గ్రంథాలయ రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి
- రూ. 1. 40 కోట్లతో నిర్మాణ పనులు
– 20 గ్రంథాలయ శాఖల్లో వచ్చే నెల నుంచి బయోమెట్రిక్ విధానం
-జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి
కోవెలకుంట్ల: జిల్లాలో మొదటి విడత కింద ఏడు గ్రంథాలయ శాఖలకు రూ. 1.40 కోట్లతో సొంత భవనాలు నిర్మిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి చెప్పారు. మంగళవారం కోవెలకుంట్ల శాఖ గ్రంథాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించారు. లైబ్రరీలో వివిధ రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 59 గ్రంథాలయ శాఖలు ఉండగా 12కు సొంత భవనాలు ఉన్నాయని, 27 శాఖలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయని 25 శాఖలను పంచాయతీ భవనాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సొంత భవనాలు నిర్మించేందుకు 20 మండలాల్లో స్థలాలు సేకరించామని, బనగానపల్లె, పత్తికొండ, వెలుగోడు, దేవనకొండ, ప్యాపిలి, అవుకు, ఆత్మకూరు పట్టణాల్లో సొంత భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండవ విడతలో మరో 9 భవనాలు నిర్మించేందుకు డైరెక్టరేట్‌కు ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఆయా గ్రంథాలయాల్లో పర్మీచర్‌కు రూ. 10లక్షలు నిధులు కేటాయించామన్నారు. సొంత భవనాలు ఉన్న గ్రంథాలయాల్లో కంప్యూటర్, ఇంటెర్నెట్ సౌకర్యం కల్పించేందుకు రూ. 5 లక్షలు నిధులు విడుదలయ్యాయన్నారు. వచ్చే నెల నుంచి కోవెలకుంట్లతోపాటు జిల్లాలోని 20 గ్రంథాలయ శాఖల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ఆయాగ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల నుంచి గ్రంథాలయ శాఖలకు రూ. 4 కోట్ల సెస్ బకాయి ఉందని, త్వరగా ఆయా విభాగాల అధికారులు బకాయి చెల్లించి గ్రంథాలయాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ నరసింహారెడ్డి పాల్గొన్నారు.