఆకర్షించాము. కాని పెద్దలను లాక్కురావాలంటే పెద్ద పనే అయ్యింది’ అని నవ్వుతుంది మీనా. కాని మెల్లగా పెద్దలు కూడా వచ్చి కూచుంటున్నారు. ‘మా నాన్న రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. కాని ప్రత్యర్థులు ఆయనను హత్య చేశారు. మా అమ్మ నిరక్షరాస్యురాలు. 13 ఏటే పెళ్లి చేసుకొని బాదరబందీల్లో ఇరుక్కుంది. నేను, నా చెల్లెలు బాగా చదువుకున్నాం. బెంగళూరులో చదివాక అమెరికా వెళ్లే వీలున్నా నా ప్రాంతానికి ఏదైనా చేయాలని వెనక్కి వచ్చాను. చూస్తే దారుణమైన వెనుకబాటుతనం. అవినీతి. విలువల్లేనితనం కనిపించాయి. విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? పుస్తకాలు చదవకుండా వీళ్లు ఏం తెలుసుకుంటారు’ అనిపించి రోడ్‌సైడ్ లైబ్రరీ స్థాపించాను అందామె. వైన్‌షాపులు కాదు కావాల్సింది ‘వీధికొక వైన్‌షాప్ కాదు కావాల్సింది. లైబ్రరీ. మా రాష్ట్రంలో వైన్‌షాప్స్‌కు మించి లైబ్రరీలు కనిపించాలనేదే నా తపన.’ అందామె. నారంగ్ మీనా ప్రయత్నం దేశంలోనే కాదు విదేశాలలో కూడా ప్రచారం పొందింది. ఆమె లెర్నింగ్ సెంటర్‌కు కేరళ నుంచి పంజాబ్ వరకు ఎందరో రచయితలు, పుస్తక ప్రేమికులు పుస్తకాల బండిల్స్ పంపుతున్నారు. ‘మీ లైబ్రరీల్లో వీటిని ఉపయోగించుకోండి’ అని కోరుతున్నారు. నారంగ్‌కు తానేం చేస్తున్నదో స్పష్టత ఉంది. ‘మా రాష్ట్రంలో తిరప్ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం. రోడ్‌సైడ్ లైబ్రరీలు ఎక్కువ కావాల్సింది అక్కడే. అక్షరాస్యతను పెంచాలన్నా చదువు మీద ఆసక్తి కలగాలన్నా లైబ్రరీలు కళ్ల ముందు కనిపిస్తూ ఉండాలి. నేను ఆ ప్రాంతం మీద ఫోకస్ పెట్టాను’ అంది నారంగ్. వాక్యం రాయలేని విద్యార్థులు ‘నేను టీచర్‌గా మా విద్యార్థులను చూస్తున్నాను. సొంతగా వాక్యం రాయడం రావడం లేదు. పుస్తకాలు చదవకుండా వీరికి భాష ఎలా తెలుస్తుంది. వ్యక్తీకరణ ఎలా పట్టుబడుతుంది? పుస్తకం చదవకపోతే మాతృభాషను కూడా కోల్పోతాం. తల్లిదండ్రులు పిల్లలను పుస్తకాలు చదవడానికి ప్రోత్సహించాలి. ఇందుకు గట్టిగా ప్రయత్నించాలి’ అంటుంది నారంగ్. ఆమెలాంటి వారు ఈ దేశానికి గట్టిగా వంద మంది చాలు... పుస్తకాల చెట్లు వీధి వీధిన మొలవడానికి. ఈశాన్యరాష్ట్రాల ఉద్యమం దేశమంతా పాకాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
ఆధారాల మీద కొత్త వెలుగు
ఇలాంటి ప్రయత్నం తెలుగు ప్రాంతంలోనే విజయవంతమైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్, కలకత్తా సంచాలకుడు ఎస్పీ సేన్ 1978లోనే చారిత్రక ఆధారాలను పుస్తకంగా తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ అది సఫలం కాలేదు. భారతదేశంలో చరిత్ర గురించి ఆలోచించేవాళ్లు, చరిత్రకారులు, చరిత్ర ఆధారంగా సృజనాత్మక రచనలు చేసేవారు కూడా పురావస్తు శాఖకు వెళ్లడం కనిపించదని ప్రఖ్యాత చరిత్రకారుడు, రచయిత విలియం డాల్రింపుల్ ‘లాస్ట్ మొఘల్’ పుస్తకం పీఠికలో అంటారు. అది చదివినప్పుడు మనసు చివుక్కుమనే మాట నిజం. కానీ, కాస్త ఆలోచిస్తే అందులో కొంత సత్యం ఉందనే అనిపిస్తుంది కూడా. ఎందుకంటే 20వ శతాబ్దం ఆరంభం నుంచి తెలుగు ప్రాంతాలలోను, భారతదేశంలోను కూడా చరిత్ర రచనకు ఉపక్రమించిన పలువురు మనసావాచా ఆ పనిచేశారు. ఒక ఉదాహరణ: మల్లంపల్లి సోమశేఖరశర్మ ‘రెడ్డి రాజ్యాల చరిత్ర’. లేదా ఇటీవలే వచ్చిన పీవీ పరబ్రహ్మశాస్త్రి ‘కాకతీయులు’గ్రంథం. పరిపూర్ణమైన రీతిలో ఆధారాలను ఉపయోగించుకున్న చరిత్ర రచన ఎంత పరిపుష్టంగా ఉంటుందో ఆ పుస్తకాలు చెబుతాయి. కానీ తరువాత ఇంత ఖ్యాతి ఉన్న రచనలు తక్కువ. చరిత్ర రచన లేదా నిర్మాణానికి అత్యంత కీలకం– చారిత్రక ఆధారాలే. చారిత్రకత, విశ్వసనీయత ఆ ఆధారాలకు మరింత ముఖ్యం అంటుంది చరిత్రతత్త్వం. ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ వెలువరించిన ‘తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతికి ఆధారాలు’చరిత్రకారులనీ, సృజనాత్మక రచనలు చేసేవారిని ముమ్మాటికీ ఆధారాల పట్ల గౌరవం పెంచుకునేటట్టు, అలాంటి బాధ్యత గురించి మరింత అవగాహన పెంచడానికి దోహదం చేస్తుంది. చారిత్రక ఆధారాలంటే ఏమిటి? ఒక కాలపు చరిత్రను నిర్మించడానికి అనివార్యంగా తీసుకునే ఆ కాలపు ఆధారాలు. శిలాశాసనాలు, నాణేలు, విదేశీ పర్యాటకులరచనలు, పురాతన సాహిత్యం, స్థల పురాణాలు ఆ ఆధారాలను ప్రధానంగా అందిస్తాయి. వీటిలో మళ్లీ ప్రైమరీ అనీ, సెకండరీ అనీ ఉంటాయి. ఇలాంటి ఆధారాల పరంపరను క్రోడీకరించినదే ‘తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతికి ఆధారాలు’. క్రీస్తుపూర్వం 5000 (చరిత్ర పూర్వయుగం) నుంచి, క్రీస్తుశకం 2016 వరకు జరిగిన చరిత్రకు ఆధారాలను సంపాదకులు, రచయితలు ఈ ఉద్గ్రంథంలో పొందు పరిచారు. అందుకే ఇదొక గొప్ప ప్రయత్నమని చెప్పాలి. పదహారు అధ్యాయాలలో ఈ సమాచారం మొత్తం అందించారు. పురాతన, మధ్య యుగ, ఆధునిక చరిత్రలతో పాటు, సమీప గతానికి చెందిన ఆధారాలను కూడా ఇందులో గమనిస్తాం. ద్రవిడ విశ్వవిద్యాలయం (కుప్పం), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (హైదరాబాద్), ఇతర వదాన్యుల సహాయ సహకారాలతో మొత్తం తొమ్మిది వాల్యూంలలో తెలుగువారి చరిత్రను దాదాపు సంపూర్ణమనదగిన రీతిలో సంకలనం చేశారు. ఆ కృషికి ఈ ఆధారాల వాల్యూం పరాకాష్ట. చరిత్ర పూర్వయుగం, చరిత్ర ఆరంభ దశ, మధ్య యుగ చరిత్ర ఆరంభ దశ, ముసునూరి నాయకులు, రెడ్డి రాజులు, విజయనగర చరిత్ర, బహమనీలు, కుతుబ్‌షాహీల చరిత్ర, ఆధునిక ఆంధ్ర దేశ చరిత్ర, అసఫ్జాహీలు, కోస్తాంధ్ర, రాయలసీమ, హైదరాబాద్ స్టేట్, సమకాలీన ఆంధ్రప్రదేశ్, సాహిత్యాధారాలు, జానపద కళలు–సంస్కృతి, కళ–వాస్తు, లలితకళలు అన్న 16 అధ్యాయాలలో చారిత్రక ఆధారాలను విస్తారంగా ఇచ్చారు. అలాగే గ్రంథాలయాలు, ఇండియన్ హిస్టారికల్ రివ్యూ పత్రికలో అచ్చయిన వ్యాసాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వవిద్యాలయాల చరిత్ర శాఖలలో జరిగిన కృషి, ఆంధ్రప్రదేశ్ ఆర్కైవ్స్ ప్రచురణలు, ప్రముఖుల పత్రాలు, నెహ్రూ స్మారక గ్రంథాలయం (ఢిల్లీ) వంటి చోట లభ్యమయ్యే చారిత్రక ఆధారాలు ఏవో కూడా ఇందులో తెలుసుకోవచ్చు. ఇంకా ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్‌కు సమర్పించిన పత్రాల వివరాలు, తెలుగు పత్రికల జాబితా, గౌతమి గ్రంథాలయంలో లభ్యమవుతున్న గ్రంథాలు, వేటపాలెం సారస్వత నికేతన్‌లోని గ్రంథాల వివరాలు, లండన్‌లోని ఇండియా ఆఫీస్ గ్రంథాలయంలో లభించే గ్రంథాల పేర్లు కూడా ఈ వాల్యూంలో ఇచ్చారు. ఆ విధంగా చరిత్ర రచనకు ఈ వాల్యూం చక్కని దిశను చూపిందనే చెప్పవచ్చు. ఎన్. చంద్రమౌళి, సి.సోమసుందరరావు, డి. భాస్కరమూర్తి, కె. సూర్యనారాయణ, కేఎస్ కామేశ్వరరావు, అబ్దుల్ మాజిద్, ఏఆర్ రామచంద్రారెడ్డి, వి. లలిత, కనకదుర్గ వంటి చరిత్రకారులు ఈ ఆధారాల వాల్యూం కోసం శ్రమించారు. వకుళాభరణం రామకృష్ణ సంపాదకులుగా వ్యవహరించారు. ఈ పుస్తకాన్ని మండలి వెంకటకృష్ణారావు, పీవీ పరబ్రహ్మశాస్త్రిలకు అంకితం ఇవ్వడం సముచితంగా ఉంది. మరొక విషయం కూడా తప్పనిసరిగా ప్రస్తావించాలి. ఇలాంటి ప్రయత్నం తెలుగు ప్రాంతంలోనే విజయవంతమైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్, కలకత్తా సంచాలకుడు ఎస్పీ సేన్ 1978లోనే చారిత్రక ఆధారాలను పుస్తకంగా తీసుకురావాలని ఒక ప్రయత్నం చేశారు. కానీ అది సఫలం కాలేదు. ‘సోర్సెస్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా’పేరుతో ఆయా యుగాలకు అవసరమైన ఆధారాలను సంకలనం చేయడం సేన్ ఉద్దేశం. కానీ మొదటి భాగం మాత్రమే ఆయన వెలువరించగలిగారు. 1999లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ తెలుగువారి సమగ్ర చరిత్ర రచనా యజ్ఞానాన్ని ప్రారంభించింది. ఇది 2016కు పూర్తయింది. ఇప్పుడు ‘తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతికి ఆధారాలు’వాల్యూంతో మొదట వచ్చిన వాల్యూమ్లకు పరిపూర్ణత చేకూరినట్టయింది. అందులో నిక్షిప్తం చేసిన కొన్నివేల పేజీల చరిత్రకు ఆధారాలు ఈ వాల్యూంలో లభిస్తాయి. ఈ కృషి ఒక అద్భుతం. ఈ భారాన్ని మోసిన చరిత్రకారులందరికీ తెలుగువారు కృతజ్ఞులై ఉండాలి. (‘తెలుగు ప్రజల చరిత్ర, సంస్కృతికి ఆధారాలు’ పుస్తకం నేడు విజయవాడ పుస్తకోత్సవంలో ఆవిష్కరిస్తున్న సందర్భంగా...ముఖ్యఅతిథి మండలి బుద్ధప్రసాద్) –కల్హణ -
అద్దె భవనాలు.. అరకొర వసతులు
- 30 గ్రంథాలయాలకు సొంత భవనాల్లేవు - ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్న పాఠకులు - కదిరిలో ప్రారంభంగాని భవన నిర్మాణం కదిరి అర్బన్: కార్పొరేట్ కంపెనీలకు స్థలం కావాలంటే రెడ్ కార్పెట్ పరచి వేలాది ఎకరాలను దారాదత్తం చేసే పాలకులు అదే పది మందికీ విజ్ఙానాన్ని పంచే గ్రంథాలయాల నిర్మాణానికి 5 సెంట్ల స్థలం చూపమంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో మొత్తం 70 శాఖా గ్రంథాలయాలుంటే అందులో 40 గ్రంథాలయాలకు మాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. మిగిలిన 30 చోట్లా అద్దె భవనాల్లో అరకొర వసతులతో నెట్టుకొస్తున్నారు. అందులో 10 గ్రంథాలయాలకు రెవెన్యూవారు స్థలం కేటాయించగా, భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు గ్రంథాలయ శాఖాధికారులు తెలిపారు. మిగిలిన వాటికి కూడా స్థలం కేటాయిస్తే భవనాలు నిర్మించి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారు చెబుతున్నారు. కదిరి పట్టణంలోని గ్రంథాలయానికి పక్కాభవనం లేదు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా రెండవ అంతస్తులో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. అది చిన్నది కావడంతో నిత్యం వందలాదిగా వచ్చే పాఠకులు ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతూ చదువుకోవాల్సి వస్తోంది. పోటీ పరీక్షలకు ప్రశాంతంగా ప్రిపేర్ కాలేకపోతున్నామని అభ్యర్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికొచ్చేవారి వాహనాలను నిలుపుకొనేందుకు కూడా సౌకర్యం లేదు. రోడ్డుపైనే నిలిపి రావాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. నిధులున్నా నిష్ర్పయోజనం కదిరిలో గ్రంథాలయానికి పక్కా భవనం నిర్మించేందుకు నిధులున్నాయని, స్థలం చూపితే చాలని ఆ శాఖాధికారులు గతంలో ఎన్నోసార్లు చెప్పారు. ఈ క్రమంలో స్థలం కేటాయించాలని విద్యార్థి, ప్రజాసంఘాలు అప్పటి ఆర్డీఓ రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పక్కన ఉన్న 5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. కానీ గ్రంథాలయ శాఖాధికారులు భవన నిర్మాణం దిశగా చర్యలు వేగవంతం చేయలేదు. పదిమంది వస్తే నిండిపోతోంది గ్రంథాలయంలో నిరంతరం ఏదో విషయం తెలుసుకోవచ్చు. అందుకే విరామ సమయంలో ఇక్కడికి వస్తుంటాను. ఈ భవనం పట్టణ జనాభాకు అనుగుణంగా లేదు. పట్టుమని పదిమంది వస్తే నిండిపోతోంది. - శంకర్, రిటైర్డ్ డీఎల్పీఓ ప్రశాంతతకు భంగం ఈ గ్రంథాలయం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఉంది. ఇక్కడ ప్రతిరోజూ ఏదో ఒక ఆందోళన జరుగుతూనే ఉంటుంది. రణగొణధ్వనుల మధ్య ప్రశాంతంగా ఎలా చదువుకోగలం. అన్ని శాఖలకూ పక్కా భవనాలను నిర్మిస్తున్న ప్రభుత్వం గ్రంథాలయాలను విస్మరిస్తోంది. - మురళీకృష్ణ, పాఠకుడు, కదిరి ప్రతిపాదనలు పంపాము కదిరిలో గ్రంథాలయానికి పక్కా భవనం కోసం ప్రతిపాదనలు పంపాం. పై అధికారుల నుంచి అనుమతి రాగానే నిర్మాణం మొదలుపెడతాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠకులు చదువుకునేలా చూస్తాం. - లలిత, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, అనంతపురం -
అభివృద్ధికి నోచుకోని గ్రంథాలయాలు
పట్టిపీడిస్తున్న సమస్యలు నెల్లూరు(దర్గామిట్ట) : ఎందరో విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్‌ను నిర్ణయించే గ్రంథాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. వీటిని నిధులు, వసతుల లేమి.. సిబ్బంది కొరత, వసూలు కాని సెస్సు తదితర సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ప్రతి గ్రంథాలయాన్ని కంప్యూటరైజ్ చేస్తామన్న ప్రభుత్వ హామీ మాటలకే పరిమితమైంది. జిల్లాలో మొత్తం 61 లైబ్రరీలు ఉండగా.. వాటిలో ప్రభుత్వ భవనాల్లో 21, అద్దె భవనాల్లో 4, ఉచిత భవనాల్లో 36 ఉన్నాయి. వీటిలో చాలా వరకు భవనాలను రిపేరు చేయవలసిన అవసరమున్నది. చాలీ చాలని సిబ్బంది జిల్లాలోని అన్ని గ్రంథాలయల్లో 64 మంది సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. ఒకే గ్రంథాలయ అధికారి రెండు,మూడు చోట్ల ఇన్చార్జిలుగా వ్యవహరిస్తుండంతో సరైన దృష్టి సారించలేకపోతున్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది 8 మందిని నియమించామని.. వారిలోముగ్గురు లైబ్రేరియన్లు, ఒక రికార్డ్ అసిస్టెంట్, నలుగురు లైబ్రరీ హెల్పర్లు అని గ్రంథాలయ సంస్థ ఇన్చార్జి సెక్రటరీ ఎస్.సునీత తెలిపారు. జిల్లాలో పది లైబ్రరీలకు దాతల సహాయంతో మరమ్మతులు జరుగుతున్నాయని, మైపాడులో ఇటీవల ఓ దాత 2.50 లక్షలతో లైబ్రరీని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వేళలు పాటించని సిబ్బంది జిల్లాలోని ప్రతి గ్రంథాలయం ఉదయం 8 గంటల నుంచి 11గంటల వరకు, మద్యాహ్నం 4 నుంచి 7 గంటల వరకు తీయవలసి ఉండగా.. సిబ్బంది ఉదయం 10 గంటలకు వస్తున్నారని పాఠకులు ఆరోపిస్తున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఉపయోగపడేలా సరైన వేళలకు గ్రంథాలయాలను తెరవాలని కోరుతున్నారు. వసూలు కాని గ్రంథాలయ పన్ను(సెస్) జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీ ల్లో దాదాపు 8కోట్ల మేర సెస్ వసూలు కావలసి ఉంది. ఒక్క కావలిలోనే రూ.18 లక్షలు వసూలైనట్లు సమాచారం. సెస్ వసూలు చేస్తే తప్ప గ్రంథాలయాల నిర్వహణ కష్టంగానే ఉంటుంది.అయితే గ్రంథాలయాలకు కట్టవలసిన సెస్ ముని సిపాలిటీల సొంత అవసరాలకు వాడుకొంటున్నట్లు సమాచా రం. కాగా, వచ్చే మార్చి నాటికి దాదాపు 4 కోట్ల రూపాయల సెస్ వసూలు చేస్తామని ఇన్చార్జి సెక్రటరీ సునీత తెలిపారు. వసతులు సరిగా లేని కేంద్ర గ్రంథాలయం నెల్లూరులోని రేబాలవారి వీధిలో ఉన్న కేంద్ర గ్రంథాలయంలో వసతులు అంతంత మాత్రంగా ఉన్నాయి మహిళలు లైబ్ర రీకి వస్తే టాయిలెట్ సౌకర్యం లేదు. రాత్రి సమయాల్లో లైటిం గ్ సౌకర్యం తక్కువగా ఉండడం వల్ల చదువుకొనుటకు ఇబ్బం ది పడుతున్నామని పాఠకులు చెబుతున్నారు. గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే నిరుద్యోగులకు ఏ పుస్తకాలు ఎక్కడ ఉంటాయో తెలియని పరిస్థితి. మూడు కంపూటర్లు మాత్రమే ఉన్నాయి. పుస్తకాలకు సరైన బార్ కోడింగ్ లేదు. జిల్లా గ్రంథాలయాల్లో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ఎక్కడా జరిగినట్లు సమాచారం లేదు. ప్రత్యేక రూం కావాలి కేంద్ర గ్రంథాలయంలో రీడింగ్ రూంను ఉచిత కోచింగ్ సెంటర్‌కు ఇవ్వడంతో పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులు చెట్ల కింద చదుకోవలసి వస్తోంది. ముందు భాగం పేపర్ విభాగానికి కేటాయించడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం. నిరుద్యోగులకు ప్రత్యేక రీడింగ్ రూం ఏర్పాటు చేయాలి. – కే.రమేష్ వసతులు కల్పించాలి కేంద్ర గ్రంథాలయంలో వెనుక పక్క చెత్తా చెదారం చేరి దుర్గంధభరితంగా ఉందని, ఆ ప్రాంతంలో చెట్ల కింద చదువుకోలేకున్నామని ప్రభాకర్ తెలిపారు. కార్పొరేషన్ అధికారులు వెనుక భాగాన్ని శుభ్రపరచి టాయిలెట్ వసతులు కల్పించాలన్నారు. – పి.ప్రభాకర్ -
డిజిటలైజేషన్ దిశగా గ్రంథాలయాలు
అనంతపురం కల్చరల్ : రాష్ట్రంలో తొలిసారి ’అనంత’ కేంద్రంగా డిజిటల్ లైబ్రరీ రూపుదిద్దుకోనుంది. తాడిపత్రి, హిందూపురం తదితర చోట్ల కూ డా డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుకు ముమ్మురంగా పనులు సాగుతున్నాయి. అన్ని గ్రేడ్1, గ్రేడ్2 శాఖా గ్రంథాలయాలకు కూడా ఇటీవల ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. ప్రాచీన గ్రంథాల నుం చి నేటి ప్రచురణల వరకూ కంప్యూటరీకరణ చేపడుతున్నారు. ఆర్డీటీ వారి సహాయ సహకారాలతో దాదాపు రూ. 90 లక్షల వ్యయంతో ఆసే్ట్రలియా దేశం తరహాలో డిజిటలైజేష¯ŒS లైబ్రరీ నిర్మిస్తున్నా రు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 69 శాఖా గ్రంథాలయా లు, 9 గ్రామీణ గ్రంథాలయాలు, 70 పుస్తక నిక్షిప్త కేంద్రాలున్నాయి. వీటన్నింటిలో సోమవారం నుంచి 49వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించనున్నారు. జిల్లా చరిత్ర ఘనం.. పప్పూరు రామాచార్యుల వంటి ఉద్దండులు సాగించిన గ్రంథాలయ ఉద్యమం కారణంగా జిల్లా కేంద్రంలో 1952 ఏప్రిల్ 2న గ్రంథాలయం ఏర్పాౖటెంది. 1958లో రాయదుర్గం, గుంతకల్లు, పెనుకొండ, గుత్తి పట్టణాల్లో శాఖా గ్రం థాలయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో వివిధ కేంద్రాల్లో దాదాపు 4 లక్షల 25 వేల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. గత ఏడాది 14,875,12 మంది గ్రంథాలయాలకు హాజరయ్యారని సమాచారం. ఈ సంవత్సరం పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలు వచ్చినందున సుమారు 20 లక్షల మంది లైబ్రరీలను సద్వినియోగం చేసకున్నారని అధికారులు చెపుతున్నారు. సమస్యలతో సతమతం అనేక గ్రంథాలయాల్లో సౌకర్యాలు లేక పాఠ కులు ఇబ్బందులకు గురవుతున్నారు. పలు లైబ్రరీల్లో టాయ్‌లెట్స్, తారునీటి సదుపాయం లేదు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించక పోవడంతో వసతుల లేమి కనపడుతోంది. సిబ్బందికి 010 కింద జీ తా లు రావాలని, తమకు ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని చాలా కాలంగా గ్రంథాలయ ఉద్యోగ సంఘాలు పో రాటం చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని మహిళా లైబ్రరీ ప్రాంగణంలో నిర్మాణాలు నిరుపయోగంగా ఉన్నాయి. 36 గ్రంథాలయాలకు సొంత భవనాలుండగా, మరో 25 ఉచిత భవనాల్లో, 9 గ్రంథాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. స్థలాలున్నా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. -
గ్రంథాలయాలకు సొంత భవనాలు
- రూ. 1. 40 కోట్లతో నిర్మాణ పనులు – 20 గ్రంథాలయ శాఖల్లో వచ్చే నెల నుంచి బయోమెట్రిక్ విధానం -జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి కోవెలకుంట్ల: జిల్లాలో మొదటి విడత కింద ఏడు గ్రంథాలయ శాఖలకు రూ. 1.40 కోట్లతో సొంత భవనాలు నిర్మిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంగళవారం కోవెలకుంట్ల శాఖ గ్రంథాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు. లైబ్రరీలో వివిధ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 59 గ్రంథాలయ శాఖలు ఉండగా 12కు సొంత భవనాలు ఉన్నాయని, 27 శాఖలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయని 25 శాఖలను పంచాయతీ భవనాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సొంత భవనాలు నిర్మించేందుకు 20 మండలాల్లో స్థలాలు సేకరించామని, బనగానపల్లె, పత్తికొండ, వెలుగోడు, దేవనకొండ, ప్యాపిలి, అవుకు, ఆత్మకూరు పట్టణాల్లో సొంత భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండవ విడతలో మరో 9 భవనాలు నిర్మించేందుకు డైరెక్టరేట్‌కు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఆయా గ్రంథాలయాల్లో పర్మీచర్కు రూ. 10లక్షలు నిధులు కేటాయించామన్నారు. సొంత భవనాలు ఉన్న గ్రంథాలయాల్లో కంప్యూటర్, ఇంటెర్నెట్ సౌకర్యం కల్పించేందుకు రూ. 5 లక్షలు నిధులు విడుదలయ్యాయన్నారు. వచ్చే నెల నుంచి కోవెలకుంట్లతోపాటు జిల్లాలోని 20 గ్రంథాలయ శాఖల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ఆయాగ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల నుంచి గ్రంథాలయ శాఖలకు రూ. 4 కోట్ల సెస్ బకాయి ఉందని, త్వరగా ఆయా విభాగాల అధికారులు బకాయి చెల్లించి గ్రంథాలయాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
గ్రంథాలయాల్లో మరిన్ని పోటీపరీక్షల పుస్తకాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యార్థులు, నిరుద్యోగులకు ఉపయుక్తంగా మరిన్ని పోటీ పరీక్షల పుస్తకాలను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అందుబాటులో ఉంచామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జయ్యవరపు శ్రీరామ్మూర్తి అన్నారు. స్థానిక జిల్లా శాఖా గ్రంథాలయంలో మంగళవారం పోలీస్ కానిస్టేబుల్స్ ఉచిత శిక్షణ తరగతులు ముగింపు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సహకారంతో పోటీ పరీక్షలకు యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు సుమారు 110 మందికి శిక్షణ పూర్తిచేశామని చెప్పారు. 50 రోజులపాటు ఉచిత శిక్షణ అందించడం అభినందనీయమని ఏలూరు, లింగపాలెం తహసీల్దార్లు కేవీ చంద్రశేఖరరావు, బి.సోమశేఖర్ అన్నారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సీహెచ్ మాదారు, కో–ఆర్డినేటర్లు డాక్టర్ గిరిబాబు, జె.రమేష్, ఎల్.వెంకటేశ్వరరావు, శిక్షణ ఉపాధ్యాయులు టి.విజయకుమార్ పాల్గొన్నారు. -
పుస్తకాలకు చెదలు
తడిసి ముద్దవుతున్న గ్రంథాలు శిథిలభవనాల్లో పుస్తక భాండాగారాలు పట్టించుకోని అధికారులు నర్సాపూర్: గ్రంథాలయాల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది గ్రంథాలయాల్లో ఐదింటి భవనాలు శిథిలావస్థకు చేరాయి. కౌడిపల్లిలోని గ్రంథాలయ భవనంలో పంచాయతీ రాజ్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా శివ్వంపేటలో భవన నిర్మాణ పనులు 15ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అమలుకు నోచుకోని ఎమ్మెల్యే, జెడ్పీచైర్పర్సన్ల హామీ నర్సాపూర్‌లోని ప్రభుత్వ గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరగా ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి గ్రంథాలయాన్ని సందర్శించి భవనం శిథిలావస్థకు చేరిన గ్రంథాలయాన్ని అద్దె భవనంలోకి మార్చాలని లైబ్రేరియన్‌కు సూచించారు. కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామని, అంతవరకు అద్దె భవనంలో నిర్వహించాలని, అద్దె తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వారు హామీ ఇచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇంత వరకు గ్రంథాలయాన్ని అదే భవనంలో కొనసాగిస్తున్నారు. దీంతో భవనం మరింత శిథిలం కావడంతో ఎప్పుడు కూలుతుందోనని పాఠకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా భవనంలోని రీడింగ్ గది పైకప్పు పెచ్చులూడి ఇనుప చువ్వలు బయటకు రావడంతో పాటు అంతటా ఉరుస్తున్నందున ఆ గదిని మూసేసి చిన్న పాటి గదిని రీడింగు రూంగా ఏర్పాటు చేశారు. గది ఉరుస్తున్నందున పుస్తకాలు తడవడంతో కొన్ని పుస్తకాలను బస్తాల్లో ఉంచి అటకపై పెట్టగా అక్కడ సైతం వర్షం నీరు పడడంతో పుస్తకాలు తడిసి చెదలు పడుతున్నాయని తెలిసింది. గ్రంథాలయంలో సుమారు 50వేల రూపాయల విలువ చేసే పుస్తకాలు తడిసి ముద్దయినట్లు తెలిసింది. వెల్దుర్తిలో రెండు భవనాలు శిథిలావస్థకు వెల్దర్తి మండలంలో రెండు గ్రంథాలయాలు ఉండగా రెండూ శిథిలావస్థకు చేరాయి. వెల్దుర్తిలో గ్రంథాలయాన్ని గ్రామ పంచాయితీ భవనంలోని ఒక గదిలో నిర్వహిస్తుండగా ఆ గది శిథిలావస్థకు చేరింది. 1988లో నిర్మించిన మాసాయిపేట గ్రంథాలయం శాశ్వత భవనంలో కొనసాగుతున్నా శిథిలావస్థకు చేరింది. రంగంపేటలో అధ్వానం కొల్చారం మండంలం రంగంపేటలో గ్రంథాలయం అధ్వానంగా ఉన్న గదిలో కొనసాగుతోంది. గ్రామ పంచాయితీ కార్యాలయానికి చెందిన ఓ గదిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయగా అది శిథిలావస్థకు చేరింది. కాగా కొల్చారంలోని గ్రంథాలయానికి పక్కా భవనం ఉన్నా పుస్తకాల సంఖ్యను పెంచాలని పాఠకులు కోరుతున్నారు. గ్రంధాలయ భవనం మరో శాఖకు కేటాయింపు కౌడిపల్లిలో గ్రంథాలయ నిర్వహణ పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు చిన్న చూపు చూస్తున్నారు. గ్రంథాలయ భవనాన్ని ఇతర శాఖకు కేటాయించడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. కౌడిపల్లిలో గ్రంథాలయం కోసం ఆరు నెలల క్రితం నిర్మించిన భవనాన్ని పంచాయితీ రాజ్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయానికి కేటాయించి గ్రంథాలయాన్ని గ్రామంలోని కమ్యూనిటీ హాలులో కొనసాగిస్తున్నారు. కాగా కమ్యూనిటీ హాలులో కరెంటు లేకపోవడంతో సాయంత్రం పూట పాఠకులు ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. శివ్వంపేటలో 15 ఏళ్లుగా నిర్మాణం మండల కేంద్రమైన శివ్వంపేటలో గ్రంథాలయ భవన నిర్మాణ పనులు సుమారు 15 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్లుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. భవన నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. హత్నూరలో ఉన్న ప్రభుత్వ గ్రంథాలయానికి సొంత భవనం ఉన్నా నిధులు తక్కువగా మంజూరు కావడంతో పత్రికలు కూడా తక్కువ సంఖ్యలో వస్తున్నాయని పాఠకులు కోరుతున్నారు. -
గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలు
కొమరబండ(కోదాడరూరల్): గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలని విశాఖపట్టణం జాయింట్ కలెక్టర్ లోతెట్టి శివశంకర్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొమరబండలో యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు . విద్యార్థులు, యువకులు, విద్యావంతులు ఇలాంటి గ్రంథలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, డాక్టర్ పెంటయ్య, ఎసీటీఓ రవీందర్, యువజనసంఘ సభ్యులు పాల్గొన్నారు. -
గతి లేని గ్రంథాలయాలు
కానరాని కొత్త పుస్తకాలు రెండేళ్లుగా ఇదే పరిస్థితి భర్తీ కాని పోస్టులు స్థానిక సంస్థల నుంచి వసూలుకాని సెస్ పట్టించుకోని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏర్పడని గ్రంథాలయ పాలకవర్గం మంత్రి గంటా సొంత జిల్లాలోనే గ్రంథాలయాల దుస్థితి విశాఖపట్నం: ఒకప్పుడు విజ్ఞాన భాండాగారాలు.. నేడు నానాటికీ తీసికట్టుగా మారాయి. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధీనంలో ఉండే ఈ శాఖలో గ్రంథాలయాల పరిస్థితిపై శనివారం సాక్షి బృందం జరిపిన పరిశీలనలో పలు సమస్యలు వెలుగుచూశాయి. నగరం నడిబొడ్డున కేజీహెచ్ సమీపంలో రూ.కోట్ల విలువైన కేంద్ర గ్రంథాలయ సంస్థ భూమి ప్రస్తుతం సీఆర్పీఎఫ్ కేంద్రం ఆధీనంలో ఉంది. ఇక్కడ మల్టీస్టోర్డ కాంప్లెక్సు నిర్మించాలన్న ప్రతిపాదన గతంలో ఇదే మంత్రి ప్రతిపాదించినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో పరాయి పంచన, ఇరుకు గదుల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ పరిపాలన కార్యాలయం నెట్టుకొస్తోంది. దీనికోసం ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మతోపాటు యువజన, ప్రజా సంఘాలు అలుపెరగని పోరు సాగిస్తూనే ఉన్నాయి. ఏర్పడని గ్రంథాలయ పరిషత్ టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నేటికీ రాష్ర్టస్థాయి గ్రంథాలయ పరిషత్ ఏర్పడలేదు. జిల్లాలో మంత్రుల మధ్య నెలకొన్న విబేధాల కారణంగా సంస్థ నూతన పాలకవర్గం ఏర్పడలేదు. దీంతో కనీసం పాఠకులు కోరే పుస్తకాలు కొనే నాథుడు లేకుండా పోయారు. సెస్ జమచేయని స్థానిక సంస్థలు అరకొర సదుపాయాలతో..అద్దె భవనాలతో నడుస్తున్న శాఖా గ్రంథాలయ పరిస్థితి ఘోరంగా ఉంది. ఏటా రెండు శాతం గ్రంథాలయ సెస్ వసూలు చేస్తున్న స్థానిక సంస్థలు వాటిని జమ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. దీంతో కళ్లెదుటే రూ. కోట్లు ఆదాయం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. మున్సిపాలిటీల నుంచి రూ.30 లక్షలు, పంచాయతీల నుంచి రూ.50 లక్షలు, ఏపీఐఐసీ నుంచి మరో రూ.60 లక్షలమేర బకాయిలు ఉన్నాయి. జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలతోపాటు ఏపీఐఐసీలు క్రమం తప్పకుండా బకాయిలు చెల్లిస్తున్నాయి. ఇవి కూడా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలు చెల్లించాల్సి ఉంది. భర్తీకాని పోస్టులు గ్రంథాలయాలను సిబ్బంది కొరత వేధిస్తోంది. పర్మినెంట్, పార్ట్‌టైం, అవుట్సోర్సింగ్ పోస్టుల్లో సగానికి పైగా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో శాఖా గ్రంథాలాయల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. చాలా గ్రంథాలయాలు వారానికి రెండు మూడు రోజులు కూడా తెరచుకోని దుస్థితి నెలకొంది. కొన్ని గ్రంథాలయాల్లో సిబ్బంది ఒకరు ఉన్నచోట సెలవు పెడితే మూతపడినట్టే. కొన్ని గ్రంథాలయాల నిర్వహణ స్వీపర్లు, అంటెడర్లపై ఆధారపడ్డాయి. పాలవకర్గం లేక ప్రశ్నించే నాథుడు కరువయ్యారు. రాష్ర్ట స్థాయిలో పరిషత్, జిల్లాస్థాయిలో పాలకవర్గం లేకపోవడంతో రెండేళ్లుగా ఒక్క పుస్తకం కొన్న పాపాన పోలేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన పుస్తకాలు కానరావడం లేదు. గతంలో ట్రైబల్ సబ్‌ప్లాన్, ఎస్సీ సబ్‌ప్లాన్‌తో పాటు ఆర్థిక సంఘం నిధులు కూడా గ్రంథాలయ సంస్థలకు కేటాయించేవారు. నేడు ఇటు రాష్ర్టం కానీ..అటు కేంద్రం కానీ వీటి నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశాయి. సిబ్బంది జీతభత్యాలకు మినహా ఒక్క పైసా కూడా నిధులు కేటాయించడం లేదు. గంటాపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు విశాఖ జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ భవన నిర్మాణ విషయంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శాసన మండలిని తప్పుదోవ పట్టించారు. ప్రత్యూష కంపెనీకి తనకు సంబంధం లేదని 2014 సెప్టెంబర్ ఒకటిన మంత్రి గంటా శాసన మండలిలో తెలిపారు. ప్రత్యూష కంపెనీలో గంటాకు 26 శాతం వాటాలున్నాయి. స్పష్టమైన ఆధారాలున్నాయి. గ్రంథాలయ సంస్థ సొంత నిధులతో జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ స్థలంలో భవన నిర్మాణం చేపడతామని ఆ రోజునే మంత్రి శాసనమండలి హామీనిచ్చారు. 15 నెలలు గడచినా ఇంతవరకూ చర్యలు చేపట్టలేదు. అందుకే గంటాపై మండలిలో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాం. - ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ -
గ్రంథాలయాలకు పుస్తకాల కొరత
ఏలూరు (ఆర్ఆర్ పేట) : భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రజలను చైతన్య పరచడంలోను, అనంతర కాలంలో విజ్ఞాన గనులగాను భాసిల్లిన గ్రంథాలయాలు నేడు దీనస్థితిలో ఉన్నాయి. దీనికి కారణం గ్రంథాలయ సెస్సును వాటికి కేటాయించకపోవటమే. స్థానిక సంస్థలకు చెల్లించే పన్నులో ప్రతి రూపాయికి 8 పైసలు గ్రంథాలయ నిర్వహణ కోసం లైబ్రరీ సెస్సుగా ఉంటోంది. ప్రభుత్వం ఈ సొమ్ముతో గ్రంథాలయాలను నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం గ్రంథాలయాలపై శ్రద్ధ చూపకపోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిలిచిపోయిన అభివృద్ధి జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. నూతన భవనాల నిర్మాణం, పాఠకుల కోసం కొత్త పుస్తకాల కొనుగోలుకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపినా వాటికి అనుమతులు అందక పోవడంతో ఆయా పనులు నిలిచిపోయాయు. జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని లక్కవరం, గొల్లల కోడేరు, వీరవాసరం, టి.నరసాపురం, భీమడోలు, లింగపాలెం, చాగల్లు, నరసాపురం, పాలకొల్లు శాఖా గ్రంథాలయాలకు నూతన భవనాలు నిర్మాణానికి రూ.1.50 కోట్లతో బడ్జెట్లో ప్రతిపాదనలు పంపారు. నూతన పుస్తకాల కొనుగోలు కోసం రూ.51 లక్షలు, దీనిలో విద్యార్థుల పోటీ పరీక్షలకు అవసరమయ్యేలా ఆన్ డిమాండ్ పుస్తకాల కొనుగోలుకు రూ.9 లక్షలు, ఫర్నీచర్ కొనుగోలుకు రూ. 25 లక్షలు, చిల్లరమల్లర కొనుగోళ్ళు, ఉద్యోగుల జీతాల నిమిత్తం 2014 - 15 సంవత్సరానికి గాను రూ.18.90 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఆ ఏడాది బడ్జెట్ మంజూరు కాకపోవడంతో 2015 -16 సంవత్సరానికి కూడా అదే బడ్జెట్ ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకూ వాటికి అనుమతులు లభించక పోవడంతో గ్రంథాలయాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. నిధులున్నా ప్రయోజనం శూన్యం జిల్లాలోని శాఖా గ్రంథాలయాల అభివృద్ధికి గ్రంథాలయ సంస్థ వద్ద నిధులున్నాయి. వాటిని ఖర్చు పెట్టడానికి అనుమతులు లేకపోవడంతో ప్రయోజనం లేకపోతోంది. ఏటా గ్రంథాలయ సంస్థకు స్థానిక సంస్థల నుంచి రూ. 4 కోట్ల వరకూ నిధులు సమకూరుతాయి. కానీ కొన్ని స్థానిక సంస్థలు గ్రంథాలయ సంస్థకు సెస్సును చెల్లించడంలో జాప్యం చేస్తుండడంతో నిధులు అందడంలో ఆలస్యమౌతోంది. ఏలూరు నగర పాలక సంస్థ గ్రంథాలయ సెస్ బకాయిలు సుమారు రూ. 1కోటి ఉంది. అయితే జిల్లా గ్రంథాలయ సంస్థ వద్ద సుమారు రూ. 3 కోట్లు నిల్వ ఉన్నాయి. బడ్జెట్‌ను ఎవరు ఆమోదించాలి..? గ్రంథాలయ సంస్థల బడ్జెట్‌ను రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఆమోదించాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రంథాయల పరిషత్‌ను ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితిలో గ్రంథాలయ సంస్థల బడ్జెట్‌ను పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఆమోదించాల్సి ఉంటుంది. జిల్లా గ్రంథాలయ సంస్థ పంపిన బడ్జెట్‌కు అక్కడ ఆమోద ముద్ర పడలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకూ ఉన్న గ్రంథాలయ సంస్థల పాలక మండళ్లను రద్దు చేయడంతో వీటి పరిస్థితి మరీ దిగజారిపోయింది. సాధారణంగా పాలక మండళ్ళలో రాజకీయ నాయకులు, లేదా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల అనుయాయులు పదవులు నిర్వహిస్తారు. బడ్జెట్ ఆమోద సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వారే చొరవ తీసుకుని మంజూరు చేయించేందుకు కృషి చేస్తారు. ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థకు పాలక మండలి లేకపోవడంతో ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే నాథుడు కూడా కరువయ్యాడు. రెండేళ్లుగా జిల్లాలోని గ్రంథాలయాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ ప్రారంభం కాలేదు. -
మనిషే ఓ గ్రంథం...
పఠనాశైలి మహానగరాల నుంచి మారుమూల పట్టణాల వరకు గ్రంథాలయాలకు ఆదరణ అంతంత మాత్రంగా మారిన కాలం ఇది. యూనివర్సిటీ క్యాంపస్‌లలోని గ్రంథాలయాల దగ్గర యువ‘జన సమ్మర్దం’ కనిపించినా, వారందరూ చదివేది పోటీపరీక్షలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మాత్రమే. కథ, నవల, కవిత్వం వంటి కాల్పనిక సాహిత్యానికి పాఠకులు కరువైపోయిన గడ్డుకాలం ఇది. ఇదంతా మన దేశంలోని పరిస్థితి. పాశ్చాత్య దేశాల్లో దృశ్యం మరోలా ఉంది. పుస్తకాల్లో ఉన్న విషయాలను మించి తెలుసుకోవాలనే ఉత్సుకత, జిజ్ఞాస గల పాఠకుల కోసం కొన్ని దేశాల్లో ఏకంగా మానవ గ్రంథాలయాలే (హ్యూమన్ లైబ్రరీస్) నడుస్తున్నాయి. మొట్టమొదటి మానవ గ్రంథాలయం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో మొదలైంది. నగరంలోని హింసాకాండకు వ్యతిరేకంగా ప్రారంభమైన యువజన సంస్థ కొత్తగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో 2000 సంవత్సరంలో దీనికి నాంది పలికింది. గడచిన పదిహేనేళ్లలో ఈ మానవ గ్రంథాలయాలు మరిన్ని దేశాలకు విస్తరించాయి. చాలా గ్రంథాలయాలు మామూలు పుస్తకాలతో పాటు మానవ గ్రంథాల సేవలనూ అందిస్తున్నాయి. ఇవి పూర్తిగా ఉచితం. గ్రంథాలుగా ఉండదలచుకున్న వారు నిర్ణీత వేళల్లో గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంటారు. ఆ సమయంలో పాఠకులు ఎవరైనా వారిని ‘చదవ’వచ్చు. అంటే, మరేమీ లేదు... గ్రంథాలుగా అందుబాటులో ఉన్నవారి వద్దకు వెళ్లి కూర్చుంటే చాలు, వారు తమ అనుభవాలను పాఠకులతో పంచుకుంటారు. ప్రస్తుతం హంగేరీ, రుమేనియా, ఆస్ట్రియా, ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, ఇటలీ, హాలండ్, స్లోవేనియా, బెల్జియం, పోర్చుగల్, ఆస్ట్రేలియా దేశాల్లో ఇలాంటి మానవ గ్రంథాలయాలు పాఠకులతో కళకళలాడుతున్నాయి. త్వరలోనే బ్రెజిల్, చైనా, కొలంబియా, సైప్రస్, మలేసియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
లక్షల్లో సెస్ బకాయిలు
దండేపల్లి : గ్రంథాలయాలకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు చెల్లించే సెస్ బకాయిలు రూ.లక్షల్లో పేరుకుపోతున్నాయి. దీంతో జిల్లాలోని గ్రంథాలయాల్లో అ భివృద్ధి కుంటుపడుతోంది. సెస్ ద్వారానే గ్రంథాలయాలను అభివృద్ధి చేయాల్సి ఉన్నా.. వసూళ్లు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 52 గ్రంథాలయాలు ఉండగా.. 16గ్రంథాలయాలకు మా త్రమే సొంత భవనాలున్నాయి. 35 గ్రంథాలయాలను పంచాయతీ కార్యాలయాలు, ఉచిత భవనాల్లో నిర్వహిస్తుండగా ఖానాపూర్లోని శాఖ గ్రంథాలయాన్ని అద్దె భ వనంలో కొనసాగిస్తున్నారు. జిల్లాలో ప్రతిరోజూ సుమారుగా 5 వేల మంది పాఠకులు గ్రంథాలయాల సేవలను వినియోగించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 వేల మంది గ్రంథాలయ డి పాజిట్దారులు ఉన్నారు. రూ.50 లక్షల వరకు బకాయిలు.. గృహ వినియోగదారులు చెల్లించే ఇంటి పన్నులో నుంచి 8 శాతం పన్ను గ్రంథాలయాలకు చెల్లించాల్సి ఉంటుం ది. జిల్లాలోని 866 గ్రామపంచాయతీలు, ఏడు మున్సిపాలిటీల ద్వారా జిల్లా గ్రంథాలయ సంస్థకు ఏటా రూ. కోటి వరకు సెస్ వస్తుంది. ఇందులో మున్సిపాలిటీల ద్వారా సుమారుగా రూ.70 లక్షలు, పంచాయతీల ద్వా రా రూ.30 లక్షలు. అయితే సెస్‌లో అధిక బాగం మున్సిపాలిటీల నుంచే రావాల్సి ఉన్నా పూర్తిస్థాయిలో వసూలు కావడం లేదని గ్రంథాలయ సంస్థ అధికారులు అంటున్నారు. గ్రామ పంచాయతీల్లో కేవలం మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాల పంచాయతీలు మాత్రమే సెస్ చెల్లిస్తుండగా మిగతా జీపీల నుంచి అసలు సెస్ రావడం లేదంటున్నారు. మున్సిపాలిటీలు కూడా పూర్తిస్థాయిలో చెల్లించడం లేదు. ఏటా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు మాత్రమే వసూలవుతోంది. కుంటుపడుతున్న అభివృద్ధి.. గ్రంథాలయాల అభివృద్ధికి సెస్ ప్రధానం. గ్రంథాలయాలకు వచ్చే సెస్‌ను పుస్తకాలు, వివిధ దినపత్రికల కొనుగోలుకు, పార్ట్‌టైం వర్కర్లకు వేతనాలు, పుస్తక నిక్షిప్త కేం ద్రాల నిర్వహణకు వినియోగిస్తుంటారు. ఇవే కాకుండా నూతన భవనాల నిర్మాణానికి కూడా వాడుతుంటారు. సెస్ వసూలు లేక అభివృద్ధికి నోచుకోవడం లేదు. -
గ్రంథా‘లయ’తప్పుతోంది
ఒంగోలు: పఠనా కేంద్రాలుగా పరిఢవిల్లాల్సిన గ్రంథాలయాలు జిల్లాలో దీనావస్థలో నడుస్తున్నాయి. జిల్లాలో 65 మండల, 12 గ్రామీణ గ్రంథాలయాలుంటే వాటిలో కేవలం 25 గ్రంథాలయాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. వీటిలో కూడా సగం గ్రంథాలయాలు గత పదేళ్లలో నిర్మించినవే కావడం గమనార్హం. 28 ఏళ్ళుగా నూతన శాఖ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదంటే గ్రంథాలయాల పట్ల పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క ఎయిడెడ్ గ్రంథాలయమైన వేటపాలెం సారస్వత విద్యానికేతన గ్రంథాలయం జాతి యావత్తు ప్రశంసలు అందుకుంటుండగా మరోవైపు ఫ్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రంథాలయాలు మాత్రం రోజురోజుకూ పాఠకాదరణకు దూరమవుతున్నాయి. జిల్లాలో 65 గ్రంథాలయాలున్నాయి. వాటిలో గ్రేడ్ -1 కేటగిరీలో మార్కాపురం గ్రంథాలయం ఉండగా, మరో నాలుగు గ్రేడ్-2, అరవై గ్రంథాలయాలు గ్రేడ్-3 పరిధిలోనున్నాయి. ఇవి కాకుండా 12 గ్రామీణ గ్రంథాలయాలున్నాయి. జిల్లాలో చివరిగా గ్రంథాలయం ఏర్పాటైంది 1986లో కావడం గమనార్హం. అంటే 28 ఏళ్లుగా కనీసం ఒక్క నూతన శాఖ కూడా ప్రారంభం కాకపోవడాన్ని పరిశీలిస్తేనే గ్రంథాలయాల పట్ల ఎంతటి చిన్నచూపుందో అర్థమవుతోంది. అయితే ఈ సమస్యనుంచి తప్పించేందుకు బుక్ డిపాజిట్ సెంటర్లంటూ 48 ప్రారంభించినా అవి వాస్తవానికి నిరుపయోగమే. అధికారుల లెక్కల్లో ఉన్నట్లు చెబుతున్నా వాస్తవానికి అవి పనిచేస్తున్న దాఖలాలే లేవు. వారంలో శుక్రవారం మినహా అన్ని రోజులు పనిచేసే ఈ బుక్‌డిపాజిట్ సెంటర్లకు పంచాయతీ ఒక గదిని గ్రంథాలయ నిర్వహణ కోసం ఉచితంగా కేటాయించాలి. అందులో రోజుకు రెండు పత్రికలతోపాటు కొన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు. నెల రోజులపాటు కేవలం రూ.500లకోసం పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వీటి బాగోగులు చూసే నాథుడే కరవయ్యారు. 65 గ్రంథాలయాలలో సంతరావూరు, ముండ్లమూరు, మల్లవరం గ్రంథాలయాలు గ్రంథపాలకులు లేక ఏళ్ళ తరబడి మూతపడ్డాయి. కనిగిరిలో రికార్డు అసిస్టెంటే ప్రస్తుతం ఇన్‌ఛార్జి గ్రంథపాలకునిగా వ్యవహరిస్తున్నారు. మరో ముగ్గురు ఈ ఏడాది రిటైరయ్యేవారున్నారు. ఇప్పటివరకు 25 గ్రంథాలయాలకు మాత్రమే సొంత భవనాలలో నడుస్తుండగా 15 గ్రంథాలయాలు మాత్రం అద్దె ఇళ్ళల్లో ఏర్పాటు చేశారు. మిగిలినవి మాత్రం ఎటువంటి అద్దె లేకుండా పంచాయతీ భవనాలలో నడుస్తున్నాయి. ప్రస్తుతం పొదిలిలో రూ.17 లక్షలు, వై.పాలెం, త్రిపురాంతకంలలోని గ్రంథాలయాలకు రూ.10 లక్షలు చొప్పున నిధులు వెచ్చించి సొంత భవనాలను నిర్మిస్తున్నారు. ఇక మార్కాపురంలో రూ.7.50 లక్షలు, కంభంలో రూ.5.50 లక్షలతో అదనపు భవనాల నిర్మాణం చేపట్టారు. విజ్ఞాన కేంద్రాలపైనా విభజన భారం రాష్ట్రం విడిపోవడంతో విజ్ఞాన కేంద్రాలైన గ్రంథాలయాలకు ఈ ఏడాది ఇప్పటివరకు బడ్జెట్ కేటాయింపులే జరగలేదు. సాధారణంగా కనీసం కోటి రూపాయల బడ్జెట్ ఉంటుంది. కానీ ఇంతవరకు బడ్జెట్ కేటాయించకపోగా రోజువారీ నిర్వహణ విషయంలో కూడా 50 శాతం ఖర్చు తగ్గించుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అంటే పత్రికలు, మ్యాగజైన్లు, ఇంకా ఇతరత్రా అన్నింటిపైనా ఈ భారం పడింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు పెద్ద మొత్తంలో విద్యార్థులు వస్తుంటారు. రోజురోజుకు పెరుగుతున్న పోటీకి తగ్గట్లుగా అవసరమైన పుస్తకాలను గుర్తించి కొనుగోలుచేయాలి. కానీ నేడు పుస్తకాల కొనుగోలుకు అధికారులు వెనుకాడుతున్నారు. వారోత్సవాల నిర్వహణకు కోతలే సాధారణంగా గ్రంథాలయాల వారోత్సవాలకు ప్రభుత్వం ఇచ్చేదే మొక్కుబడి మొత్తం. అయితే ఈ ఏడాది అందులోను 50 శాతం కోతలు కోసేసింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వారం రోజుల కార్యక్రమాల నిర్వహణకు రూ.25 వేలు కేటాయించేది. కానీ ఈ ఏడాది రూ.12 వేలతో సర్దుకొమ్మన్నారు. ఇక గ్రేడ్-1, గ్రేడ్-2 గ్రంథాలయాలకు రూ.5 వేలు గత ఏడాది కేటాయించగా ఈ ఏడాది కేవలం రూ.2,500 మాత్రమే. ఇక మిగిలిన గ్రంథాలయాలకైతే గత ఏడాది రూ.1500 కేటాయించగా ఈ ఏడాది ఆ మొత్తాన్ని కూడా రూ.700 కుదించారు. ఈ కొద్దిపాటి మొత్తంతో వారం రోజులపాటు కార్యక్రమాల నిర్వహణే కాదు, నిర్వహించినట్లుగా ఆధారాలను, అన్ని రకాల బిల్లులను కూడా జిల్లా గ్రంథాలయానికి గ్రంథపాలకులు సమర్పించాల్సి రావడం గమనార్హం. ఈ మొత్తంలోనే కార్యక్రమాల నిర్వహణే కాదు...పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కనిపించని కొత్త పుస్తకాల ఊసు నవలల కోసం డబ్బులు వెచ్చించవద్దు...అన్నీ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలనే కొనుగోలుచేయాలంటూ రెండేళ్ల కిందటే సర్కారు హుకుం జారీ చేసింది. దీంతో పల్లెల్లో ఉన్న గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు రాకపోవడంతో సగం మంది పాఠకులు దూరమయ్యారు. ఆ తరువాత జిల్లాకు సంబంధించి పర్చేజింగ్ కమిటీ ఉంటుంది. అయితే దీనికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అధ్యక్షతన జరగాలి. కానీ ఆ పదవి ఖాళీగా ఉండడంతో మరింత అవరోధంగా మారింది. దీంతో తగ్గిన పాఠకాదరణను పెంచేందుకు గ్రేడ్-1 గ్రంధాలయ అధికారి నెలకు 7, గ్రేడ్-2 గ్రంథపాలకుడు నెలకు 5, మిగిలిన గ్రంథపాలకులు నెలకు ముగ్గురు చొప్పున కొత్త పాఠకులను (నూతన సభ్యుని చందా రూ.50) పెంచాలంటూ లక్ష్యాలను నిర్థేశించడం విడ్డూరం. కోటి రూపాయలకు పైగా సెస్ బకాయిలు: జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్సీహెచ్.వెంకట్రావు పంచాయతీలు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు అన్నీ కలిపి కోటి రూపాయలకుపైగా బకాయి పడ్డాయి. ప్రజలు చెల్లించే ఇంటి పన్నులో 8 శాతం గ్రంథాలయ పన్ను ఇమిడి ఉంటుంది. ప్రజలు మీసేవ, లేదా ఈ సేవల ద్వారా చెల్లించిన సమయంలో సంబంధిత మొత్తం జిల్లా గ్రంథాలయ సంస్థకు జమవుతుంది. ప్రజలు నేరుగా పంచాయతీ కార్యదర్శికి, మున్సిపాల్టీలలోని ఖజానా విభాగంలో చెల్లించిన సందర్భంలో మాత్రం గ్రంథాలయ పన్నుకు సంబంధించిన చెల్లింపులు గ్రంథాలయ శాఖ ఖాతాకు జమకావడంలేదు. కందుకూరు, మార్కాపురంల నుంచి వందశాతం పన్ను తమకు జమవుతుంది. కనిగిరి, అద్దంకి, చీమకుర్తి నగర పంచాయతీల నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తమ శాఖకు జమకాలేదు. -
వాడని కారుకు నిర్వహణ ఖర్చు!
వికారాబాద్: జిల్లా గ్రంథాలయంలో ఓ అవినీతి బాగోతం బయటపడింది. కారు వాడకున్నా నిర్వహణ ఖర్చు కింద ఓ అధికారి నెలకు రూ.15వేల బిల్లుపెట్టి తీసేసుకుంటున్నట్టు రికార్డులో నమోదైంది. జిల్లా గ్రంథాయలంలో నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి వి.శంక ర్‌రెడ్డికి ప్రభుత్వం జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను పరిశీలించడానికి కారు సౌకర్యం కల్పించింది. ఆయన నెలలో 25 రోజులపాటు ఆయా శాఖల గ్రంథాలయాలను పరిశీలించడానికి గానీ లేదా హైదరాబాద్‌లో ఉన్న హెడ్‌ఆఫీస్‌కు వెళ్లడానికి కారు ఉపయోగించుకోవచ్చు. కానీ శంకర్‌రెడ్డి కారు ఉపయోగించకుండానే దాని అద్దె, డీజిల్ ఖర్చు కింద నెలకు రూ.15 వేలు తీసుకుంటున్నారు. విషయం ఏమిటంటే ఆయన హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు కూడా కారులో రారు.. ట్రైన్లోనే వస్తారు. కానీ అద్దె కారును వాడుతున్నట్టు, దానికి నెలకు ఇంత ఖర్చవుతోందని లెక్కలు చూపిస్తున్నారు. ఇక జిల్లాలోని ఇతర గ్రంథాలయాలకు వెళ్లాలంటే జిల్లా గ్రంథాలయంలో పనిచేసే వారి బైక్‌మీద వెళ్తుంటారు. ఈ రూపంలో ఇప్పటివరకు శంకర్‌రెడ్డి గ్రంథాలయానికి సంబంధించి సుమారుగా రూ.7.20 లక్షలను దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే పుస్తకాలు, ఫర్నీచర్ కొనుగోళ్లలోనూ అవకతవకలు జరిగినట్టు అనుమానాలున్నాయి. నాకు కారు సౌకర్యం ఉంది.. నాకు నెలలో 15 రోజులు కారు వాడుకొనే వెసులుబాటు ఉంది. జిల్లాలో ఎక్కడైనా కారులో తిరగొచ్చు. అందుకుగాను ప్రతినెలా రూ.12 వేలు బిల్లు తీసుకుంటున్నా. కారు మాత్రం వాడడం లేదు. - వి.శంకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి -
గతి తప్పిన గ్రంథాలయాలు
ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ నియోజకవర్గంలో గ్రంథాలయాల పరిస్థితి అసౌకర్యాల నడుమ కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో కొంత అభివృద్ధి చెందిన అసౌకర్యాలు పోలేదు. విద్యార్థులకు పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు లేవు. గ్రూపు పరీక్షలకు సంబంధించిన మెటిరియల్ లేక గత్యంతరం లేక వేల రూపాయలు ఖర్చుచేసి పుస్తకాలు కొనాల్సినపరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని రెండో గేటు ప్రారంభానికి నొచుకోవడం లేదు. అరకొరగా పుస్తకాలు పాతవాటినే వాడుతున్నారు. కొత్త పుస్తకాలు కొనుగోలు చేయడం లేదు. జైనథ్ మండల కేంద్రంలోని గ్రంథాలయాల ప్రాథమిక పాఠశాలలో అద్దె భవనంలో కొనసాగుతోంది. అక్కడ అటెండరే లైబ్రేరియన్‌గా మారాడు. లైబ్రేరియన్ ఉన్నా లేనట్టేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమయపాలన లేకుండా ఉంది. ఎప్పుడు తెరుస్తారో ఎప్పుడు తెరువరో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. సదరు లైబ్రేరియన్ గ్రంథాలయ సంస్థ నాయకుడిగా ఉన్నందున అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. బేల మండలంలోని గ్రంథాలయం మరాఠి మీడియం ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతోంది. వసతులు లేకుండా ఉంది. కేవలం న్యూస్‌పేపర్లు మాత్రమే ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేవు. ఎటు చూసినా అసౌకర్యాలే ఇచ్చోడ : చిరిగిన చొక్కా అయిన తొడుక్కొ.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కొ అన్నారో కవి. అంటే పుస్తక పఠనం ద్వారా కలిగే లాభాలు, అవగాహన మనిషికి ఎంత అవసరమో స్పష్టమవుతోంది. పుస్తకాలు కొనలేని వారు గ్రంథాలయానికి వచ్చి చదువుకుంటారు. కానీ గ్రంథాలయాల్లో అనింన రకాల పుస్తకాలు ఉండడం లేదు. నిధుల కొరతతో ఈ సమస్య ఉంది. దీంతో విజ్ఞాన భాండాగారాలుగా విలసిల్లాల్సిన గ్రంథాలయాలు ఏ జ్ఞానమూ అందించలేకపోతున్నాయి. గదులు సరిపోక పుస్తకాలు, పత్రికలను నిల్వ చేసే పరిస్థితి కూడా చాలాచోట్ల లేదు. ప్రభుత్వ పట్టింపులేనితనం ఈ దుస్థితికి కారణమవుతోంది. బోథ్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో గ్రంథాలయాలను అసౌర్యాలు వెంటాడుతున్నాయి. తలమడుగు, బోథ్, నేరడిగొండ, గుడిహత్నూర్ మండలాల గ్రంథాలయాలకు సొంత భవనాలు లేవు. పంచాయతీ కార్యాలయల్లో కొన్ని, అద్దె భవనాల్లో మరిన్ని కొనసాగుతున్నాయి. పుస్తకాలు పెట్టే స్థలం లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు గదుల్లో అసౌకర్యాల మధ్య చదవలేక పాఠకులు అవస్థలు పడుతున్నారు. ఇచ్చోడలో భవనం ఉన్నా సరిపడా ఫర్నిచర్ లేక పాఠకులకు ఇబ్బందులు తప్పడంలేదు. నేరడిగొండ మండలంలో గ్రంథాలయం పంచాయతీకి చెందిన ఇరుకు గదిలో కొనసాగుతోంది. బోథ్ గ్రంథాలయం 30 ఏళ్లుగా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఇచ్చిన భవనంలో అరకొర వసతులు మధ్య కొనసాగుతోంది. గుడిహత్నూర్‌లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఒకే గది దిక్కయిందిక్కడ. ఇక్కడి గ్రంథాలయ అధికారి తరచూ రాకపోవడంతో గ్రంథాలయం మూసే ఉంటోంది. బజార్హత్నూర్ మండల గ్రంథాలయానికి సొంత భవనం లేదు. దీంతో ప్రస్తుతం పశువైద్యశాలకు చెందిన భవనంలోనే తాత్కాలికంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇక్కడ పాఠకులకు తీవ్ర తిప్పలు తప్పడం లేదు. నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో? నిర్మల్ : నిర్మల్‌లో 1958లో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. మొదట గాంధీచౌక్‌లో ఓ అద్దె భవనంలో దీనిని నిర్వహించారు. 1960లో పౌర గ్రంథాలయ చట్టం అమలులోకి రావడంతో డీఈవో పరిధిలోకి, అనంతరం గ్రంథాలయాలకు ప్రత్యేక శాఖ ఏర్పడడంతో 1962లో గ్రంథాలయశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతూ వస్తోంది. అద్దె భవనం కావడం, అక్కడ సమస్యలు తెలత్తడంతో 2004 నవంబర్‌లో నిర్మల్ పాలించిన పాలకులు నిర్మించిన వందల ఏళ్ల నాటి సర్ద్మహాల్ (శీతలమందిరం)లోకి మార్చారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న భవనం పురాతనమైనది కావడం, ఒకటే గది ఉండడం అది కూడా పుస్తకాలను భద్రపర్చేందుకే సరిపోతోంది. దీంతో వచ్చే పాఠకులు ఆరుబయటే చదువుకునే పరిస్థితులు నెలకొంటున్నాయి. అలాగే భవనం వెనుకభాగంలో ఉన్న బావిలో నుంచి విషసర్పాలు, తేళ్లు వంటి వస్తుండడంతో అధికారులు, పాఠకులు భయాందోళనల మధ్య పఠించే పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రంథాలయ ఆధునికీకరణకు గతంలో అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. కానీ నేటికీ అవి ఆచరణకు నోచుకోలేదు. నియోజకవర్గంలోని మామడలో పురాతన భవనంలోనే గ్రంథాలయం కొనసాగుతోంది. మిగతా మండలాలకు గ్రంథాలయ భవనాలున్నా ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. -
ఆన్లైన్లో గ్రంథాలయ సేవలు
నర్సీపట్నం టౌన్ : గ్రంథాలయాలు ఆధునికీకరణను సంతరించుకున్నాయి. పోటీ పరీక్షల కాలంలో బ్యాంకు ఉద్యోగాలు, డీఎస్సీలకు సిద్ధమవుతున్న యువతకు ఎంతో సమాచారాన్ని అందిస్తూ బాసటగా నిలుస్తున్నాయి. జిల్లా కేంద్రం తరువాత నర్సీపట్నం గ్రంథాలయాన్ని అన్ని హంగులతో పాటు అన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తే పట్టణ వాసులకు మరింత సమాచారం పొందగలుగుతారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు అందుబాటులో ఉన్న గ్రంథాలయాల సమగ్ర సమాచారం, అందులోని పుస్తకాల వివరాలను అన్లైన్లో పొందుపర్చి వాటిని ఏ గ్రంథాలయం నుంచైనా వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు. నిత్యం వేల మందికి పైగా పాఠకులు పుస్తకాలు, పత్రికలు కోసం గ్రంథాలయాలకు వస్తున్నారు. చాలా గ్రంథాలయాల్లో కావలసిన పుస్తకాలు, పోటీ పరీక్షల మ్యాగజైన్లు అందుబాటులో ఉండటం లేదు. వాటిని అడిగితే ఆ గ్రంథాలయాధికారులు పై అధికారులకు తెలియజేశాం.. వస్తున్నాయంటూ దాటవేస్తున్నారు. ఇప్పుడు అలా ఎదురుచూపులు చూడాల్సిన అవసరం లేదు. కావలసిన పుస్తకాలు, గ్రంథాల గురించి నేరుగా వెబ్సైట్ ద్వారా కంప్యూటర్లో రాష్ట్ర గ్రంథాలయ డెరైక్టరేట్‌కు తెలియజేసే వీలుంది. పబ్లిక్ లైబ్రరీ, ఎపీ ఎన్ఐసీ ఇన్ వెబ్‌సైట్‌ను టైపు చేయాలి. అప్పుడు గ్రంథాలయ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీనికి ఎడమవైపు అన్‌లైన్‌బుక్ రిక్వెస్ట్ ఫారంపై క్లిక్ చేస్తే సంబంధించిన ఫారం వస్తుంది. అక్కడ రాష్ర్టంలోని మండలాల వారీగా గ్రంథాయాలు సహా అన్ని వివరాలు కనిపిస్తాయి. మనం డిమాండ్ చేస్తున్న గ్రంథాలయం, కావలసిన పుస్తకం, రచయిత పేరు, మీ పేరు, చిరునామా పూర్తి చేసి సెండ్ చేసి పంపాలి. ఆ విజ్ఞప్తి మేరకు సమాచారం డెరైక్టరేట్‌కు చేరుతుంది. అక్కడ ఏడు నుంచి 15 రోజులకోసారి దీనిపై సమీక్ష నిర్వహించి ఎక్కడెక్కడి గ్రంథాలయాల్లో ఏ పుస్తకాలు ఉండాలని పాఠకులు కోరుకుంటున్నారో వాటి కొనుగోలుకు అనుమతులు ఇస్తారు. నిరుద్యోగ యువతకు కావలసిన పుస్తకాలను అందుబాటులోకి తెచ్చుకునే అవకాశం ఉంది. దీనిలో భాగంగా జిల్లాలోని పాడేరు, చింతపల్లి, అరుకు ప్రాంతాల్లో రూ.25 లక్షల చొప్పున గ్రంథాలయాలను ఆధునీకరిస్తున్నారు. -
గ్రంథాలయాల మనుగడ ప్రశ్నార్థకం
హుజూర్నగర్, న్యూస్‌లైన్ జిల్లాలో గ్రంథాలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి దాపురించింది. గ్రంథాలయ సంస్థకు ప్రధాన ఆదాయమైన సెస్‌లు సకాలంలో సంస్థకు జమకాకపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ భారంగా మారింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీ రూల్స్1961 చట్టం ప్రకారం ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలలో వసూలయ్యే పన్నుల నుంచి సెస్ రూపంలో గ్రంథాలయ సంస్థకు చెల్లించాలి. అయితే ఈ విధానం ప్రకారం ప్రతి 100 రూపాయలకు ఎనిమిది రూపాయల సెస్‌ను చెల్లించాల్సి ఉంది. జిల్లాలోని 1169 గ్రామపంచాయతీలు, ఎనిమిది మున్సిపాలిటీల పరిధిలో ఎక్కడా ప్రతి సంవత్సరం సకాలంలో సెస్‌లను జమ చేయడం లేదు. అయితే, మూడేళ్లుగా జిల్లాలో సుమారు 2 కోట్ల 54 లక్షల రూపాయల బకాయి గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సి ఉంది. దీంతో జిల్లాలోని 40 గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలు, మౌలిక వసతుల ఏర్పాటు, ఫర్నిచర్ కొనుగోలు, భవనాల మరమ్మతుల వంటి పనులు చేపట్టలేని పరిస్థితుల్లో గ్రంథాలయ సంస్థ కొట్టుమిట్టాడుతుంది. ప్రభుత్వం గ్రంథాలయాల ఉద్యోగులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తూ ఇతర నిర్వహణకు నిధులు విడుదల చేయడం లేదు. నిధులు విడుదల చేయకపోవడానికి సెస్‌ల రూపంలో వచ్చే నిధులే ప్రధాన ఆదాయంగా ఉండడమే ప్రధాన కారణం. అంతేగాక జిల్లాలో 50 బుక్ డిపాజిట్ సెంటర్లను నిర్వహిస్తుండడంతో ప్రతి సెంటర్‌కు *1000 చొప్పున నెలకు రూ.50వేలు చెల్లించాల్సి రావడం, ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో బుక్ డిపాజిట్ కేంద్రాల ఏర్పాటుకు ఇటీవల పుస్తకాల కొనుగోలు చేయాల్సి రావడంతో తీవ్ర ఆర్థిక భారంతో సంస్థ కొట్టుమిట్టాడుతుంది. అంతేగాక ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలైన ప్రతి రూ.100నుండి చెల్లించాల్సిన రూ.8 సెస్‌ను నిబంధనలకు విరుద్ధంగా గ్రంథాలయ సంస్థకు సంబంధించిన 19010313001 కోడ్‌ను ఉపయోగించకుండా ఖజానాలో జమచేస్తుండడం వల్ల కూడా గ్రంథాలయాలకు సెస్ జమ కావడం లేదు. ఇటీవల ప్రభుత్వం సెస్ బకాయిల వసూళ్లకు నోటీసులు జారీ చే సినా ఫలితం లేదు. తిరిగి జిల్లా గ్రంథాలయ సంస్థ మరోమారు సెస్ బకాయిల వసూళ్లకు ప్రత్యేక చొరవ చూపుతూ నోటీసులు జారీచేస్తున్నట్లు సమాచారం. అంతుపట్టని అధికారుల మాయాజాలం జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో పెద్దపెద్ద పరిశ్రమలు, కర్మాకాగారాలు, ఫార్మా కంపెనీలున్నా ఆయా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే అధికారులు ఆస్తిపన్ను విధింపులో చేతివాటం ప్రదర్శిస్తూ కొద్దిమొత్తంలో పన్ను విధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా ఆస్తి విలువ ప్రకారం పన్ను విధింపు జరిగితే ఆదాయం పెరిగి గ్రంథాలయాలకు కూడా సెస్‌ల రూపేణా వచ్చే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఇటువంటి మాయాజాలం ప్రదర్శిస్తున్నారని పలుువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయమై కూడా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రంథాలయ సంస్థల అధ్యక్షులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. సెస్ బకాయిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు.. - అల్లం ప్రభాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి సెస్‌లు సకాలంలో రాకపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ భారంగానే ఉంది. అయితే సెస్ బకాయిల వసూలుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంలో భాగంగా ఫిబ్రవరి మొదటి వారంలో జిల్లా కేంద్రంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. గ్రంథాలయాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాం.