గ్రంథాలయాలకు పుస్తకాల కొరత | lack of books in libraries | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాలకు పుస్తకాల కొరత

Published Sun, Aug 9 2015 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

lack of books in libraries

 ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రజలను చైతన్య పరచడంలోను, అనంతర కాలంలో విజ్ఞాన గనులగాను భాసిల్లిన గ్రంథాలయాలు నేడు దీనస్థితిలో ఉన్నాయి. దీనికి కారణం గ్రంథాలయ సెస్సును వాటికి కేటాయించకపోవటమే. స్థానిక సంస్థలకు చెల్లించే పన్నులో ప్రతి రూపాయికి 8 పైసలు గ్రంథాలయ నిర్వహణ కోసం లైబ్రరీ సెస్సుగా ఉంటోంది. ప్రభుత్వం ఈ సొమ్ముతో గ్రంథాలయాలను నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం గ్రంథాలయాలపై శ్రద్ధ చూపకపోవటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 నిలిచిపోయిన అభివృద్ధి
 జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. నూతన భవనాల నిర్మాణం, పాఠకుల కోసం కొత్త పుస్తకాల కొనుగోలుకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపినా వాటికి అనుమతులు అందక పోవడంతో ఆయా పనులు నిలిచిపోయాయు. జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలోని లక్కవరం, గొల్లల కోడేరు, వీరవాసరం, టి.నరసాపురం, భీమడోలు, లింగపాలెం, చాగల్లు, నరసాపురం, పాలకొల్లు శాఖా గ్రంథాలయాలకు నూతన భవనాలు నిర్మాణానికి రూ.1.50 కోట్లతో బడ్జెట్‌లో ప్రతిపాదనలు పంపారు. నూతన పుస్తకాల కొనుగోలు కోసం రూ.51 లక్షలు, దీనిలో విద్యార్థుల పోటీ పరీక్షలకు అవసరమయ్యేలా ఆన్ డిమాండ్ పుస్తకాల కొనుగోలుకు రూ.9 లక్షలు, ఫర్నీచర్ కొనుగోలుకు రూ. 25 లక్షలు,  చిల్లరమల్లర కొనుగోళ్ళు, ఉద్యోగుల జీతాల నిమిత్తం 2014 - 15 సంవత్సరానికి గాను రూ.18.90 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఆ ఏడాది బడ్జెట్ మంజూరు కాకపోవడంతో 2015 -16 సంవత్సరానికి కూడా అదే బడ్జెట్ ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకూ వాటికి అనుమతులు లభించక పోవడంతో గ్రంథాలయాల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది.
 
 నిధులున్నా ప్రయోజనం శూన్యం
 జిల్లాలోని శాఖా గ్రంథాలయాల అభివృద్ధికి గ్రంథాలయ సంస్థ వద్ద నిధులున్నాయి. వాటిని ఖర్చు పెట్టడానికి అనుమతులు లేకపోవడంతో ప్రయోజనం లేకపోతోంది. ఏటా గ్రంథాలయ సంస్థకు స్థానిక సంస్థల నుంచి రూ. 4 కోట్ల వరకూ నిధులు సమకూరుతాయి. కానీ కొన్ని స్థానిక సంస్థలు గ్రంథాలయ సంస్థకు సెస్సును చెల్లించడంలో జాప్యం చేస్తుండడంతో నిధులు అందడంలో ఆలస్యమౌతోంది. ఏలూరు నగర పాలక సంస్థ గ్రంథాలయ సెస్ బకాయిలు సుమారు రూ. 1కోటి ఉంది. అయితే జిల్లా గ్రంథాలయ సంస్థ వద్ద సుమారు రూ. 3 కోట్లు నిల్వ ఉన్నాయి.
 
 బడ్జెట్‌ను ఎవరు ఆమోదించాలి..?
 గ్రంథాలయ సంస్థల బడ్జెట్‌ను రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఆమోదించాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రంథాయల పరిషత్‌ను ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితిలో గ్రంథాలయ సంస్థల బడ్జెట్‌ను పౌర గ్రంథాలయ శాఖ సంచాలకులు ఆమోదించాల్సి ఉంటుంది. జిల్లా గ్రంథాలయ సంస్థ పంపిన బడ్జెట్‌కు అక్కడ ఆమోద ముద్ర పడలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి వరకూ ఉన్న గ్రంథాలయ సంస్థల పాలక మండళ్లను రద్దు చేయడంతో వీటి పరిస్థితి మరీ దిగజారిపోయింది. సాధారణంగా పాలక మండళ్ళలో రాజకీయ నాయకులు, లేదా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల అనుయాయులు పదవులు నిర్వహిస్తారు. బడ్జెట్ ఆమోద సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వారే చొరవ తీసుకుని మంజూరు చేయించేందుకు కృషి చేస్తారు. ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థకు పాలక మండలి లేకపోవడంతో ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే నాథుడు కూడా కరువయ్యాడు. రెండేళ్లుగా జిల్లాలోని గ్రంథాలయాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ ప్రారంభం కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement